Begumpet Railway Station Redevelopment: హైదరాబాద్ లోని బేగంపేట రైల్వేస్టేషన్ సరికొత్త హంగులు అద్దుకుంటున్నది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో సరికొత్త రూపును సంతరించుకుంటోంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ. 38 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ అద్భుతంగా పునర్నిర్మాణం జరుగుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 26న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 26 కోట్ల వ్యయంతో ప్రారంభమైన తొలి ఫేజ్ పనులు పూర్తయ్యాయి. బేగంపేట రైల్వే స్టేషన్ ఎంట్రీ పాయింట్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే రాష్ట్ర పక్షి పాలపిట్ట సహా ఇతర బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇవి ప్రయాణీకులను బాగా ఆకట్టుకోనున్నాయి. స్టేషన్ పరిసరాలను కనువిందు చేసేలా తీర్చిదిద్దారు. ప్రకృతి అందాలతో అలరించేలా రూపొందించారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న రాయిని అందమైన పౌంటెన్ గా మలిచారు. పచ్చటి లాన్ లో ప్రకృతి ప్రేమికులు ఆహా అనిపించేలా డెవలప్ చేశారు.
విమానాశ్రయం తరహాలో అత్యాధునిక వసతులు
బేగంపేట రైల్వే స్టేషన్ లో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఎస్కలేటర్లు, ర్యాంప్ లు, లిఫ్టులు నిర్మించారు. ఇక ఏసీతో కూడిన వెయిటింగ్ హాల్ ను నిర్మించారు. రైళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణీకులు తెలుసుకునేలా డిస్ ప్లే ఏర్పాటు చేశారు. ఇక రద్దీకి అనుగుణంగా టికెట్ కౌంటర్లను నిర్మించారు. అంతేకాదు, రైల్వే స్టేషన్ లో ఏ సర్వీస్ ఎక్కడ ఉంది? అని ఈజీగా తెలుసుకునేందుకు ఎల్ఈడీ సైన్ బోర్డును ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని ఆహ్లాదంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ రైల్వే స్టేషన అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా పునర్నిర్మిస్తున్నారు. ఇక తొలి ఫేజ్ లో భాగంగా రైల్వే స్టేషన్ కు ఓకవైపు చేపట్టిన అభివృద్ధి పనులు 90 శాతం పూర్తయ్యాయి. త్వరలోనే మిగతా 10 శాతం పనులు పూర్తి కానున్నాయి. ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత రెండో ఫేజ్ పనులు పనులు మొదలుకానున్నాయి.
బేగంపేట రైల్వే స్టేషన్ పనులు పరిశీలించిన కిషన్ రెడ్డి
తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ బేగంపేట రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. బేగంపేటలో కేవలం 10 శాతం పెండింగ్ లో ఉన్నాయన్నారు. త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తామన్నారు. మరో రూ. 12 కోట్లతో రెండో విడత పనులు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు.
Read Also: అయ్య బాబోయ్.. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే వాళ్లు అంత మందా?
100 శాతం మహిళా ఉద్యోగులే!
ఇక బేగంపేట రైల్వే స్టేషన్ లో 100 శాతం మహిళా ఉద్యోగులు ఉండేలా చూస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలోనే మహిళలతో పూర్తి స్థాయిలో నడిచే రైల్వే స్టేషన్లలో ఒకటిగా కొనసాగబోతోందన్నారు.
Read Also: వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఇలా కన్ఫర్మ్ అవుతాయా? పెద్ద కథే!