ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ అయిన విశాఖరైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. సౌత్ కోస్టల్ రైల్వే ప్రధాన కార్యాలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. ప్రధాని మోడీ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు దక్షిణ కోస్తా జోన్ కు కొత్తగా జోనల్ మేనేజర్ ను నియమించనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం విశాఖ జోన్ కు ఓఎస్డీ ఉన్నప్పటికీ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనుల పర్యవేక్షణకు జీఎం అవసరం ఉన్న నేపథ్యంలో రైల్వో బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే జోనల్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి గత నవంబర్ లోనే రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 12 అంతస్తుల్లో ఏర్పాటుకానున్న విశాఖ రైల్వే జోన్ కార్యాలయం కోసం రూ. 149 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. టెండర్లు దక్కించుకున్న సంస్థ రెండు సంవత్సరాల్లో ఈ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది.
రైల్వే జోన్ ఏర్పాటుతో కలిగే లాభాలు ఏంటి?
సౌత్ కోస్ట్ రైల్వే జోన్(విశాఖ రైల్వే జోన్) ఏర్పాటుతో బోలెడు లాభాలున్నాయి. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. గతంతో పోల్చితే మరిన్ని రైళ్తు అందుబాటులోకి రానున్నాయి. మౌలిక సదుపాయలు పెరగడంతో పాటు ఆర్థిక వృద్ధికి అవకాశం ఉంటుంది.
⦿మెరుగైన నిర్వహణ
జోన్ పరిధిలోని సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. స్థానిక అధికారులు సంబంధిత ప్రాంతాల్లోని నిర్దిష్ట అవసరాలు, సవాళ్లను గుర్తించి వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుంది. జోన్ కు సంబంధించి ట్రాఫిక్ కు అనుగుణంగా చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వీలైనంత త్వరగా సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
⦿ప్రయాణీకులకు మెరుగైన సేవలు
ప్రత్యేక జోన్ ఏర్పడటం వల్ల రైల్వే అధికారులు, ప్రయాణీకుల మధ్య మెరుగైన కమ్యూనికేషన్ ఉంటుంది. ప్రయాణీకుల ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. జోనల్ పరిధిలోని నిర్దిష్ట అవసరాలకు, ప్రాధాన్యతలకు అనుగుణంగా రైళ్లను నడిపే అవకాశం ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి, హోలీతో పాటు ఇతర స్థానిక పండుగలకు సరిపడ ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేసుకోవచ్చు.
⦿మెరుగైన మౌలిక సదుపాయాలు
రైల్వే జోన్ ఏర్పాటు కారణంగా ఫోకస్డ్ డెవలప్ మెంట్ జరుగుతుంది. ట్రాక్ పరిస్థితులు, సిగ్నలింగ్ సిస్టమ్, ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. జోనల్ అధికారులు తమ తమ ప్రాంతాల్లోని రైల్వే నెట్ వర్క్ కు సంబంధించిన సవాళ్లను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుంది.
⦿ఆర్థికాభివృద్ధి
రైల్వే జోన్ ఏర్పాటుతో ప్రజా రవాణాతో పాటు గూడ్స్ రవాణా కార్యకలాపాలు మరింత పెరుగుతాయి. ఫలితంగా ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
విశాఖ రైల్వే జోన్ గురించి..
గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను కలిపి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా ఏర్పాటు చేస్తున్నారు. వాల్తేరు డివిజన్ రెండు భాగాలుగా విభజించనున్నారు. ఇందులోని ఒక భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో కలిపి, దాన్ని విజయవాడ డివిజన్ లో విలీనం చేస్తారు. వాల్తేరు డివిజన్ లోని మిగతా భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వేజోన్ పరిధిలోని రాయగడ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న కొత్త డివిజన్ లో చేర్చనున్నారు. అటు సౌత్ సెంట్రల్ రైల్వేలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు ఉంటాయని రైల్వే సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం భారతీయ రైల్వే వ్యవస్థ 19 రైల్వే జోన్లు, 68 డివిజన్లను కలిగి ఉంది.
Read Also: జమ్మూకాశ్మీర్ కోసం సరికొత్త వందేభారత్, ఈ రైల్లో స్పెషల్ ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!