Chinese Students: అమెరికా చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో చైనా విద్యార్థులు అమెరికాలో చదవకుండా ఉండేలా రిపబ్లికన్లు సంచలనాత్మక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా చైనా జాతీయులకు విద్యా సంబంధిత వీసాలను మంజూరు చేయకుండా నిషేధం విధించనుంది. దీంతో ఇది చైనీస్ విద్యార్థులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చదువుకు, పరిశోధనలకు ప్రసిద్ధిగాంచిన అమెరికా, ఇప్పుడు చైనా విద్యార్థులను తన దేశంలో విద్యాభ్యాసం చేయకుండా నిరోధించేందుకు సిద్ధమవుతోంది.
వీసాలు మంజూరు చేయడం
ఈ బిల్లును ప్రవేశపెట్టింది రిపబ్లికన్ వెర్మోంట్ సెనేటర్ రిలే మూర్. చైనా జాతీయులు విద్యార్థి వీసా లేదా ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో ప్రవేశించడం నిషేధించేలా ఈ బిల్లు రూపొందించబడింది. ఈ బిల్లుకు మరో ఐదుగురు రిపబ్లికన్లు సహ-ప్రయత్నం చేస్తున్నారు. మూర్ ప్రకటన ప్రకారం “చైనా విద్యార్థులకు వీసాలు మంజూరు చేయడం ద్వారా, చైనా కమ్యూనిస్ట్ పార్టీ మన మేథో సంపత్తిని దొంగిలించేందుకు, మన సైన్యంపై నిఘా పెట్టేందుకు అనుమతినివ్వడం వంటిదేనని అంటున్నారు. ఇది జాతీయ భద్రతకు పెద్ద ముప్పని, మన దేశ భద్రతను కాపాడేందుకు ఇది తక్షణ చర్య అని చెబుతున్నారు.
చైనా విద్యార్థులపై నిషేధం ఎందుకు?
అమెరికా దృష్టిలో చైనా అనేక రకాల ఇబ్బందులను సృష్టిస్తోంది. వాటిలో మేథో సంపత్తి చోరీ, సైనిక గూఢచారానికి అవకాశం, జాతీయ భద్రతకు ముప్పు వంటి అంశాలు ఉన్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) చైనా విద్యార్థులను అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశింపజేసి, అక్కడి గూఢ సమాచారాన్ని సేకరించేందుకు ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో రిపబ్లికన్లు ఈ చర్య తీసుకుంటున్నారు.
Read Also: MM Keeravani:83 మంది కళాకారుల ఆర్కెస్ట్రాతో కీరవాణి .
పరస్పర సహకారం
ఈ బిల్లును చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియు పెంగ్యు మాట్లాడుతూ, చైనా ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విద్యా మార్పిడి, పరస్పర సహకారం చైనా-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఇలాంటి నిషేధాలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయన్నారు.
జాతీయత ఆధారంగా
అంతేకాకుండా, అంతర్జాతీయ విద్యా నిపుణులు కూడా ఈ చర్యను వ్యతిరేకించారు. NAFSA (National Association of Foreign Student Affairs) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాంటా ఆవ్ మాట్లాడుతూ ఏ పాలసీ కూడా వ్యక్తులను వారి జాతీయత ఆధారంగా లక్ష్యంగా చేసుకోకూడదన్నారు. అంతర్జాతీయ విద్యార్థులపై ఇలాంటి నిషేధాలు అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు.
అమెరికాలో చైనా విద్యార్థుల ప్రాధాన్యత
2023-24 విద్యా సంవత్సరంలో 277,000కి పైగా చైనా విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 25% చైనా విద్యార్థులే. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో చైనా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2023లో భారతదేశం, చైనాను అధిగమించి, అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ విద్యార్థులను అమెరికాకు పంపే దేశంగా నిలిచింది.
ప్రతికూల ప్రభావాలు
-ఈ బిల్లు ఆమోదం పొందితే, దీని ప్రభావం అనేక విధాలుగా కనిపించనుంది:
-అమెరికా విశ్వవిద్యాలయాలకు భారీ ఆర్థిక నష్టం – అంతర్జాతీయ విద్యార్థులు భారీ ఫీజులు చెల్లిస్తారు.
-అమెరికా పరిశోధనలకు తీవ్ర దెబ్బ – పరిశోధనలలో చైనీస్ విద్యార్థులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
-అంతర్జాతీయ విద్య రంగంలో అమెరికా నెగ్గడం కష్టతరం – కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు చైనీస్ విద్యార్థులను ఆకర్షించే అవకాశం ఉంది.
-ఈ నిషేధం అమలులోకి వస్తే, దీని ప్రభావం పరిశోధన రంగంతో పాటు మౌలికవిధానాలపై కూడా పడే అవకాశం ఉంది.