Indian Railways: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే సంస్థల్లో ఇండియన్ రైల్వే ఒకటి. ఇక్కడ సుమారు లక్ష కిలో మీటర్ల రైల్వే లైన్లు, 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రోజూ సుమారు 20 వేల రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. వీటిలో 13 వేల ప్యాసింజర్ రైళ్లు కాగా, మిగతావి గూడ్స్ రైళ్లు. నిత్యం 2.5 కోట్ల మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతాయి. టన్నుల కొద్ది సరుకు రవాణా చేస్తాయి. దేశానికి వెన్నెముక లాంటి రైల్వే వ్యవస్థ సజావుగా ముందుకు కొనసాగడానికి లోకో పైలెట్లు కీలక పాత్ర పోషిస్తారు. ఇంతకీ వీరిని ఎలా రిక్రూట్ చేస్తారు? సాలరీ ఎంత ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
భారతీయ రైల్వేలో 1.10 లక్షల మంది లోకో పైలెట్లు
భారతీయ రైల్వేలో ప్రస్తుతం 12.3 లక్షలకు పైగా సిబ్బంది ఉన్నారు. వారిలో లోకో పైలట్లు సుమారు 1.10 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 2,100 మంది మహిళా లోకో పైలట్లు ఉన్నారు. ఇక లోకో పైలెట్ల జీతానికి సంబంధించి ప్రాథమిక వేతనం, భత్యాలు, అదనపు ప్రోత్సాహకాలు ఉంటాయి. లోకో పైలెట్ల కెరీర్ సాధారణంగా అసిస్టెంట్ లోకో పైలట్లుగా ప్రారంభమవుతుంది. సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్లు, లోకో పైలట్లు, చివరికి పర్యవేక్షక పొజిషన్లోకి చేరుకుంటారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వీరిని రిక్రూట్ చేసుకుంటుంది.
లోకో పైలట్ల జీతం IAS కంటే ఎక్కువగా ఉంటుందా?
భారతీయ రైల్వేలలో లోకో పైలట్ జీతం అనేది అనుభవం, పని చేసే స్థానం, నడిపే రైలు మోడల్ ను బట్టి మారుతూ ఉంటుంది. గూడ్స్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, వందేభారత్ లాంటి హైస్పీడ్ రైళ్లు ఉంటాయి. ఒక్కో రకం రైలును బట్టి ఒక్కో లోకో పైలెట్ సాలరీ ఉంటుంది. నిజానికి భారత రైల్వేలో కొంతమంది లోకో పైలట్ల నెలవారీ జీతం IRSEE అధికారులైన సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ల (Sr DEE) కంటే ఎక్కువగా ఉంటుంది. సీనియర్ DEE.. IASలో జిల్లా మేజిస్ట్రేట్ (DM)కి సమానమైన హోదాను కలిగి ఉన్నారు. అంటే కలెక్టర్ కు మించిన సాలరీ పొందే లోకో పైలెట్లు కూడా ఉన్నారు.
లోకో పైలెట్, Sr DEE సాలరీ మధ్య పోలిక
మార్చి 2025కి భారతీయ రైల్వేలో లోకో పైలట్ సాలరీ స్లిప్‌ను పరిశీలించినప్పుడు రూ. 2,02,565 గ్రాస్ పే, రూ. 31,512 గ్రాస్ డిడక్షన్స్, రూ. 1,71,053 నెట్ పేగా ఉన్నట్లు తేలింది. ఇక IRSEE అధికారి అయిన సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (Sr DEE) సాలరీ స్లిప్ పరిశీలిస్తే రూ. 1,31,733 గ్రాస్ పే, రూ. 40,733 గ్రాస్ డిడక్షన్స్, రూ. 91,000 నెట్ పేగా ఉన్నట్లు తేలింది. ఈ పే స్లిప్స్ ను పరిశీలిస్తే, కొంతమంది లోకో పైలట్ల టేక్-హోమ్ జీతం సీనియర్ రైల్వే అధికారుల కంటే ఎక్కువగా ఉందని స్పష్టం అవుతోంది.
Read Also: ఆహా.. ఏసీ ఎంఎంటీఎస్, అక్కడ మొదలు.. మరి మనకెప్పుడో!