Prayagraj Sangam Railway Station: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbh Mela 2025) అత్యంత వైభవంగా కొనసాగుతోంది. త్రివేణి సంగమం(Sangam)లో పుణ్య స్నానాలు చేసేందుకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కుంభమేళా పరిసర ప్రాంతాల్లో రద్దీని తగ్గించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సంగం రైల్వే స్టేషన్(Sangam Railway Station) ను తాత్కాలింకంగా మూసివేశారు. రీసెంట్ గా కుంభమేళాలో తొక్కిసలాటతో పాటు రెండుసార్లు అగ్నిప్రమాదాలు జరగడంతో.. ఇకపై ఎలాంటి అపశృతి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమానికి వెళ్లే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రద్దీని నివారించడానికి స్టేషన్ ను తాత్కాలికంగా మూసివేశారు.
ప్రయాణీకులు సమీప రైల్వే స్టేషన్లకు తరలింపు
ప్రయాగరాజ్ సంగం స్టేషన్ ను మూసివేయడంతో కుంభమేళాలోని భక్తుల రద్దీని కొంతమేర తగ్గించారు. ఇక సంగం రైల్వే స్టేషన్ లో ఆగాల్సిన రైళ్లను సమీప రైళ్లే స్టేషన్లకు తరలించారు. ఇక్కడ రైళ్లు ఎక్కాల్సిన ప్రయాణీకులను కూడా సమీపంలోని ఇతర రైల్వే స్టేషన్లకు పంపించారు రైల్వే అధికారులు. యాత్రికులు సురక్షితంగా ఆయా స్టేషన్లు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మధ్య ప్రదేశ్ లోనూ భారీగా ట్రాఫిక్ జామ్
మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాగరాజ్ తో పాటు పొరుగున ఉన్న మధ్య ప్రదేశ్ లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే రద్దీని నివారించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలను చేపట్టారు. మధ్యప్రదేశ్ నుంచి కుంభమేళాకు వెళ్లే వాహనాలను ఉత్తరప్రదేశ్ అధికారుల అనుమతి పొందిన తర్వాత ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
250 కి. మీ మేర నిలిచిపోయిన వాహనాలు
ఇక మహారాష్ట్రతో పాటు సౌత్ స్టేట్స్ నుంచి వచ్చిన వాహనాలు పెద్ద సంఖ్యలో కట్ని, మైహార్, రేవా జిల్లాల్లో నిలిచిపోయాయి. చక్ ఘాట్ దగ్గర వాహనాలను నిలిపివేసినట్లు పోలీసులు వెల్లడించారు. గత రెండు రోజులుగా ప్రయాగరాజ్ వైపు వెళ్లే వాహనాల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ప్రయాగరాజ్ అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాతే వాహనాలు ముందుకు కదిలేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ప్రయాగరాజ్ కు వెళ్లేందుకు చాలా మంది వాహనదారులు రాంగ్ రూట్ లో వెళ్తున్నట్లు తెలిపారు. అలాంటి వాటిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
కట్నిలో జాతీయ రహదారి మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 250 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కొనసాగుతున్నది. ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఇబ్బందులు కలగకుండా భక్తులు కుంభమేళాకు వెళ్లి రావాలనేదే తమ ఉద్దేశం అన్నారు. అటు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న వారికి హిందూ సంస్థలు ఆహారం, తాగునీరు అందిస్తున్నాయి. ఆయా సంఘాలకు ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది.
Read Also: గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాలకూ ఓ వందేభారత్ స్లీపర్.. ఏ రూట్‌లో నడుస్తుందంటే?