Indian Railways: భారతీయ రైల్వేలో అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందేభారత్(Vande Bharat) ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రవేశ పెట్టింది రైల్వేశాఖ. మరికొద్ది రోజుల్లోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు(Vande Bharat Sleeper Trains) పట్టాలెక్కేందుకు సిద్ధం అవుతున్నాయి. సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఈ రైళ్లను రూపొందించారు. ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించిన ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. తొలి విడతలో భాగంగా దేశ వ్యాప్తంగా పలు రూట్లలో ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాని కేంద్ర ప్రభుత్వం(Central Government) భావిస్తున్నది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల (Telugu States)నుంచి ఓ వందేభారత్ రైలు పరుగులు తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైల్వే అధికారులు రైల్వే బోర్డు(Railway Board)కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తున్నది.
తొలి విడుతలో 9 వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం!
వాస్తవానికి తొలుత వందేభారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్(Delhi To Srinagar Vande Bharat) వరకు నడవనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ రూట్లో ట్రయల్స్ కూడా కొనసాగాయి. కానీ, దేశ వ్యాప్తంగా ఒకేసారి వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. తొలి విడతలో భాగంగా మొత్తం 9 రైళ్లను ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ రైళ్లలో ఒకదాన్ని తెలుగు రాష్ట్రాల నుంచి నడిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు, ఈ రైలు ఏ రూట్ లో ప్రయాణించాలి అనే అంశంపైనా రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైలు ఏ రూట్ లో ప్రయాణిస్తుందంటే?
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ స్లీపర్ రైలు రెండు మార్గాల్లో ఏదో ఒక రూట్ లో నడిపించాలని రైల్వే అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి అయోధ్య మార్గంలో నడిపించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. దానితో పాటు సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందేభారత్ స్లీపర్ రైలు ప్రతిపాదన పైన తుది కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ రెండు రూట్లలో ఏదో ఒకదాన్ని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రైలును విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే అయోధ్యకు నడిపించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారట. అంతేకాదు, ఈ రైలును రాత్రి పూట నడిపించేలా చర్యలు తీసుకుంటున్నారట. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పలువురు ప్రజా ప్రతినిధులు రైల్వే మంత్రికి వినితి పత్రాలు సమర్పించారట. అటు ఈ రెండు మార్గాల్లో ప్రయాణీకుల డిమాండ్, రద్దీ గురించి రైల్వే బోర్డుకు నివేదిక అందించే పనిలో ఉన్నారట రైల్వే అధికారులు. ఈ నివేదిక చూసిన తర్వాత ఏ రూట్ లో నడిపించాలనే అంశంపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వందేభారత్ స్లీపర్ ట్రయల్ రన్ సక్సెస్
అటు వందేభారత్ స్లీపర్ రైలుకు సంబంధించి ట్రయల్ రన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు రైల్వే అధికారులు. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ వందే భారత్ స్లీపర్ రైలును ముంబై- అహ్మదాబాద్ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇప్పటికే రైల్వే అధికారులు ఈ రైలు తన సేవలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని అనుమతులు జారీ చేశారు. త్వరలోనే ఈ రైళ్లు తమ సేవలను మొదలు పెట్టే అవకాశం ఉంది.
Read Also: ప్రయాణీకులకు అలర్ట్, ఆ రూట్ లో ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు 36 రైళ్లు రద్దు!