Railway Minister On Train Blankets: రైల్వే ప్రయాణీకుల నుంచి తరచుగా వినిపించే ఫిర్యాదులలో బ్లాంకెట్స్ నీట్ గా లేవనేది ఒకటి. కొన్నిసార్లు రైళ్లలో మురికిగా ఉన్న బ్లాంకెట్స్ ను ఇస్తున్నారని ప్యాసెంజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఇదే విషయం పార్లమెంట్ లోనూ చర్చకు వచ్చింది. రైళ్లలో ప్రయాణీకులకు ఇచ్చే దుప్పట్లు, దిండ్లను ఎన్ని రోజులకు ఒకసారి ఉతుకుతారని లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇండోరా ఓ ప్రశ్న అడిగారు. దీనికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాతపూర్వకంగా సుదీర్ఘ సమాధానం చెప్పారు. రైళ్లలో బ్లాంకెట్స్ ను నెలకు ఒకసారి ఉతుకుతారని వెల్లడించారు. అంతేకాదు, బెడ్ రోల్ కిట్ లో మెత్తని కవర్ గా ఉపయోగించేందుకు అడిషనల్ షీట్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
BIS ధృవీకరణతో కూడిన యంత్రాలతో దుప్పట్ల క్లీనింగ్
రైళ్లలో అందిస్తున్న బ్లాంకెట్స్ ను పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా క్లీనింగ్ చేస్తున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బ్లాంకెట్స్ క్లీనింగ్ కు ప్రయాణీకులు ఛార్జీ చెల్లిస్తున్న నేపథ్యంలో వారికి పరిశుభ్రమైన దుప్పట్లను అందిస్తున్నట్లు తెలిపారు. రైళ్లలో ఉపయోగించే దుప్పట్లు చాలా తేలికగా ఉంటాయన్నారు. ఈజీగా ఉతికే అవకాశం ఉందన్నారు. దుప్పట్ల శుభ్రత విషయంలో రైల్వే సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. దుప్పట్ల శుభ్రత కోసం BIS సర్టిఫికేషన్ తో కూడిన బెడ్ రోల్ కిట్లును అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఉతికిన బ్లాంకెట్ల నాణ్యతను టెస్ట్ చేసేందుకు వైటో మీటర్ ను ఉపయోగిస్తారని వెల్లడించారు.
‘రైల్ మదద్’ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
అటు బ్లాంకెట్స్ కు సంబంధించి ‘రైల్ మదద్’ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్ తో పాటు డివిజనల్ స్థాయిలో వార్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అంతేకాదు, బెడ్ రోల్స్ కోసం పర్యావరణ అనుకూలంగా ఉండే ప్యాకింగ్ ఉంటుందన్నారు. స్టేషన్లు, రైళ్లలో బెడ్ రోల్స్ స్టోరేజీ, రవాణా, నిర్వహణ కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ రైల్లో బ్లాంకెట్లు శుభ్రంగా లేవని ప్రయాణీకులు ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు మార్చేలా ఏర్పట్లు చేసినట్లు తెలిపారు.
నెలకు రెండుసార్లు వాష్ చేయాలంటున్న ప్రయాణీకులు
రైల్వేమంత్రి ఇచ్చిన సమాధానంతో చాలా మంది ప్రయాణీకులు కన్విన్స్ అవుతున్నారు. బ్లాంకెట్స్ వాషింగ్ కు సంబంధించి పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వడంతో అసలు విషయం తెలుసుకున్నారు. ఇంతకాలం ఎన్ని రోజులకు ఓసారి ఉతుకుతారో తెలియక, అసలు వాడాలా? వద్దా? అని కొంత మంది ఆలోచించేవారు. రైల్వే మంత్రి సమాధానంతో చక్కగా వాడుకోవచ్చనుకుంటున్నారు. మరికొంత మంది మరీ నెలకోసారి అంటే అంత శుభ్రంగా ఉండవని అభిప్రాయాపడుతున్నారు. కనీసం నెలకు రెండుసార్లు ఉతికే ఏర్పాటు చేయాలంటున్నారు. ఇంకొంత మంది ఇంట్లో మాదిరిగానే నెలకోసారి ఉతికితే సరిపోతుందంటున్నారు. ఒకవేళ శుభ్రంగా లేవనిపిస్తే రైల్వే సిబ్బందికి చెప్పి మార్పించుకుంటే సరిపోతుందంటున్నారు.
Read Also: రైలు టాయిలెట్‌లో వింత శబ్దాలు.. తెరిచి చూసి షాకైన ఆర్పీఎఫ్ జవాన్లు