New Mumbai Local Trains: ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణం అంటేనే నరకయాతన. రైలు కదులుతున్నా, ప్రయాణికులు తలుపుల దగ్గర వేలాడుతూ ప్రయాణించడం కామన్ గా కనిపిస్తుంది. అయితే, ఈ ప్రమాదకర ప్రయాణానికి త్వరలోనే అడ్డుకట్ట పడే అవకాశం కనిపిస్తోంది. ఆటోమేటిక్ తలుపులతో కూడిన తొలి నాన్-ఏసీ సబర్బన్ రైలును ముంబైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ రైలును పరీక్షించబోతున్నారు.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) తయారు చేసిన ఈ రైలులో మొత్తం 12 కోచ్‌లు ఉన్నాయి. రైలు కదులుతున్నప్పుడు తలుపులు మూసి ఉంటాయి. స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మాత్రమే తెరుచుకుంటాయి. దీంతో ప్రయాణికులు ఫుట్‌బోర్డులపై నిలబడటం, తలుపులకు వేలాడటం లాంటి ప్రమాదకర ప్రయాణాలు తగ్గుతాయి. 2025 జూన్ 9న ముంబ్రా దగ్గర జరిగిన రైలు ప్రమాదం తర్వాత ఇలాంటి రైళ్ల అవసరం మరింత పెరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు రద్దీ రైళ్ల నుంచి ప్రయాణికులు కిందపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ముంబై లోకల్ రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నారు.
సాధారణ లోకల్ రైళ్లలో తలుపులు తెరిచి ఉండటం వల్ల గాలి లోపలికి వస్తుంది. ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేస్తే కోచ్‌లలో ఉక్కపోత పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త రైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తలుపులకు లూవర్డ్ ఏర్పాటు చేయడంతో అవి మూసి ఉన్నప్పటికీ గాలి లోపలికి వస్తుంది. పైకప్పుపై వెంటిలేటర్లు కూడా అమర్చారు. అంతేకాకుండా, కోచ్‌ల మధ్య వెస్టిబ్యూల్ కనెక్షన్లు ఉండటంతో ప్రయాణికులు ఒక బోగీ నుంచి మరో బోగీకి వెళ్లవచ్చు.
ఆటోమేటిక్ డోర్లతో నాన్-ఏసీ రైళ్లను నడిపే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. అయితే, సరైన గాలి ప్రసరణ లేకపోవడం, రద్దీ సమయంలో సెన్సార్లు పనిచేయకపోవడం, డోర్ మోటార్లు వేడెక్కడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఆ ప్రయోగాలు పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. ఇప్పుడు అన్ని సమస్యలను పరిష్కరిస్తూ కొత్త రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి.
ఈ కొత్త రైలు ఇప్పటికే ఖజురహో-మహోబా మార్గంలో 63 కిలోమీటర్ల మేర ప్రయోగాత్మక పరీక్షలు చేశారు. ఇప్పుడు ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లో కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు పూర్తయి, అవసరమైన భద్రతా అనుమతులు వచ్చిన తర్వాతే ప్రయాణికుల సేవల్లోకి తీసుకువస్తారు.
ముంబై లోకల్ రైళ్లలో రోజుకు సుమారు 70–80 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. 2025లో సబర్బన్ రైల్వే పరిధిలో 2,287 మంది మరణించగా, వారిలో 525 మంది రన్నింగ్ ట్రైన్ల నుంచి పడిపోయినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ డోర్ల ప్రయోగం విజయవంతమైతే లక్షలాది మంది ప్రయాణికులు సేఫ్ గా తమ జర్నీలను కొనసాగించనున్నారు.
Read Also: ఇకపై 72 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేయాలా? లేదంటే రీఫండ్ రాదా?