Meghalaya Tourism 2027: ప్రకృతి అందాలు, పచ్చని కొండలు, ఎత్తైన జలపాతాలు, స్వచ్ఛమైన నదులు సహా.. పర్యాటకులను ఆకట్టుకునే ఎన్నో ప్రత్యేకతలు మేఘాలయ సొంతం. అందుకే 2027లో కచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్రపంచంలోని 20 బెస్ట్ ప్లేసెస్ లిస్టులో ఈ ఈశాన్య రాష్ట్రానికి చోటు దక్కింది. అంతేకాదు, ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ పర్యాటక ప్రాంతం కూడా మేఘాలయనే కావడం విశేషం. శతాబ్దాల నాటి జీవ వేరు వంతెనలు, పవిత్ర అడవులు, స్థానిక సంస్కృతి, కమ్యూనిటీ బేస్ పర్యాటక విధానాలు టూరిస్టులను అద్భుతంగా ఆకట్టుకుంటాయి.
⦿ మొదటి రోజు- షిల్లాంగ్ సందర్శన
గౌహతి నుంచి ప్రయాణం ప్రారంభించి మేఘాలయ రాజధాని షిల్లాంగ్ చేరుకోవచ్చు. అక్కడ వార్డ్స్ సరస్సు, కేథడ్రల్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్, పోలీస్ బజార్ ప్రాంతాలను సందర్శించవచ్చు. కేఫ్‌లు, మ్యూజిక్ కాన్సర్ట్స్ తో పాటు లోకల్ ఫుడ్ కూడా రుచి చూడవచ్చు.
⦿ రెండో రోజు- మావ్‌ఫ్లాంగ్ అడవి
ఖాసీ సమాజం సంప్రదాయ పద్ధతుల్లో సంరక్షిస్తున్న మావ్‌ఫ్లాంగ్ పవిత్ర వనాన్ని సందర్శించాలి. దట్టమైన చెట్లు, ఫెర్న్ లు, పచ్చని పరిసరాలు ఇక్కడ ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి. టైమ్ ఉంటే లైట్ లమ్ కాన్యన్స్ ను కూడా చూడొచ్చు.
⦿ మూడో రోజు- జలపాతాలు, గుహలు
సోహ్రా (చిరపుంజి) ప్రాంతంలో నోహ్కలికై, సెవెన్ సిస్టర్స్ జలపాతాలను చూడొచ్చు. అర్వా గుహ, మాక్డాక్-డైంపెప్ వ్యాలీ వ్యూపాయింట్ కూడా ఈ ప్రయాణంలో సందర్శించవచ్చు.
⦿ నాలుగో రోజు- రూట్ బ్రిడ్జ్ ట్రెక్కింగ్
నోంగ్రియాట్‌లోని ప్రసిద్ధ డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ ను చూడటానికి ట్రెక్కింగ్ చేయాలి. టైర్నా నుంచి రాతిమెట్ల మార్గంలో లోయలోకి దిగాల్సి ఉంటుంది.
⦿ ఐదో రోజు- డావ్కి, ష్నాంగ్పడెంగ్
ఉమ్ంగోట్ నది స్వచ్ఛమైన నీటితో ఆకట్టుకుంటుంది. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు నదిలో పడవలు గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తాయి. బోటింగ్, కయాకింగ్ లాంటివి ఎంజాయ్ చెయ్యొచ్చు.
⦿ ఆరో రోజు – మావ్లిన్నాంగ్, జైంతియా కొండలు
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరు పొందిన మావ్లిన్నాంగ్ కు వెళ్లొచ్చు. అనంతరం క్రాంగ్ సూరి జలపాతం, నార్టియాంగ్లోని చారిత్రక ఏకశిలలను చూడొచ్చు.
⦿ ఏడో రోజు – ఉమియం సరస్సు
షిల్లాంగ్ సమీపంలోని ఉమియం సరస్సు ఈ టూర్ ను ఎండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్. ఇక్కడ సరస్సు అందాలను ఆస్వాదించడంతో పాటు బోటింగ్ కూడా చేయవచ్చు. అనంతరం గౌహతికి తిరుగు ప్రయాణం కావచ్చు.
పది రోజుల పర్యటనకు ప్లాన్ చేస్తే గారో కొండలకు కూడా వెళ్లొచ్చు. ఎనిమిదో రోజు తురా పట్టణానికి చేరుకుని స్థానిక సంస్కృతిని తెలుసుకోవచ్చు. తొమ్మిదో రోజు నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్‌లో ట్రెక్కింగ్ చేయవచ్చు. పదో రోజు స్థానిక గ్రామాలు, హస్తకళలు, సంప్రదాయాలను ఆస్వాదించవచ్చు.
నవంబర్‌లో షిల్లాంగ్ చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ సమయంలో ప్రయాణిస్తే వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలుసుకోవడం మంచిది.
Read Also: వందేభారత్ స్లీపర్‌లో కొత్త ఫుడ్ రూల్.. ఇకపై విమానాల్లో మాదిరిగా ఫుడ్ సర్వీస్!