Mohan Babu Industry @50 Years: కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు మంచు మోహన్ బాబు (Manchu Mohan babu).విలన్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోగా మారి, తన అద్భుతమైన నటనతో, డైలాగ్ తో తనకు సాటి లేరు మరెవరు అంటూ నిరూపించారు. ఎంత పెద్ద డైలాగ్ నైనా సరే అనర్గళంగా చెబుతూ.. విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకొని, తన సినీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్న మోహన్ బాబు నటనపరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇకపోతే విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇండస్ట్రీకి వచ్చి ఈ ఏడాది 50 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈ అర్థ శతాబ్దపు సినీ ప్రయాణంలో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం..
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెం కి చెందిన మంచు భక్తవత్సలం నాయుడు.. సినీ ఇండస్ట్రీకి వచ్చి మోహన్ బాబు గా పేరు మార్చుకొని, దాదాపు 5 సంవత్సరాల పాటు దర్శకత్వ విభాగంలో పనిచేశారు. ‘స్వర్గం నరకం’ అనే సినిమా ద్వారా 1975లో తెలుగుతెరకు పరిచయమైన మోహన్ బాబు.. స్వర్గీయ దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) శిష్యుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈయన వల్లే ‘స్వర్గం నరకం’ సినిమాలో అవకాశం లభించింది. అలా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటివరకు 573 సినిమాలలో నటించారు.మరొకవైపు నిర్మాతగా కూడా మారి 72 చిత్రాలను నిర్మించారు.
పద్మశ్రీ పురస్కారం..
తన నటనతో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్,నట ప్రపూర్ణ, విద్యాలయ బ్రహ్మ ఇలా పలు బిరుదులు అందుకున్న ఈయన నటనను మెచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది.
ALSO READ:SSMB 29: వచ్చే ఏడాదే రిలీజ్.. ఆ చిత్రాల స్ఫూర్తితోనే..!
విద్యాసంస్థల అధినేత..
సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టారు. అందులో భాగంగానే రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు స్థాపించి.. నేడు ఎంబీయూ యూనివర్సిటీగా మార్చి ఎంతోమంది పేద విద్యార్థులకు సరళమైన ఫీజులకే నాణ్యమైన విద్యను అందిస్తూ గొప్ప విద్యావేత్తగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి.
మోహన్ బాబు రాజకీయరంగ ప్రవేశం..
నటుడిగా, విద్యావేత్తగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన.. రాజకీయ రంగంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. 1995 నుండి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
మోహన్ బాబు విద్యాభ్యాసం..
1952 మార్చి 19వ తేదీన జన్మించిన మోహన్ బాబు ఏర్పేడు, తిరుపతిలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.ఇక చెన్నైలో భౌతిక శాస్త్రంలో డిగ్రీను పూర్తి చేసిన ఈయన.. ఇండస్ట్రీలోకి ప్రవేశించడానికి ముందు కొంతకాలం యోగ టీచర్ గా కూడా పనిచేశారు. ఇక ఈయన తండ్రి ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. అలా ఆయన వారసత్వాన్ని కొనసాగించాలనుకున్నారు. కానీ సినిమా మీద మక్కువతో తన కోరికను పక్కన పెట్టి, మళ్ళీ సినిమా రంగంలోకి అడుగుపెట్టి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు మంచు విష్ణు (Manchu Vishnu) ప్రెస్టీజియస్ మూవీ గా వస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
50 వసంతాలు పూర్తి.. అభిమానుల కోసం విందు ఏర్పాటు..
ఇకపోతే 50 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం రంగంపేటలో ఏడు గంటలకు విందు ఏర్పాటు చేశారు మోహన్ బాబు. అంతేకాదు ఈ వేడుకకు అభిమానులకు పిలుపును అందించారు.