Tiger vs Lion: పులి, సింహం రెండింటిలో ఏది బలమైనది? పోరాటం పెడితే ఏది గెలుస్తుందనే చర్చ వన్యప్రాణి ప్రేమికుల్లో ఎప్పటినుంచో సాగుతోంది. అయితే రెండింటిలో ఏది పవర్ ఫుల్ అనేది ఒక్కమాటలో చెప్పడం కష్టం. ఇందుకు శారీరక బలం, చురుకుదనం, వేటాడే నైపుణ్యం, పోరాట అనుభవం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్విరాన్‌మెంటల్ లిటరసీ కౌన్సిల్ (Environmental Literacy Council) విశ్లేషణ ప్రకారం.. సింహంపై పులి కాస్త పైచేయి సాధించింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
బరువు పరంగా చూస్తే పులులదే పైచేయిగా కనిపిస్తోంది. మగ ఆఫ్రికన్ సింహాలతో పోలిస్తే బెంగాల్, సైబీరియన్ వంటి మగ పులులు అధిక బరువు, భారీ ఆకృతిని కలిగి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మగ పులుల బరువు 250 కిలోగ్రాములకు మించి ఉంటాయి. సాధారణంగా జంతువుల్లో బరువు అనేది వాటి సామర్థ్యాన్ని సూచిస్తుంది. పులుల కాళ్లు, భుజ కండరాలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. అందుకే అడవి పందులు, జింకలు, గేదెలు వంటి పెద్ద జంతువులను కూడా ఒంటరిగా వేటాడగల్గుతాయి.
బరువు, పరిమాణం పక్కన పెడితే సింహాలు కూడా ఏమాత్రం తక్కువ కాదు. తమ భూభాగాన్ని ఇతర మగ సింహాల నుంచి కాపాడుకోవడానికి అవి జీవితాంతం పోరాడుతూనే ఉంటాయి. కండలు తిరిగిన మెడ, విశాలమైన ఛాతీ, రక్షణ కవచంలా ఉండే జూలు సింహాన్ని గట్టి ప్రత్యర్థిగా నిలబెడతాయి. అయినప్పటికీ శక్తి సామర్థ్యాల పరంగా పులి కొంచెం బలమైనదని పలువురు ప్రకృతివేత్తలు అభిప్రాయపడతారు. హౌస్టఫ్‌వర్క్స్ (HowStuffWorks) ప్రచురించిన కథనంలోనూ పులులు సింహాల కంటే పెద్దవిగా, దృఢంగా ఉంటాయని పేర్కొన్నారు.
వేగం విషయానికి వస్తే రెండు జంతువులూ సమానమే. తక్కువ దూరానికి వేగంగా పరిగెత్తే క్రమంలో సింహాలు గంటకు సుమారు 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. పులుల గరిష్ట వేగం గంటకు సుమారు 65 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఈ వేగాన్ని అవి ఎక్కువసేపు కొనసాగించలేవు. ఎరను అకస్మాత్తుగా పట్టుకోవడానికి వేగంగా దూసుకెళ్లడానికి మాత్రమే దీన్ని వాడతాయి.
పులి, సింహానికి మధ్య అసలైన తేడా చురుకుదనంలో ఉంది. పులులు ఎక్కువగా దట్టమైన అడవుల్లో జీవిస్తాయి. పైగా ఇవి నీటిలోనూ చక్కగా ఈదగలవు. దట్టమైన పొదలు, కఠినమైన నేలపై కూడా శబ్దం లేకుండా ఇవి కదులుతుంటాయి. వేట సమయంలో పులులు చాలా ఎత్తుకు ఎగిరిన, దూరానికి దూకిన సందర్భాలు ఉన్నాయి. సింహాలు వేట పద్ధతిలో పులులతో పోలిస్తే తేడాలు ఉన్నాయి. ఇవి ఒంటరిగా కాకుండా గ్రూప్ గా వేటాడుతాయి. సింహాలు వేగంగా, చురుగ్గా ఉన్నప్పటికీ పులులను అవి మ్యాచ్ చేయలేవు. వేటాడే వేగం సమానంగా ఉన్నా చురుకుదనంలో పులి సింహం కంటే ముందుంటుందని ఎన్విరాన్‌మెంటల్ లిటరసీ కౌన్సిల్ నివేదికలు సూచిస్తున్నాయి.
Also Read: 2 అడుగుల బర్రె.. ధర ఏకంగా రూ. కోటి.. ప్రపంచంలోనే అత్యంత చిన్నది ఇదేనా?
హౌస్టఫ్‌వర్క్స్ కథనం ప్రకారం.. పరిమాణం, ఒంటరిగా వేటాడే నైపుణ్యంలో పులికి పైచేయి సాధిస్తోంది. పర్యావరణ విద్యా సంస్థలు విశ్లేషించిన వన్యప్రాణి అధ్యయనాల ప్రకారం కూడా ముఖాముఖి పోరులో పరిమాణం, కండర బలం, చురుకుదనం కారణంగా పులి కొంచెం ముందుండే అవకాశం ఉందని తేలింది. అయితే అలాంటి పోరాటంలో గెలుపోటములు ఆయా జంతువుల వయస్సు, ఆరోగ్యం, అనుభవం, వ్యక్తిగత స్వభావాలపై ఆధారపడి ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: ఏఐతో బాంబు తయారీ.. ఆ తర్వాత భారీ భవనం పేలుడుకి కుట్ర, అధికారుల అదుపులో టీనేజర్