Indian Railways: భారతీయ రైల్వే మరింత వేగం పుంజుకుంటుంది. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా పలు రూట్లలో రైళ్ల వేగాన్ని గణనీయంగా పెంచేందుకు నిర్ణయం తీసుకుంటున్నది. తమిళనాడులోని రద్దీ కారిడార్ లో గరిష్ట వేగాన్ని పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం గంటకు 110 కి.మీ వేగంతో రైళ్లు ప్రయాణిస్తుండగా, ఇకపై 130 కి.మీకి పెంచడానికి రైల్వే అధికారులు మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత విల్లుపురం-తిరుచ్చి మార్గంలో రైళ్లు మరింత వేగాన్ని అందుకోనున్నాయి.
తమిళనాడు అత్యంత రద్దీ రైల్వే లైన్
తమిళనాడులో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో విల్లుపురం-తిరుచ్చి మార్గం ఒకటి. ఈ మార్గం ద్వారా ప్రతి రోజు 100కి పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. ఇందులో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రూట్ ను అప్ గ్రేడ్ చేయడానికి అధికారులు నిర్ణయించారు. వృద్ధాచలం, అరియలూర్, లాల్గుడి, శ్రీరంగం మీదుగా విల్లుపురం-తిరుచి కార్డ్ లైన్ విభాగంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని పెంచబోతున్నారు. మొత్తం 170 కిలో మీటర్ల విద్యుదీకరణ మార్గం పలు కీలక జంక్షన్లను కలుపుతుంది. తమిళనాడును కేరళ సహా ఇతర ప్రాంతాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇప్పటికే స్పీడ్ పెంపు పనులు ప్రారంభం
ఈ మార్గంలో ఇప్పటికే రైళ్ల వేగాన్ని పెంచే ప్రకియ మొదలయ్యింది. ఇంజనీరింగ్, టెలికాం, సిగ్నలింగ్ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. బ్యాలస్ట్ డీప్ స్క్రీనింగ్ ట్రాక్ బేస్ ను బలోపేతం చేస్తున్నారు. హై-స్పీడ్ కార్యకలాపాలకు మద్దతుగా కర్వ్ రీ అలైన్ మెంట్ జరుగుతోంది. అదే సమయంలో ఫెన్సింగ్ పనులను కూడా చేపడుతున్నారు. ఎక్కువ వేగానికి అనుగుణంగా సురక్షితమైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం కీలకమైన కొత్త డబుల్ డిస్టెన్స్ సిగ్నల్స్ విల్లుపురం- వృద్ధాచలం మధ్య దాదాపు పూర్తయ్యాయి. వృద్ధాచలం నుంచి సిల్లక్కుడి- తిరుచ్చి వరకు ఈ పనులు కొనసాగుతున్నాయి.
Read Also: 18 ఏళ్లు ఎయిర్ పోర్టులోనే బతికాడు, స్పీల్ బర్గ్ సినిమాకు ప్రేరణ అయ్యాడు.. చివరికి అక్కడే..
గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం
రైళ్ల వేగం పెరగడంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్, పాండియన్ ఎక్స్ ప్రెస్, రాక్‌ఫోర్ట్ ఎక్స్ ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లు మరింత వేగంగా ప్రయాణించనున్నాయి. వేగవంతమైన సర్వీస్ కారణంగా ప్రయాణీకులకు మరింత టైమ్ సేవ్ కానుంది. అంతేకాదు, ఈ కారిడార్ లో సరుకురవాణా సేవలు కూడా మరింత వేగంగా కొనసాగనున్నాయి. ఇంధనం, సిమెంట్ సహా ఇతర గూడ్స్ తరలింపు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. తమిళనాడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం కానుంది. రాబోయే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ పనులు పూర్తి కానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ వేగాన్ని పెంచడం వల్ల ప్రయాణీకులకు ప్రతి ట్రిప్‌కు 30 నిమిషాల వరకు సమయం ఆదా అవుతుంది.
Read Also: వందే భారత్, శతాబ్ది రైళ్లు ప్రభుత్వం నడపడం లేదా? ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయా?