Indian Railways Rules: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(IRCTC) వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్లను ఇతరులకు అమ్మడం, ఇతరుల నుంచి కొనుగోలు చేయడం నేరం అని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అలా చేయడం IRCTC వెబ్ సైట్ లో పేర్కొన్న నిబంధనలు, షరతులను ఉల్లంఘించడమే అవుతుందని న్యాయస్థానం వెల్లడించింది. IRCTC అనుమతి లేకుండా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుని విక్రయించినందుకు తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఆథరైజ్డ్ ఏజెంట్ తప్ప మరెవరూ రైల్వే టిక్కెట్లను బుక్ చేయడం, అమ్మడం నిషేధం. ఈ నేపథ్యంలోనే సదరు మహిళపై రైల్వే చట్టంలోని సెక్షన్ 143 కింద కేసు నమోదు అయ్యింది.
కమర్షియల్ ప్రయోజనాలు నేరం
ఇక ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ మను.. సెక్షన్ 143 ప్రకారం IRCTC వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకున్న ఇ-టికెట్ల అమ్మకం ఉంటుందన్నారు. IRCTC వెబ్ సైట్ లోని నిబంధనలు, షరతులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించవచ్చని చెప్తున్నాయన్నారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లను ఉపయోగించకూడదన్నారు. సదరు మహిళ వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకున్నారని, లాభం కోసం ఇతరులకు టిక్కెట్లను అమ్మారని రైల్వేశాఖ ఆరోపించింది. సదరు మహిళ IRCTC నిబంధనలు, షరతులను ప్రాథమికంగా ఉల్లంఘించినట్లు వెల్లడించింది. లాభాల కోసం ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్‌ను దుర్వినియోగం చేయడం నేరంగా పరిగణించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇక సదరు మహిళ నుంచి రిజర్వేషన్ చేసిన రెండు ఇ-టికెట్ల కాపీలు, IRCTC యూజర్ ప్రొఫైల్ ఐడిలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఏమన్నారంటే?
ఇక IRCTCలో రిజిస్టర్ చేసుకున్న ఎవరైనా ఇ-టికెట్లను పొందవచ్చని, రిజర్వేషన్లు చేసుకోవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. టికెట్లు తమ కోసం మాత్రమే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇతరులకు కూడా బుక్ చేసుకోవచ్చని వాదించారు. యూజర్ ఐడిని డీ-రిజిస్టర్ చేసే అధికారం IRCTCకి ఉందని.. రైల్వే చట్టంలోని సెక్షన్ 143 IRCTC ద్వారా ఇ-టికెట్ల సేకరణకు వర్తించదని వాదించారు. ఇతర ఆన్ లైన్ వెబ్‌సై ట్ ల ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే సెక్షన్ 143 వర్తిస్తుందని వాదించారు.
లాభం కోసం టికెట్లను అమ్మడం నేరం
అటు రైల్వే సర్వెంట్ లేదంటే ఆథరైజ్డ్ ఏజెంట్ కాకుండా ఎవరైనా టికెట్లు కొనుగోలు చేసి వాటిని లాభం కోసం ఇతరులకు అమ్మడం సెక్షన్ 143 వర్తిస్తుందని రైల్వే తరఫున హాజరైన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వాదించారు. పలువురు వ్యక్తులకు టికెట్లు బుక్ చేసుకోవడానికి పిటిషనర్ రెండు ప్రొఫైల్‌లను ఉపయోగించారన్నారు. IRCTC వెబ్ సైట్ వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమేనని, వాణిజ్య ఉపయోగం కోసం కాదని తేల్చి చెప్పారు. బుక్ చేసుకున్న టికెట్లను లాభం కోసం ఇతరులకు విక్రయించడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు.
న్యాయస్థానం ఏం చెప్పిందంటే?
ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం సెక్షన్ 143 ప్రకారం IRCTC నుంచి టికెట్లను బుక్ చేసి.. వాస్తవ టికెట్ ధర కంటే ఎక్కువ మొత్తానికి ఇతరులకు విక్రయిండాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. IRCTC వెబ్‌సైట్ వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే ఉద్దేశించబడిందని వెల్లడించింది. వాణిజ్య ప్రయోజనం కోసం కాదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేసి, పిటిషనర్ విచారణను ఎదుర్కోవాలని ఆదేశించింది.
Read Also: టికెట్ లేకుండా టీటీఈకి చిక్కిన పోలీస్.. ఆ మాటతో దెబ్బకు పరుగో పరుగు!