Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే రైళ్లలో లోపాలను గుర్తించి పరిష్కారం చేసే దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం అండర్ కవర్ అధికారులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అధికారులు రైళ్లలో సాధారణ ప్రయాణీకుల మాదిరిగా జర్నీ చేస్తూ.. టాయిలెట్లు, ఛార్జింగ్ పాయింట్లు, లైట్లు, ఫ్యాన్లు, నీటి లభ్యత, పరిశుభ్రత లాంటి సౌకర్యాలను తనిఖీ చేస్తారు. ఏవైనా లోపాలు కనిపిస్తే, వెంటనే సంబంధిత అధికారులకు పరష్కారం కోసం సిఫార్సు చేస్తారు. ప్రయాణీకులలో విశ్వాసాన్ని పెంచడంతో పాటు సురక్షితమైన ప్రయాణాలను నిర్ధారించేందుకు ఈ పద్దతి ఉపయోగపడనుంది.
ప్రయాగ్ రాజ్ లో అండర్ కవర్ ఆపరేషన్ ప్రారంభం
రీసెంట్ గా అండర్ కవర్ రైల్వే అధికారులు ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ డివిజన్ లో ఈ తర్వాత చెకింగ్స్ మొదలు పెట్టారు. మొత్తం 25 మంది అధికారుల బృందం 50 రైళ్లలో తనిఖీలు చేశారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ తరహా తనికీలు కొనసాగుతున్నాయి. ప్రయాగ్ రాజ్ విభాగంలో ప్రయాణీకులకు శుభ్రమైన మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, మంచి ఆహారం, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా ఈ బృందం తగిన సిఫార్సులు చేస్తోంది. అంతేకాదు, టికెట్ లేని ప్రయాణం, అక్రమాలను అరికట్టడానికి, రైల్వే స్టేషన్లలో, ఆన్ బోర్డ్ రైళ్లలో టికెట్ తనిఖీలను కూడా నిర్వహిస్తోంది. ముఖ్యంగా కోచ్‌లు, టాయిలెట్లు, లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనింగ్, నీటి సరఫరా, లినెన్, ఛార్జింగ్ పాయింట్ల శుభ్రతపై ఎక్కువ ఫోకస్ పెట్టారు ఈ ప్రత్యేక అధికారులు. రైల్ మదద్ ద్వారా అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ తనిఖీలు మరింత ఉపయోగపడుతాయని రైల్వే అధికారులు తెలిపారు. అటు రైళ్లలో ఆకతాయిలపైనా ఈ బృందం సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలోనూ తనిఖీలు
రైలు తనిఖీలతో పాటు, ఛార్జీల ఎగవేతను నివారించడానికి స్టేషన్లతో పాటు రైళ్లలో అండర్ కవర్ రైల్వే అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా రైల్వే కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా కొనసాగించేలా చేస్తుంది.
గతంలోనూ ఇలాంటి ప్రయత్నం జరిగినా..
గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. 2018లో, రైల్వే మంత్రిత్వ శాఖ ‘అండర్‌కవర్ మిస్టరీ మెన్’ ప్రతిపాదనను పరిశీలించింది. ఇందులో సాధారణ ప్రయాణీకుల మాదిరిగా అధికారులు రైళ్లలో ప్రయాణం చేసి, ఆహార నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, సౌకర్యాలను పరిశీలించి, నేరుగా మంత్రిత్వ శాఖకు నివేదికలు ఇవ్వాలి. 2021లో, ఢిల్లీలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మారువేషంలో తనిఖీలు చేసి, డ్యూటీలో లేని TTEలను, మద్యం సేవించిన ఒక TTEని గుర్తించి, వారిపై చర్యలు తీసుకున్నాడు. ఆ తర్వాత అధికారులు ఈ తనిఖీలపై పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఆగిపోయాయి. మళ్లీ ఇప్పుడు కొత్త పేరుతో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
Read Also: రైల్వేలోకి ఏఐ ఎంట్రీ, టికెట్ బుకింగ్ నుంచి క్యాన్సిలేషన్ వరకు అన్ని పనులు చేసేస్తుంది!