India’s First Bullet Train: భారత్ లో ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తుండగా, త్వరలో బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముంబై- అహ్మదాబాద్ నగరాల నడుమ ఈ హైస్పీడ్ తన సేవలను కొనసాగించనున్నట్లు తెలిపారు. “ముంబై నుంచి అహ్మదాబాద్‌కు మొదటి బుల్లెట్ రైలు అతి త్వరలో ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి” అని వైష్ణవ్ తెలిపారు. ఈ రైలు ప్రారంభం తర్వాత రెండు నగరాల మధ్య ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాలు పడుతుందన్నారు.
హై-స్పీడ్ రైల్వే మార్గం
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)ను గుజరాత్ లోని వాపి, సూరత్, వడోదర, అహ్మదాబాద్, సబర్మతిని కలుపుతూ 508 కిలో మీటర్ల హై-స్పీడ్ రైలు కారిడార్ లో నడుస్తుంది. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. రెండు గంటల ఏడు నిమిషాల్లో ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ కారిడార్ లో మహారాష్ట్ర, గుజరాత్ రెండింటిలోనూ 12 స్టేషన్లు ఉంటాయి.
రూ.1,08,000 కోట్లతో బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం
ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు (MAHSR) ప్రాజెక్ట్ అంచనా వ్యయం ₹1,08,000 కోట్లు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ప్రాజెక్ట్ వ్యయంలో 81% అంటే ₹88,000 కోట్ల నిధులు సమకూరుస్తోంది. జపాన్ బుల్లెట్ రైలు సాంకేతికతను ఉపయోగించి భారత్ లో తొలి హై-స్పీడ్ రైలు ప్రయత్నానికి సపోర్టు చేస్తుంది.
బుల్లెట్ రైలు ఒప్పంద వివరాలు
2023లో, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఈ ప్రాజెక్ట్ కోసం రెండు హై-స్పీడ్ రైళ్లను రూపొందించడానికి, తయారు చేయడానికి మరియు కమిషన్ చేయడానికి BEML లిమిటెడ్‌కు ఒక ఒప్పందాన్ని ఇచ్చింది. ప్రతి హై-స్పీడ్ కారు ధర ₹27.86 కోట్లు. మొత్తం కాంట్రాక్ట్ విలువ ₹866.87 కోట్లు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జపనీస్ షింకన్‌సెన్ సాంకేతికతను ఉపయోగించి రెండు ట్రైన్‌సెట్‌లను అభివృద్ధి చేస్తారు.
2027 నాటికి అందుబాటులోకి..
అశ్విని వైష్ణవ్ తాజాగా లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో, గుజరాత్‌లోని వాపి నుంచి సబర్మతి విభాగం డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మొత్తం ప్రాజెక్ట్ డిసెంబర్, 2029 నాటికి పూర్తవుతుందని ఆయన తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ చాలా సంక్లిష్టమైన, సాంకేతికతతో కూడిన ప్రాజెక్ట్ అన్నారు.
మూడు రైళ్లను ప్రారంభించిన అశ్విని వైష్ణవ్
తాజాగా గుజరాత్ లోని భావ్ నగర్ టెర్మినస్ లో మూడు ఎక్స్ ప్రెస్ రైళ్లను అశ్విని వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించారు. భావ్ నగర్ టెర్మినస్ – అయోధ్య కాంట్ ఎక్స్ ప్రెస్, రేవా-పుణే ఎక్స్ ప్రెస్తో పాటు, జబల్ పూర్ ను రాయ్ పూర్ కు అనుసంధానించే కొత్త రైలును ప్రారంభించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరయ్యారు.
Read Also: వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ముందు పరుగులు తీసేది ఈ రూట్ లోనే!