MLC Elections on Volunteers: ఏపీలో ఈ నెల 27న రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల సంధర్భంగా కూటమికి పెద్ద షాకిచ్చేందుకు రెడీ అయ్యారు వారు. వైసీపీ వేసిన ప్లాన్ లో భాగమో ఏమో కానీ, ఏకంగా నామినేషన్లు వేసి తమ సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. వారే వాలంటీర్లు.. తమను కూటమి మోసం చేసిందని, అందుకే తమ వాణి వినిపించేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు వారు అంటున్నారు. ఇంతకు ఇది వైసీపీ ప్లానా.. వాలంటీర్ల రివేంజా అనే రీతిలో ఉందని ప్రచారం సాగుతోంది.
గత ప్రభుత్వ హయాంలో అంతా తానై నడిపించారు వాలంటీర్లు. అయితే వీరి నియామకం విషయంలో పలు మార్లు వైసీపీ నేతలే.. తమ కార్యకర్తలకే వాలంటీర్ పోస్టులు ఇవ్వాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అదే ఇప్పుడు వారికి తలనొప్పులు తెచ్చిపెట్టిందని టాక్. కూటమి అధికారంలోకి రాకముందు.. కూటమి నేతలు బహిరంగ సభల్లో వాలంటీర్లకు రూ. 10 వేలు వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారం వచ్చింది.. కానీ వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్దత గత ప్రభుత్వం కల్పించలేదని, అందుకే వారిని కొనసాగించలేమని ప్రభుత్వం తెగేసి చెప్పింది.
ఈ తరుణంలో వాలంటీర్లు రోడ్డెక్కారు. నిరసనలు తెలిపి తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్లు పంచే పింఛన్ లను ప్రతి నెలా సచివాలయ సిబ్బంది చేత పంపిణీ ఏ ఆటంకం లేకుండా సాగిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడ గత ప్రభుత్వం వాలంటీర్లకు అన్యాయం చేసిందని, వారు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేదంటూ తెగేసి చెప్పారు. ఇది ఇలా ఉంటే మన పార్టీ కార్యకర్తలే వాలంటీర్లుగా ఉండాలని వైసీపీ నేతలు చేసిన మాటలే ఇప్పుడు వాలంటీర్లకు ఉద్యోగాలు లేకుండా చేశాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఇది ఇలా ఉంటే ఎన్నికల సమయంలో కొందరు వాలంటీర్లు, వైసీపీకి మద్దతుగా నిలిచేందుకు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలు కూడ అప్పట్లో ఆమోదించబడ్డాయి. ఏదిఏమైనా తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వాలంటీర్లు మాత్రం పట్టుబడుతున్నారు, ఇలాంటి సమయంలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. వైసీపీ మాత్రం పోటీలో నిలుస్తుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే కూటమికి వాలంటీర్లు మాత్రం బిగ్ షాక్ ఇచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా – గుంటూరు జిల్లాల లో వాలంటీర్లు నామినేషన్ దాఖలు చేశారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన మమత మాట్లాడుతూ.. వాలంటీర్లకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని, అందుకే చట్టసభల్లో వాలంటీర్ల వాణి వినిపించేందుకు నామినేషన్ వేసినట్లు చెప్పారు. తనను గెలిపిస్తే వాలంటీర్ల సమస్యలపై శాసనమండలిలో పోరాటం చేస్తానంటూ ప్రకటించారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలలో శివ గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం మీద ఇదంతా వైసీపీ వేసిన ప్లాన్ గా కొందరు కూటమి నేతలు విమర్శిస్తుండగా, మరికొందరు వాలంటీర్లు చేస్తున్న పోరాటానికి సూపర్ రివేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వాలంటీర్..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన మమత
వాలంటీర్లకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది
అందుకే చట్టసభల్లో వాలంటీర్ల వాణి వినిపించేందుకు నామినేషన్ వేసినట్లు చెప్పిన మమత
వాలంటీర్ల సమస్యలపై శాసనమండలిలో… pic.twitter.com/5mnyIUKcof
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2025