Private Travels Looting: సంక్రాంతి వచ్చిందంటే.. సామాన్యుడి జేబుకు చిల్లు వేసేందుకు ప్రైవేటు ట్రావెల్స్ రెడీ అవుతాయి. పండగ వేళ టికెట్ల కృత్రిమ కొరతను సృష్టించి అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాయి. దొరికనంత దోచుకో అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఏకంగా సాధారణ రేట్ల కంటే.. 50 నుంచి 60 శాతం పెంచేసి వసూళ్లు చేస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌పై దందాపై బిగ్ టీవీ నిఘా టీమ్ ఫోకస్ చేసి.. అక్రమ వసూళ్లను బట్టబయలు చేసింది.
పండుగు ఊరెళ్లాలంటే.. ఊరిలో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కనిపిస్తోంది. ఏకంగా రెట్టింపుకు మించి ప్రైవేటు ట్రావెల్ బస్సులు వసూళ్లు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు లేవంటూ.. ట్రావెల్ ఏజన్సీల ఆథరైజ్డ్ ఆఫీసుల దగ్గరకు రప్పించుకుంటున్నారు. అడ్డగోలుగా పెంచిన ధరలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వసూలు చేస్తున్న రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, భీమవరం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా.. రెట్టింపు చెల్లించాల్సిందే.
ఇక టికెట్ ధరలను ఎందుకిలా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని బిగ్ టీవీ నిలదీస్తే.. ట్రావెల్ ఏజంట్లు చెప్పే సమాధానాలు వుయ్ డోంట్ కేర్ అనేలా ఉన్నాయి. వీళ్లకు ఏ భయం లేదని తేలిపోతోంది. ప్రతీ ఏటా ఈ దోపిడీ కామన్ అనేలా వాళ్ల వాయిస్ వినిపిస్తోంది. నిబంధనలు పాటించరా? అంటే.. తేలికగా సమాధానాలు చెబుతున్నారు.
ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు ప్రయాణికులపై భారీగా భారాన్ని మోపుతూ టికెట్ ధరలను విపరీతంగా పెంచేశాయి. తాజా రేట్ల ప్రకారం.. హైదరాబాద్ నుండి భీమవరం వెళ్లే స్లీపర్ అప్పర్ బెర్త్ ధర రూ. 2,200 కాగా, లోయర్ బెర్త్ రూ. 2,300గా ఉంది. బెంగళూరు వెళ్లే ప్రయాణికులు అప్పర్ బెర్త్‌కు రూ. 2,600, లోయర్ బెర్త్‌కు రూ. 2,800 చెల్లించాల్సి వస్తోంది. విజయవాడ మార్గంలో లోయర్ బెర్త్ రూ. 2,400, అప్పర్ రూ. 2,000కు చేరింది. అలాగే రాజమండ్రికి లోయర్ బెర్త్ రూ. 2,000, అప్పర్ రూ. 1,900గా నిర్ణయించారు. ఇక వైజాగ్ వెళ్లే స్లీపర్ అప్పర్ బెర్త్ రూ. 1,800 ఉండగా, లోయర్ బెర్త్ ధర రూ. 2,000కు పెరిగింది. పండుగలు లేదా రద్దీ సమయాల్లో ఈ ధరలు సామాన్యులకు పెను భారంగా మారుతున్నాయి.
సంక్రాంతి పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు లేవంటూ కృత్రిమ కొరత సృష్టించి, ఆఫీసుల్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎటు వెళ్లాలన్నా టికెట్ ధర రూ. 2,000 దాటడం గమనార్హం.
ఆర్టీసీ ధరలు పెంచినప్పుడు మేం పెంచితే తప్పేంటని యజమానులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రైవేట్ ఆపరేటర్లు సిండికేట్‌గా మారి ప్రయాణికుల నడ్డి విరుస్తున్నారు. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని.. ఎవరికి చెప్పుకున్నా భయం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారు.
ALSO READ: హల్దీయాలో ఇండియన్ నేవీ కొత్త బేస్.. చైనా, బంగ్లాదేశ్‌లకు భారత్ గట్టి కౌంటర్!