Argentina Ocean Mystery: అర్జెంటీనాలోని అట్లాంటిక్ మహాసముద్రం రాత్రికి రాత్రి ఎండిపోయిందని, నీరంతా భూమిలోకి ఇంకిపోయిందంటూ కొన్ని వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సముద్ర తీరం పొడిగా మారిపోవడం, నీళ్లులేని తీరంలో పడవలు ఇసుకలో కూరుకుపోయిన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. కొందరైతే దీనిని సునామీకి సంకేతంగా అభివర్ణించగా.. ఇంకొందరు ఈ విపత్కర పరిణామం రాబోయే ప్రళయానికి సూచిక అంటూ తెగ ప్రచారం చేశారు. అయితే ఈ సోషల్ మీడియా ప్రచారంలో ఎంతవరకు నిజముందో ఇప్పుడు చూద్దాం.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు నిజమే అయినప్పటికీ సముద్రం శాశ్వతంగా ఎండిపోయిందనే ప్రచారంలో మాత్రం ఎలాంటి నిజం లేదు. అర్జెంటీనా (Argentina)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ‘మార్ డెల్ ప్లాటా’ (Mar del Plata) తీరంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఘటన చోటుచేసుకుంది. అయితే ఇక్కడ వీచిన బలమైన గాలుల వల్ల కొద్ది గంటల పాటు సముద్రపు నీరు వెనక్కి తగ్గింది. దీనివల్ల సాధారణంగా నీటి అడుగున ఉండే ‘రెస్టింగా డెల్ ఫారో’ అనే పెద్ద రాతి నిర్మాణం బయటపడింది. అయితే కొద్ది గంటల తర్వాత అలల సైకిల్ పూర్తయ్యేసరికి సముద్రం మళ్లీ యథాస్థితికి వచ్చేసింది.
రాత్రికి రాత్రే సముద్రం ఖాళీ
అర్జెంటీనాలో 23కి.మీ వెనక్కి వెళ్లిన సముద్రం
నీళ్లు ఖాళీ కావడంతో బయటపడ్డ రాతి నిర్మాణం.. వీడియోలు వైరల్ pic.twitter.com/y5uQHT8mXq
— Telugu Feed (@Telugufeedsite) September 11, 2026
సముద్రపు నీరు వెనక్కి వెళ్లడానికి బయట ప్రచారం జరుగుతున్నట్లు సునామీనో, ప్రళయానికి సంకేతమో కాదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇది సహజ సిద్దమైన వాతావరణ మార్పుల వల్ల చోటుచేసుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు. తీరం నుంచి సముద్రం వైపు నిరంతరం వీచిన బలమైన గాలుల వల్ల తీరంలోని నీరు సముద్రంలోకి నెట్టబడిందని పేర్కొంటున్నారు. దీనివల్ల తీరంలో నీటి మట్టం ఒక్కసారిగా తగ్గిపోయిందని తెలియజేస్తున్నారు. వాతావరణ పీడనంలో (Atmospheric Pressure) వచ్చిన అకస్మాత్తు మార్పులు కూడా నీరు వెనక్కి తగ్గడానికి కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వాతావరణ ప్రభావాలకు తోడు ఆ సమయంలో సాధారణంగా వచ్చే పోటు వల్ల కూడా సముద్రం వెనక్కితగ్గి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఇయర్‌ఫోన్లు వాడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. 60/60 రూల్ పాటిస్తే అంతా సెట్!
సాధారణంగా సముద్ర నీరు ఒక్కసారిగా వెనక్కి తగ్గితే సునామీ వస్తుందేమోనని భయపడుతుంటారు. భూకంపాలు లేదా అగ్నిపర్వతాలు పేలినప్పుడు కొన్ని నిమిషాల వ్యవధిలోనే నీరు లోపలికి వెళ్లి వెంటనే పెద్ద అలలుగా విరుచుకుపడుతుంది. కానీ అర్జెంటీనాలో కొన్ని గంటల పాటు గాలుల వల్ల మాత్రమే నీరు వెనక్కి తగ్గింది. కాబట్టి ఇది సునామీ హెచ్చరిక కాదని అధికారులు స్పష్టం చేశారు. ప్రకృతిలో సంభవించిన ఒక చిన్న తాత్కాలిక మార్పును సోషల్ మీడియాలో ‘ప్రపంచ వినాశనం’ అనే రేంజ్ లో ప్రచారం చేయడాన్ని తప్పుబడుతున్నారు.
Also Read: దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!