Moving Train Puja Video Goes Viral: రైలు ప్రయాణంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. రద్దీగా ఉండే బోగీల్లో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది. అయితే, ఓ అయ్యప్ప స్వామి మాలధారి రన్నింగ్ ట్రైన్ లో రైలులోనే దీపం వెలిగించి పూజలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో భారతీయ రైల్వే రియాక్ట్ అయ్యింది. ఈ ఘటనపై వివరాలు సేకరించి విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఏసీ రైలు బోగీలో కూర్చొని పూజలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. అతడి ముందు ఉన్న చిన్న టేబుల్ మీద దేవుడి ఫొటో, పూలు, ఇతర పూజా వస్తువులు పెట్టాడు. అంతేకాకుండా, ఒక దీపాన్ని వెలిగించి హారతి ఇస్తూ శంఖం కూడా ఊదాడు. ధోతి కట్టుకుని, నుదుటి మీద విభూతి పెట్టుకున్న ఆ వ్యక్తి రైలు ప్రయాణం కొనసాగుతున్న సమయంలోనే ఈ పూజ చేశాడు. ఈ విజువల్స్ ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పూజలు చేసుకోవడం వ్యక్తిగత విషయమే అయినప్పటికీ, వందలాది మంది ప్రయాణిస్తున్న రైలు బోగీలో దీపం వెలిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఏసీ బోగీల్లో దీపం వెలిగించడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న మంట కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని, ఇలాంటి పనులు ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయంటున్నారు.
వీడియో వైరల్ కావడంతో భారతీయ రైల్వే అధికారికంగా స్పందించింది. రైల్వే సేవా (Railway Seva) సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను కోరింది. ప్రయాణికులు ప్రయాణించిన తేదీ, రైలు నంబర్, PNR నంబర్ లాంటి వివరాలను అందించాలని సూచించింది. వీటి ఆధారంగా సంబంధిత రైలును గుర్తించి ఘటనపై విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది.
రైళ్లలో దీపాలు వెలిగించడం, ప్రమాదకరమైన, మండే స్వభావం కలిగిన వస్తువులను ఉపయోగించడం అనేది నేరం. భద్రతా ఉల్లంఘనలను రైల్వే శాఖకు వెంటనే అందించాలి. ప్రయాణికులు రైల్ మదద్ (RailMadad) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సదరు ప్రయాణికుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా, మరికొందరు ఇలాంటి పనులను అనుమతించకూడదని అంటున్నారు. పూజలు వ్యక్తిగతమైనప్పటికీ, ప్రజా రవాణాలో ఇతరుల భద్రతకు హాని కలిగించే పనులు చేయడం సరికాదంటున్నారు.
ఓ పని చేయండి స్వామి.
నిన్న జ్వాలాతోరణం అంట.
సో మొత్తం వత్తుల దండ తెచ్చి ట్రైన్ కి అతికించి తోరణం అంటూ పెట్టండి 🙏
హారతులు, శంఖారావంలు ఇంట్లో, గుళ్ళలో, లేక ప్రార్థనకు కేటాయించిన స్థలాల్లో మంచిది కానీ, ఇలా ట్రైన్లు, ఫ్లైట్లలో చేస్తే మనతో ఉన్న అందరికి ప్రమాదం pic.twitter.com/3Stl94fYmj— శిఖివాహన 🦚 #GodofWar 🦚 (@SNsharma95) November 26, 2026
Read Also: వందేభారత్ స్లీపర్‌లో కొత్త ఫుడ్ రూల్.. ఇకపై విమానాల్లో మాదిరిగా ఫుడ్ సర్వీస్!