Amrit Bharat express trains: రైలు ప్రయాణం అనుకుంటే, సర్వసాధారణమే అనుకొనే రోజులు పోయాయి. ఇప్పుడు రైలు ఎక్కితే కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టే. బయట మామూలుగానే ఉంటుంది కానీ లోపలికి అడుగుపెడితే అంతా కొత్తగా.. అంతా కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నారు రైల్వే ప్రయాణికులు. ఇదంతా సాధ్యపడినది కొత్తగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వల్లేనట. ఇది కేవలం ఓ రైలు కాదు, సాధారణ ప్రయాణికుడి జీవితాన్ని మారుస్తున్న వాహనం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమృత్ భారత్ రైళ్లు బాగా నడుస్తున్నాయి. ఇక వచ్చే రోజుల్లో దేశమంతా ఈ ట్రైన్ల ఊపే వేరుగా ఉండబోతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త అమృత్ భారత్ ట్రైన్స్ రానున్నాయి. దీనితో ప్రయాణికులకు సకల సదుపాయాల జర్నీ చేరువ కానుంది.
లగ్జరీ ట్రైన్స్ అంటే.. ఇవేనేమో!
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 30కి పైగా అమృత్ భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఇవి ముఖ్యంగా మధ్య తరగతి ప్రయాణికులకు దూర ప్రాంతాల ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతో, ఎక్కువ సౌకర్యంతో అందుబాటులోకి తెచ్చాయి. ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలతో, అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ కోచ్‌లు నాన్ – ఏసీ అయినా లగ్జరీ అనిపిస్తాయి.
ఇప్పుడెక్కడ ఈ ట్రైన్స్ నడుస్తున్నాయంటే?
ప్రస్తుతం అమృత్ భారత్ రైళ్లు ఉత్తరభారత రాష్ట్రాల్లో ఎక్కువగా నడుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బీహార్‌లో 4 కొత్త రైళ్లను ప్రకటించారు. అవి పాట్నా – వారణాసి, గయా – కోల్‌కతా, దర్భంగా – ఢిల్లీ, ముజఫర్‌పూర్ – రాంపూర్ మార్గాల్లో నడవనున్నాయి. ఈ 4 మార్గాల్లో రోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ఇప్పటి వరకు ఈ మార్గాల్లో ఉన్న రైళ్లు ఎక్కువగా నెమ్మదిగా ఉండేవి, తక్కువ సౌకర్యాలతో ఉండేవి. ఇప్పుడు అమృత్ భారత్ రైళ్లు రాకతో ప్రయాణంలో కొత్త ఊపొస్తోంది.
ఈ ట్రైన్స్ స్పెషాలిటీ ఏమిటంటే?
ఈ రైళ్ల ప్రత్యేకతల్లో ముందు చెప్పుకోవాల్సింది శుభ్రత. సాధారణ నాన్ – ఏసీ బోగీల్లో మనం ఎదుర్కొనే సమస్యలు.. గాలి సమస్య, టాయిలెట్ పరిస్థితి, సీట్ల అపరిశుభ్రత అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొత్తగా డిజైన్ చేశారు. బోగీల్లో మౌలిక సదుపాయాలన్నీ మెరుగుపరచబడ్డాయి. ఫ్యాన్లు మోటారు ఫ్యాన్లలా కాకుండా ఉంటాయి. లైట్లు మిరుమిట్లు గొలిపే వెలుగులను ఇస్తుంటాయి. టాయిలెట్లు స్పెషల్ యూరోపియన్ క్లాస్ ఫిట్టింగ్‌తో, నీటి సరఫరా సరిగ్గా ఉండేలా ఉన్నాయట. కిటికీ పక్కన హ్యాండిల్స్, బ్యాగ్ హోల్డర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇంతకీ ఈ అమృత్ భారత్ ట్రైన్స్ ఎక్కడెక్కడ నడుస్తున్నాయ్?
ఇండోర్ – ఖజురాహో, గౌహతి – బెంగళూరు, తిరుపతి – పుదుచ్చేరి, లక్నో – వారణాసి, ఒదెలగూడెం – విశాఖపట్నం, కోల్‌కతా – బెంగళూరు, రాంచీ – హజారిబాగ్, పూరీ – విశాఖ వంటి మార్గాల్లో ఇప్పటికే అమృత్ భారత్ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా చిన్న పట్టణాల ప్రజలకు ఇది ఒక వరంగా మారింది.
Also Read: Vijayawada trains: ఇక వెయిటింగ్ టెన్షన్‌కి గుడ్‌బై! ఈ రైళ్లకు ఏసీ కోచ్ ల పెంపు..
తెలుగు రాష్ట్రాలలో..
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, విశాఖపట్నం – భువనేశ్వర్, తిరుపతి – పుదుచ్చేరి మార్గాల్లో అమృత్ భారత్ ఇప్పటికే నడుస్తోంది. వీటికి మంచి స్పందన లభిస్తోంది. త్వరలో హైదరాబాద్ – విజయవాడ, కాకినాడ – బెంగళూరు, నంద్యాల – చెన్నై వంటి మార్గాల్లో కూడా అమృత్ భారత్ రైళ్లు వచ్చే అవకాశముంది. ఇది సాధారణ ప్రయాణికులకు ఊరట కలిగించడమే కాదు, రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలను బలోపేతం చేస్తుంది.
ప్రభుత్వం లక్ష్యం ఏమిటంటే.. ఈ రైళ్ల ద్వారా ప్రయాణ ఖర్చు తగ్గించాలన్నదే. దానితో పాటు చిన్న పట్టణాలను, మారుమూల ప్రాంతాలను మెట్రో నగరాలకు కలిపే బ్రిడ్జిలా ఈ రైళ్లు ఉండాలన్నది ఇండియన్ రైల్వే లక్ష్యం. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా కోచ్‌లు తయారు చేస్తోంది. బోగీలకు ఫ్యాషన్ లుక్‌కి తగ్గట్టుగా పెయింటింగ్, లోపల హ్యాండ్‌రెస్టులు, చైర్‌కార్ సెటప్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ రైళ్లు టెక్నాలజీ, డిజైన్, ప్రయోజనం.. మూడు పరంగా ఒక కొత్త ప్రయోగంగా నిలుస్తున్నాయని రైల్వే అంటోంది.
ఈ ప్రయాణం సామాన్యుడి గమ్యాన్ని సులభతరం చేస్తోంది. అందుకే ప్రస్తుతం రైలు ప్రయాణికులు సోషల్ మీడియాలో ఈ ట్రైన్లను మధ్య తరగతి వందే భారత్ అంటూ పిలుస్తున్నారు. నిజమే.. AC టికెట్ ధర తట్టుకోలేని వారికి ఇది ఒక ఆప్షన్ కాదు, ఓ అవకాశం. సామాన్యుడి చిల్లర, టికెట్‌లో కంఫర్ట్ కలిసే రోజులు వచ్చాయి. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలంటే మొహం చాటకుండా, సంతోషంగా ఎక్కే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం రైలు కాదు.. ఇది మారుతున్న భారత రవాణా ముఖచిత్రానికి చిహ్నంగా చెప్పవచ్చు. మరెందుకు ఆలస్యం.. త్వరలో రానున్న కొత్త అమృత్ భారత్ ట్రైన్స్ కు వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధం కండి!