New Railway System: భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. తక్కువ ధరకే ఆహ్లాదకర ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది రైల్వే ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇప్పటికీ చాలా మంది టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. అయితే, ఇకపై టికెట్ లేకుండా రైల్వే స్టేషన్ లోకి అడుగు పెట్టే అవకాశం లేకుండా సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతోంది రైల్వేశాఖ. మెట్రో రైల్వే స్టేషన్ లోని వ్యవస్థను అన్ని సాధారణ రైల్వే స్టేషన్లలో అమలు చేయబోతోంది. ఇప్పటికే పలు స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నది. ఈ వ్యవస్థ మంచి ఫలితాలను ఇస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక నెమ్మదిగా ఈ వ్యవస్థను అన్ని రైల్వే స్టేషన్లలో అమలు చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట నేపథ్యంలో..
ఇక తాజాగా జరిగిన మహా కుంభమేళా సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరగడంతో పాటు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత, రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి భారతీయ రైల్వే సంస్థ కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టింది. మెట్రో స్టేషన్లు టికెట్ తీసుకున్న తర్వాతే ప్రయాణీకులను లోపలికి అనుమతించినట్లు, ఇకపై సాధారణ రైల్వే స్టేషన్లలోనూ మెట్రో లాంటి వ్యవస్థను అమలు చేయాలని భావిస్తున్నది. స్టేషన్లలోకి ఎంట్రీ కూడా టికెట్ తీసుకున్న తర్వాతే ఉండనుంది.
ఎంట్రీ, ఎగ్జిట్ స్టేషన్లలో టికెట్ల చెకింగ్
ప్రస్తుత రైల్వే స్టేషన్లలో టికెట్ లేని ప్రయాణీకులను పట్టుకోవడానికి ఎగ్జిట్ గేటు దగ్గర TT నిలబడి టికెట్లను చెక్ చేస్తారు. టికెట్ లేకుండా పట్టుబడిన ప్రయాణీకులకు జరిమానా విధించబడుతుంది. అలాగే, ఎంట్రీ గేట్ ద్వారా TTని ఉంచనున్నారు. అలా చేయడం వల్ల టికెట్ ఉన్న వాళ్లు మాత్రమే స్టేషన్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల టికెట్ లేని ప్రయాణీకులకు స్టేషన్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉండదు.
Read Also: గుడ్‌న్యూస్.. ఇప్పుడు చివరి నిమిషంలో కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?
కచ్చితమైన ప్రయాణీకుల సంఖ్య తెలిసే అవకాశం
ఇలా చేయడం ద్వారా చాలా లాభాలున్నాయని రైల్వేశాఖ భావిస్తున్నది. రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించడంతో పాటు.. టికెట్ లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉండదు. ఈ విధానం రైల్వేకు ఆదాయం పరంగానూ ఎంతో మేలు కలగనుంది. ఇక రైల్వే స్టేషన్ లోని రద్దీని పక్కాగా అంచనా వేసే అవకాశం ఉంటుంది. అంటే, రైల్వే స్టేషన్ లో ఎంత మంది ప్రయాణీకులు ఉన్నారో ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. రద్దీని కంట్రోల్ చేయడానికి ఎంత మంది RPF సిబ్బందిని అందుబాటులో ఉంచాలో ఈజీగా అర్థం అవుతుంది. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు భారతీయ రైల్వే సంస్థ కసరత్తు చేస్తోంది.
Read Also: మీరు బుక్ చేసుకున్న టికెట్ వేరకొకరికి అమ్ముతున్నారా? అయితే, జైల్లో ఊచలు లెక్కించాల్సిందే!