CM Revanthreddy: నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. సాఫ్ట్‌వేర్ రంగంతోపాటు పలు విభాగాల్లో AI తో ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ బ్లూ కాలర్ జాబ్స్ ను AI తో భర్తీ చేయలేమన్నారు. నైపుణ్యం పెంచుకుంటే భవిష్యత్‌లో బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలకు కొదవ ఉండదని తేల్చేశారు.
బంజారాహిల్స్‌లోని సేవలాల్ బంజారాభవన్‌లో జాతీయ విద్యా దినోత్సవం- మైనారిటీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, గులాంనబీ ఆజాద్ నుంచి షబ్బీర్ అలీ వరకు కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఎన్నో అవకాశాలను ఇచ్చిందన్నారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
మైనారిటీ రిజర్వేషన్‌ను తొలగిస్తామని బీజేపీ చేవెళ్ల సభలో ప్రకటించిందని, ముందు గుజరాత్‌లో తొలగించి చూపించాలని మేం సవాల్ విసిరామని అన్నారు. మైనారిటీల సంక్షేమం మా బాధ్యత అని, దేశంలో ఏ రాజకీయ పార్టీకి స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర లేదన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు. పేదలకు, మైనారిటీలకు కాంగ్రెస్ ఓటు హక్కు కల్పిస్తే వాటిని తొలగించాలని బీజేపీ చూస్తోందన్నారు.
12 ఏళ్లు గడిచినా బీజేపీ.. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ హామీ నిలబెట్టుకోలేదన్నారు. బీజేపీతో పోరాడే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని కుండబద్దలు కొట్టేశారు. తెలంగాణ గల్లీ నుంచి వెళ్లిన కారు, ఢిల్లీకి చేరగానే మోదీ కమలంగా మారిపోతోందని చురకలు అంటించారు. మైనారిటీ స్కాలర్షిప్ లను తొలగించాలని బీజేపీకి ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించారు. క్రీడల్లో దేశ ప్రతిష్టను పెంచిన మైనారిటీ క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతితోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి గౌరవించిందన్నారు.
అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించామని, షబ్బీర్ అలీని సలహాదారులుగా నియమించామన్నారు. ప్రజా ప్రభుత్వంలో మైనారిటీలకు ఎన్నో అవకాశాలు కల్పించామన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని, దాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఓల్డ్ సిటీలో మెట్రో పనులను వేగవంతం చేశామని, మూసీ పునరుజ్జీవంతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.
మూసీ నదీ పరీవాహకంలో నైట్ ఏకానమీ గా మారుతుందన్నారు. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. చదువు ఒక్కటే మీ జీవితాలను మారుస్తుందని, పిల్లలను చదివించండి, నైపుణ్యాన్ని అందించాలన్నారు. నిఖత్ జరీన్, సిరాజుద్దీన్ తరహాలో పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని, నైపుణ్యం, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ALSO READ: లక్డికాపూల్ వన్ వే ట్రాఫిక్ ప్లాన్! రిటైర్ బ్యాంక్ ఉద్యోగి పక్కా స్కెచ్, పరిశీలన చేస్తున్న అధికారులు
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, పిల్లలను చదివించాలన్నారు. మీ సోదరుడిగా మీకు అండగా నేను ఉంటానన్నారు. మీ సమస్యలను అర్థంచేసుకుని పరిష్కరించే బాధ్యత నాదన్నారు.