Bullet Bhaskar: అసలు తెలుగులో స్టాండప్ కామెడీ షోలు రన్ అవుతాయా అని అనుమానాలు ఉన్న సమయంలోనే ‘జబర్దస్త్’ అనే ఒక షో ప్రారంభమయ్యింది. ప్రారంభం అయిన మొదట్లోనే సూపర్ సక్సెస్ సాధించింది. వారానికి ఒకసారి వచ్చే ఈ షో కోసం చాలామంది బుల్లితెర ప్రేక్షకులు తెగ ఎదురుచూసేవారు. ఈ షో వల్ల ఎంతోమంది కామెడియన్ల, యాంకర్లు, ఆఖరికి జడ్జిలు కూడా లాభం పొందారు. అందులో బుల్లెట్ భాస్కర్ కూడా ఒకడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్ని మార్పులు జరిగినా జబర్దస్త్‌ను వదలని కామెడియన్స్‌లో భాస్కర్ కూడా ఒకడు. కొన్నిరోజుల క్రితం తను పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ గురించి, దానివల్ల తను ఎదుర్కున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు భాస్కర్.
జోకులు వేయలేను
బుల్లెట్ భాస్కర్ ఎక్కువగా వేరేవాళ్లపై కాకుండా తనపై తానే జోకులు వేసుకుంటూ ఉంటాడు. ఎందుకలా చేస్తారు అని ప్రశ్నించగా.. ‘‘బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ ఎదురుగా కూర్చున్నా కూడా తనను మిమిక్రీ చేస్తారు. కానీ తెలుగులో అలా కాదు. మామూలుగా ఒక హీరో సినిమాకు స్ఫూఫ్ చేసినా కూడా మా హీరోను ఇమిటేట్ చేస్తే పగులుతుంది అంటూ కామెంట్స్ చేస్తారు. అలా నేను చాలా భరించాను. మా జబర్దస్త్‌లో ఉన్నవాడిపై కామెంట్స్ చేస్తేనే వాడికి ఉన్న ఫ్యాన్ బేస్ కామెంట్స్ పెట్టారు. ఎవరిపై జోకులు వేయడానికి లేనప్పుడు ఏం చేస్తాం. నా మీద నేనే వేసుకుంటా’’ అంటూ హీరోల అభిమానుల నుండి బెదిరింపులు ఎదుర్కోవడం గురించి బయటపెట్టాడు బుల్లెట్ భాస్కర్.
బట్టలు విప్పడం లాంటిది
ఇతర జబర్దస్త్ కామెడియన్స్ లాగా బుల్లెట్ భాస్కర్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు. అలా ఎందుకు అనే ప్రశ్నకు తను సమాధానమిచ్చాడు. ‘‘సోషల్ మీడియాలోకి వెళ్లడం, బట్టలు విప్పి రోడ్డుపై నడవడం రెండూ ఒకటే. అలా బయటికి రావడం ఎందుకు, ఒక మాట అనిపించుకోవడం ఎందుకు. సోషల్ మీడియాలో ఉంటే కామెంట్స్ పెట్టేవాళ్లు చాలామంది ఉంటారు. నేను ఏదైనా భరిస్తాను కానీ ఒకరితో చెప్పించుకోవడం, ఒకరితో అనిపించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. యూట్యూబ్‌లో ఛానెల్ పెట్టుకోమని కూడా చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ నేను వాటి జోలికే పోను’’ అని తేల్చిచెప్పాడు బుల్లెట్ భాస్కర్ (Bullet Bhaskar).
Also Read: కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ క్లారిటీ.. అమ్మ మాటే ఫైనల్..
నిజంగానే వెనకబడింది
జబర్దస్త్ (Jabardasth) ప్రారంభమయిన కొత్తలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. దానిపై కూడా బుల్లిట్ భాస్కర్ స్పందించాడు. ‘‘జబర్దస్త్ క్రేజ్ తగ్గిపోయింది అన్న విషయం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. దానికి ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ దానికి కొందరు ప్రేక్షకులు దూరమయ్యారు. అది ప్రారంభమయ్యి దాదాపు 12 ఏళ్లు అవుతోంది. 12 ఏళ్లు వరుసగా ఒక షో సక్సెస్ అవ్వడం చాలా గ్రేట్. ఇదొక రికార్డ్. డౌన్‌ఫాల్ అనేది ఎవరికీ అయినా ఉంటుంది’’ అని ఓపెన్‌గా చెప్పేశాడు బుల్లెట్ భాస్కర్. ఇక సినిమాల్లో అవకాశాల గురించి అడగగా.. తనకు అవకాశాలు ఎవ్వరూ ఇవ్వలేదని, ఒకసారి సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే 50 రోజులు డేట్స్ ఇచ్చానని, అయినా అందులో తనకు ఒక్క డైలాగ్ మాత్రమే ఉందని వాపోయాడు.