Islamabad Express Derails: దాయాది దేశం పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. లాహోర్ సమీపంలో ఇస్లామాబాద్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారందరికీ ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. లాహోర్ నుంచి రావల్పిండి వెళ్తున్న రైలు కాలా షా కాకు దగ్గర పట్టాలు తప్పినట్లు పాకిస్థాన్ రైల్వేశాఖ తెలిపింది. లాహోర్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించింది. రైలుకు చెందిన పది బోగీలు పట్టాలు తప్పినట్లు తెలిపింది. రెస్క్యూ బృందాలు వెంటనే స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించడంతో పాటు.. బోగీల్లో చిక్కుకున్నవారిని తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించింది.
రైలు బయల్దేరిన అరగంటోనే ప్రమాదం
నిజానికి ఈ రైలు లాహోర్ నుంచి బయల్దేరని కేవలం అరగంట లోనే ప్రమాదానికి గురయ్యింది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అనే విషయంపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పాకిస్తాన్ రైల్వే మంత్రి ముహమ్మద్ హనీఫ్ అబ్బాసీ, రైల్వే సీఈవో, డివిజనల్ సూపరింటెండెంట్ ను వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు అందజేయాలన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి వారం రోజుల్లోనే నివేదిక అందజేయాలని ఆదేశించారు.
Read Also: ఆ రూట్‌లో వెళ్లే 70 రైళ్లు రద్దు.. ముందుగా చెక్ చేసుకోండి!
15 రోజుల్లో మూడో రైలు ప్రమాదం
పాకిస్తాన్ లో గత 15 రోజుల్లో మూడు రైలు ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. జూలై 28న క్వెట్టాకు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలులో పేలుడు సంభవించి మూడు బోగీలు పట్టాలు తప్పాయి. జూలై 17న సింధ్ ప్రావిన్స్ లోని జకోబాబాద్ దగ్గర వరుస పేలుళ్లకు గురైన జాఫర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. తాజాగా లాహోర్ నుంచి బయల్దేరిన ఇస్లామాబాద్ ఎక్స్ ప్రెస్ 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణ భద్రతపై ప్రయాణీకులలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదాల వెనుక ఎవరైనా ఆగంతకుల హస్తం ఉందా? అనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందం విచారణకు రెడీ అవుతోంది. త్వరలోనే విచారణ పూర్తి చేసి, ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించే అవకాశం ఉంది.
Read Also: 6 నిమిషాలు.. చీకటి గుప్పిట్లో ప్రపంచం, ఆగష్టు 2న ఏం జరగబోతోందంటే?