దీపావళి, ఛత్ పూజ వేళ భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రయాణీకులకు రైలు ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రజలు పోస్టాఫీసులలో రైలు టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)తో అనుసంధానించబడిన పోస్టాఫీసులలో రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించింది. ఈ సేవ రైల్వే స్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో లేని ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
⦿ ప్రయాణీకులు సమీపంలోని PRS-ప్రారంభించబడిన పోస్టాఫీసుకు వెళ్లాలి.
⦿ వారి రైలు ప్రయాణ వివరాలు.. అంటే బోర్డింగ్ స్టేషన్, గమ్యస్థానం, ప్రయాణ తేదీ, రైలు నంబర్, రైలు పేరు, తరగతి లాంటి అసవరమైన వివరాలను అందించాలి.
⦿ ఆ తర్వాత పోస్టాఫీసు సిబ్బంది బుకింగ్ ను ప్రాసెస్ చేస్తారు.
⦿ పేమెంట్స్ పూర్తి చేసి రైల్వే టికెట్ ను వెంటనే ప్రింట్ చేస్తారు.
⦿ చెల్లింపులను నగదు లేదంటే డిజిటల్ గా చేసే అవకాశం ఉంది.
భారతీయ రైల్వే పోస్టాఫీసులో రైలు టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. ఈ పండుగ సీజన్ లో మారుమూల ప్రాంతాల ప్రయాణీకులు టికెట్లు బుకింగ్ ప్రక్రియ సులభతరం అయ్యింది. ఈ సర్వీసు గ్రామీణ, సెమీ అర్బన్, మారుమూల ప్రాంతాలను ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఎంపిక చేసిన పోస్టాఫీసులు రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)తో అనుసంధానించబడ్డాయి. దీని వలన ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ పోస్టాఫీసులలో ఎక్కువ భాగం గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో ఉన్నాయి.
⦿ సీనియర్ సిటిజన్లు, టెక్నాలజీ గురించి తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్లకు వెళ్లకుండానే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
⦿ఈ సేవ ఆన్ లైన్ బుకింగ్ పోర్టల్స్ మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. పీక్ ట్రావెల్ సమయాల్లో సర్వర్ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
⦿ రైలు టికెట్ల బుకింగ్ కోసం పోస్టాఫీసులను ఉపయోగించడం ద్వారా, రైల్వే పారదర్శకతను పెంచడం, ట్రావెల్ ఏజెంట్లపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
Read Also: తత్కాల్ సర్వీస్ లేకున్నా.. అదే రోజు కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగంటే!
⦿ ప్రస్తుతం ఈ సర్వీసు దేశం అంతటా 333 పోస్టాఫీసులలో అందుబాటులో ఉంది.
⦿ ప్రయాణీకులు జనరల్, స్లీపర్, ACతో సహా అన్ని తరగతులకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
మొత్తంగా పోస్టాఫీసులకు PRS-ఆధారిత బుకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, భారతీయ రైల్వే, ఇండియా పోస్ట్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రయాణికులకు ఈజీగా టికెట్లు అందించే అవకాశం ఉంటుంది. పండుగల సమయంలో ప్రయాణీకులు సులభంగా టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
Read Also: దీపావళికి వైజాగ్ వెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!