మనదేశంలో ఇతర వాహనాలతో పోలిస్తే రైలు ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటుంది. అందుకే ఐఆర్‌సీటీసీ ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రయాణికులను మోసుకెళ్తున్న రవాణా సౌకర్యంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు రైల్వే ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగించే వార్త వచ్చింది. అదేంటంటే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్న వ్యక్తులకు అదృష్టం ఉంటే సెకండ్ ఏసీకి అప్‌గ్రేడ్ అవ్వవచ్చు. అయితే సెకండ్ ఏసీలో ఖాళీలు ఉండాలి.
ఒకప్పుడు సెకండ్ ఏసీకి అప్డేట్ అయ్యే అవకాశం కేవలం థర్డ్ ఏసి టికెట్ తీసుకున్న వ్యక్తులకు మాత్రమే ఉండేది. అదే స్లీపర్ క్లాస్ వ్యక్తులకు థర్డ్ ఏసి వరకే అప్డేట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం స్లీపర్ క్లాస్ తీసుకున్నప్పటికీ సెకండ్ ఏసీలో ఖాళీలు ఉంటే అక్కడికి అప్డేట్ చేసే అవకాశం వచ్చింది.
కొత్త నిబంధనలు
రైల్వే బోర్డు డైరెక్టర్ సంజయ్ మనోజ్ మే 13న అన్ని జోనల్ రైల్వే లకు ఈ కొత్త నిబంధన గురించి తెలియజేస్తూ లేఖను పంపారు. సాఫ్ట్‌వేర్‌లో అందుకు అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించారు. చైర్ కార్ టికెట్ ఉంటే ఏసీ చైర్ కార్‌కు అప్డేట్ అయ్యే అవకాశం కూడా వస్తుంది. అయితే ఏసీ ఛైర్ కారులో సీట్లు ఖాళీగా ఉండాలి.
అదనపు ఛార్జీలు అవసరం లేదు
ఈ కొత్త నిబంధనల కింద ప్రయాణికులు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఏసీ తరగతిలో ప్రయాణించే అవకాశాన్ని పొందుతారు. అలాగే సెకండ్ ఏసీ టికెట్ తీసుకున్న వ్యక్తులకు మొదటి ఏసీకి మార్చే అవకాశం కూడా ఉంది. అయితే మొదటి ఏసీలో ఖాళీలు ఉండాల్సిన అవసరం ఉంది. ఏసీలో ఖాళీగా ఉన్న సీట్లను ఉపయోగించుకునేందుకే రైల్వే శాఖ ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇలా చేయడం వల్ల ప్రయాణికులకు కూడా మెరుగైన సౌకర్యాలు అందుతాయని ఎక్కువ మందికి బెర్తులు వచ్చే అవకాశం ఉందని వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ కొత్త నిబంధన ప్రకారం సెకండ్ ఏసీ టిక్కెట్ కొన్నవారికి ఫస్ట్ ఏషీలో ఖాళీలు ఉంటే అక్కడికి అప్‌గ్రేడ్ చేస్తారు. దీని వల్ల ఎక్కువ మందికి బెర్తులు దొరికే అవకాశం ఉంటుంది. అలాగే స్లీపర్ టికెట్ కొన్న వ్యక్తికి థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది.
2006 నుంచే అమలులో
రైల్వే ఆటో అప్‌గ్రేడ్ సౌకర్యం 2006 నుండి కూడా అమలులో ఉంది. ప్రయాణికులు స్లీపర్ క్లాస్ టికెట్ తీసుకున్నా కూడా థర్డ్ ఏసీలో ఖాళీలు ఉంటే అక్కడికి అప్ గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికోసం ప్రయాణికులు ఎటువంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.
ఆటో అప్డేట్ ఆప్షన్ ఎంచుకోండి
మీరు ఈ అప్‌గ్రేడ్ సౌకర్యాన్ని పొందాలనుకుంటే టికెట్ బుకింగ్ సమయంలోనే ఐఆర్సిటిసి వెబ్సైట్లో ఆటో అప్డేట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ప్రయాణికులు ఈ ఆప్షన్ ను ఎంచుకోకపోతే అతని టికెట్ అప్‌గ్రేడ్ కాదు. అప్డేట్ అయిన తర్వాత ప్రయాణికుడు తన టికెట్ను రద్దు చేసుకోవాలనుకుంటే అతనికి ఏసీ తరగతి టికెట్ రుసుము వెనక్కి రాదు. కేవలం స్లీపర్ క్లాస్ టికెట్ ధర మొత్తమే వెనక్కి వస్తుంది. ఎందుకంటే అతను మొదలు స్లీపర్ క్లాస్ ను మాత్రమే బుక్ చేసుకున్నాడు. కాబట్టి ఈ సౌకర్యం వల్ల ప్రయాణికులకు తక్కువ ఖర్చుతోనే మెరుగైన ప్రయాణాన్ని అందించే అవకాశం దక్కుతుంద న్నది రైల్వే శాఖ ఉద్దేశం.
భారతీయ రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ప్రయాణికులను ఉద్దేశించి కొత్త మార్పులను చేస్తూనే ఉంది. ఇటీవల మే 1న రైల్వే శాఖ ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఇకపై వెయిటంగ్ లిస్టు టికెట్లు కలిగిన వారు స్లీపర్ లేదా ఏసీ బోగీలో ఎక్కేందుకు అనుమతి లేదు. ఆ భోగిల్లో పెరుగుతున్న రద్దీని నియంత్రించేందుకే ఇలాంటి నిబంధనను తీసుకొచ్చింది. ఐఆర్సిటిసి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ కొత్త నిబంధన ప్రకారం మాత్రం ఇకపై అలా చేయడానికి వీలు లేదు. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నవారు రిజర్వేషన్ లేని జనరల్ బోగీలోని ప్రయాణించడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.
ఎవరైనా ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్ టికెట్ తో స్లీపర్ లేదా ఏసీ బోగీలో ప్రయాణిస్తే వారికి జరీమానా పడే అవకాశం ఉంది. స్లీపర్ క్లాస్ లో ఎక్కితే 250 రూపాయలు, ఏసీ క్లాస్ లో ఎక్కితే 440 రూపాయలు జరిమానా కట్టాల్సి వస్తుంది. అంతేకాదు ఎక్కిన స్టేషన్ నుంచి తర్వాత స్టేషన్ వరకు అదనపు చార్జీలను వసూలు చేస్తారు. వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో ఇలా రిజర్వేషన్ బోగీలు ఎక్కితే వారిని రైలు నుంచి దింపేసి అధికారం కూడా టీటీకి ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణానికి 120 రోజుల ముందు నుంచే టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. అంటే మీ ప్రయాణ తేదీకి సరిగ్గా నాలుగు నెలల ముందు నుంచే టికెట్ ను బుక్ చేసే అవకాశాన్ని ఐఆర్సిటిసి అందిస్తుంది.