Indian Railways: దేశంలోనే తొలి బుల్లెట్ రైలు అహ్మదాబాద్- ముంబై నగరాల మధ్య పరుగులు తీయనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు దక్షిణ, పశ్చిమ భారత్ లోని ఇంటర్ సిటీ ప్రయాణాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో ముంబై-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు (MHHSR) ప్రాజెక్ట్ ను చేపట్టారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ రైల్వే మంత్రిత్వ శాఖకు అందినట్లు తెలుస్తోంది.
767 కి.మీ పరధిలో బుల్లెట్ రైలు కారిడార్
సుమారు 767 కిలో మీటర్ల పరిధిలో ఈ ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణం కానుంది. ఈ లైన్ మహారాష్ట్ర, తెలంగాణ అంతటా 11 స్టేషన్ల ద్వారా కీలకమైన పట్టణ కేంద్రాలు, ముంబై, పూణే, హైదరాబాద్ లను కలుపుతుంది. 2019లో ప్రకటించిన హై స్పీడ్ రైలు (HSR)లో భాగంగా MHHSRను అనౌన్స్ చేశారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణీకులను శరవేగంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దేశ వ్యాప్తంగా ఆరు కారిడార్లను ప్రకటిస్తే, అందులో ముంబై-హైదరాబాద్ హై-స్పీడ్ రైల్వే కారిడార్ ఐదవది. నిర్మాణం ఇంకా ప్రారంభం కానప్పటికీ, గ్రౌండ్ వర్క్ కోసం టెండర్లు సహా ఇతర కార్యకలాపాలు అక్టోబర్ 2020లో ప్రారంభమయ్యాయి. ఇక తాజాగా నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) రైల్వే మంత్రిత్వ శాఖకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన DPRను సమర్పించింది.
రైల్వేశాఖ ఆమోదం తర్వాత పనులు ప్రారంభం
ఇక ముంబై-హైదరాబాద్ హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు డీపీఆర్ కు రైల్వేశాఖ ఆమోదం తెలిపిన తర్వాత ప్రారంభం కానున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో, అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలతో హై స్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణ పనులు కొనసాగనున్నాయి.
Read Also: ఇక ఆలస్యమే ఉండదు.. విజయవాడకు బైపాస్ లైన్, ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
బుల్లెట్ రైలు వేగం ఎంత అంటే?
ఇక ముంబై-హైదరాబాద్ హై-స్పీడ్ రైలుకు సంబంధించిన ట్రైన్ సెట్లు గరిష్టంగా గంటకు 350 కి.మీ వేగంతో వెళ్లేలా రూపొందిస్తున్నారు. ఆపరేషనల్ వేగం మాత్రం గంటకు 320 కి.మీ ఉండనుంది. సగటు ప్రయాణ వేగం గంటకు 250 కి.మీ ఉంటుంది. ఈ రైలు 750 మంది ప్రయాణీకుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రైల్వే మార్గంలో ముంబై, నవీ ముంబై, లోనావాలా, పూణే, కుర్కుంబ్, అక్లుజ్, పంధర్‌పూర్, సోలాపూర్, కలబురగి, జహీరాబాద్, హైదరాబాద్ లో రైల్వే స్టేషన్లు ఉండనున్నాయి. ఈ మార్గం ప్యాకేజీ C3 దగ్గర నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ తో అనుసంధానం చేయనున్నారు. ఇక ఈ బుల్లెట్ రైలు ప్రయాణానికి సంబంధించిన టికెట్ ధరలు ఇంకా నిర్ణయించనప్పటికీ, ప్రస్తుత AC ఫస్ట్ క్లాస్ ఛార్జీల కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: లోకో పైలెట్ సాలరీ IAS ఆఫీసర్స్ కంటే ఎక్కువా? ఇదీ అసలు కథ!