Indian Railways: ప్రయాణీకుల నుంచి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైల్వేశాఖ వందేభారత్ రైళ్లకు అదనపు కోచ్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నది. ప్రయాణీకుల డిమాండ్ ను తీర్చడంతో పాటు ప్రయాణ సౌకర్యాన్ని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే మరో రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్ లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ రెండు రైళ్లు 20 కోచ్ లతో అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఈ రైళ్లు 16 కోచ్ లతో ఉండగా ఇప్పుడు అప్ గ్రేడ్ అయ్యాయి. ఈ వందేభారత్ రైళ్లలో ఒకటి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడిచే రైలు ఉండగా, మరొకటి దక్షిణ రైల్వే పరిధిలో నడుస్తున్నది.
విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ కు 20 కోచ్ లు
20833/20834 నంబర్ కలిగిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య నడుస్తున్నది. ఈ రైలు 699 కి.మీ. దూరాన్ని 8 గంటల 35 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు ఇదే కావడం విశేషం. ఇది మంగళవారం మినహా ప్రతి రోజు నడుస్తుంది. జనవరి 11, 2025న ఈ వందేభారత్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, విజయవాడ జంక్షన్, ఖమ్మం సహా వరంగల్ లో ఆగుతుంది. ఈ వందేభారత్ రైలు(నెంబర్ 20833) విశాఖపట్నం నుంచి ఉదయం 5:45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణలో ఈ రైలు (నెంబర్ 20834) సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3:00 గంటలకు బయల్దేరి రాత్రి 11:35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
తిరువనంతపురం సెంట్రల్- కాసరగోడ్ వందేభారత్ అప్ గ్రేడ్
ఇక 20634/20633 నెంబర్ కలిగిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ తిరువనంతపురం సెంట్రల్- కాసరగోడ్ మధ్య నడుస్తున్నది. ఈ రైలు 8 గంటల 5 నిమిషాల్లో 588 కి.మీ. ప్రయాణిస్తుంది. ఇది గురువారం తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ నడుస్తున్నది. జనవరి 10, 2025న ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ తన సేవలను ప్రారంభించింది. ఈ రైలు కొల్లం జంక్షన్, చెంగన్నూర్, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, త్రిస్సూర్, షోరనూర్ జంక్షన్, కోజికోడ్ తో పాటు కన్నూర్ లలో ఆగుతుంది. ఈ రైలు( నెంబర్ 20634) తిరువనంతపురం సెంట్రల్ నుంచి ఉదయం 5:15 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1:20 గంటలకు కాసరగోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు( నెంబర్ 20633) మధ్యాహ్నం 2:30 గంటలకు కాసరగోడ్ నుంచి బయల్దేరి రాత్రి 10:40 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది.
Read Also: వెయింటింగ్ లిస్టు టికెట్ కన్ఫర్మ్ కావాలా? సింపుల్ గా ‘వికల్ప్ యోజన’ ట్రై చేయండి!
ఈ రెండు వందేభారత్ రైళ్లను అప్ గ్రేడ్ చేయడం వల్ల మరింత మంది ప్రయాణించే అవకాశం కలిగింది. అటు తెలుగు రాష్ట్రాల్లో నడిచే అన్ని వందేభారత్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటికి కూడా కోచ్ ల సంఖ్య పెంచాలనే డిమాండ్ వినిపిస్తున్నది. మరింత మంది వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
Read Also: దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్లు.. ఒక్కో స్టేషన్ నుంచి ఎన్ని రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయంటే?