Indian Railway: రైల్వే సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. రైల్వే బోర్డు పనితీరు, స్వతంత్రతను మరింతగా పెంచేందుకు ప్రస్తుత రైల్వే చట్టాలను సవరిస్తూ తీసుకొచ్చిన రైల్వే (సవరణ) బిల్లు 2024ను లోక్ సభ ఆమోదముద్ర వేసింది. రైల్వే సంస్థను ప్రైవేటీకరించబోమని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో దిగువ సభలో సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లు ఆమోదం పొందింది.
ప్రైవేటీకరణ వార్తల్లో వాస్తవం లేదు!
రైల్వే సవరణ బిల్లుపై లోక్ సభలో కీలక చర్చ జరిగింది. పలువురు విపక్ష సభ్యులు రైల్వే సంస్థను ప్రైవేటీకరించే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. ఈ సవరణల ద్వారా రైల్వేలను ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైల్వే బోర్డు పనితీరును మెరుగుపర్చడంతో పాటు దాని స్వతంత్రతను మరింతగా పెంచేందుకుకే రైల్వే సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటికైనా రైల్వే సవరణ బిల్లుపై అవాస్తవ ప్రచారాలను మానుకోవలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్షాల అభ్యంతరాలు, తోసిపుచ్చిన కేంద్రం
గత వారం రోజులుగా లోక్ సభలో తరచూ విపక్షాలు ఆందోళనలు కొనసాగడంతో బిల్లుపై చర్చ జరగలేదు. తాజాగా ఈ బిల్లుపై పూర్తిస్థాయిలో చర్చ నిర్వహించారు. రైల్వే చట్ట సవరణలు ప్రైవేటీకరణకు కారణం అవుతాయని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య పౌరులకు రైల్వే సేవలు దూరం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రైల్వేలోకి ప్రైవేట్ భాగస్వామ్యం పెరుగుతుందని విమర్శించారు. విపక్షాల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. రైల్వే సంస్థ ఎప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని తేల్చి చెప్పింది. “రైల్వే ప్రైవేటీకరణకు బిల్లు దారి తీస్తుందని కొంతమంది సభ్యులు చెప్పారు. ఇది పూర్తిగా అవాస్తవం. రైల్వేలను ఆధునీకరించడం, బలోపేతం చేయడమే మా లక్ష్యం. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించమం ”అని కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
రైల్వేసవరణ బిల్లు- 2024లో కీలక అంశాలు
రైల్వే బోర్డ్ కు మరింత స్వయం ప్రతిపత్తి, కార్యాచరణ సౌలభ్యాన్ని కల్పించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది. రైల్వే సంస్థకు సంబంధించిన రూలింగ్, నిర్ణయాధికారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఈ బిల్లులోని కీలక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ స్వతంత్రత: ఈ బిల్లు ద్వారా రైల్వే బోర్డు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
⦿ కార్యాచరణ సౌలభ్యం: రైల్వే కార్యకలాపాలకు సంబంధించిన కార్యాచరణ, ప్రతిస్పందన మెరుగుపడనుంది.
⦿ ఆధునిక పద్దతులు: మెరుగైన రవాణా కోసం రైల్వేబోర్డు గ్లోబల్ స్టాండర్డ్స్ తో అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించుకోవచ్చు.
తాజా రైల్వే సవరణ బిల్లుతో భారతీయ రైల్వే సంస్థ మరింత బలోపేతం అవుతుందని పలువురు రైల్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైల్వే బోర్డు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో ఎప్పటికప్పుడు రైల్వేల విస్తరణ, సేవలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుంది.
Read Also: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి, దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!