Raksha Bandhan 2025: అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని పెంచే అద్భుతమైన పండుగ రాఖీ. పండుగ రోజు తన సోదరుడి చేతికి రాఖీ కట్టి.. అన్ని వేళల్లో తనకు అండగా నిలవాలని కోరుతారు సోదరీమణులు. సోదరుడు వారి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. సోదర, సోదరీ భావానికి ప్రత్యేకమైన ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు అదిరిపోయే సర్వీసును అందుబాటులోకి తెచ్చాయి. తోబుట్టువుల బంధాలను బలోపేతం చేయడానికి ixigo ట్రైన్స్, ConfirmTkt జూప్ తో కలిసి ‘రాఖీ డెలివరీ ఆన్ ట్రైన్స్’ సర్వీసును ప్రారంభించింది. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 10 వరకు, ప్రయాణీకులు తమ రైలు సీటు, బెర్త్ దగ్గరే నేరుగా రాఖీలు, చాక్లెట్లు, ఇతర స్వీట్లు పొందే అవకాశం కల్పిస్తోంది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేయడం ద్వారా వీటిని రైలు ప్రయాణంలో డెలివరీ తీసుకోవచ్చు.
రాఖీలు ఎలా ఆర్డర్ చేయాలంటే?
ప్రయాణీకులు ConfirmTkt, ixigo ట్రైన్స్, Zoop యాప్‌ల ద్వారా కేవలం ఒక ట్యాప్ తో రాఖీ హాంపర్లను ఈజీగా ఆర్డర్ చేయవచ్చు. హోమ్ పేజీలోని ‘ట్రిప్ వివరాలు’ విభాగానికి నావిగేట్ చేసి, PNR నెంబర్ ఎంటర్ చేయాలి. ప్రయాణికులు ఏ స్టేషన్లలో రాఖీ డెలివరీ అందుబాటులో ఉందో చూసుకోవాలి. మార్గం మధ్యలో మీకు అనుకూలంగా ఉన్న స్టేషన్ లోని రాఖీ స్టోర్ ను ఎంచుకోవచ్చు. నచ్చిన కాంబోను ఎంచుకోవచ్చు. దానిని నేరుగా రైలు సీటుకు డెలివరీ చేస్తారు. వాటిని మీరు తీసుకుని మీ తోబుట్టువులకు అందించవచ్చు. ఒకవేళ వాళ్లే ప్రయాణం చేస్తుంటే, నేరుగా వారికే రాఖీ, స్వీట్లు అందించవచ్చు. రాఖీ పండుగను మరింత అద్భుంతంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు.
ఏ స్టేషన్లలో రాఖీ డెలివరీ స్టోర్లు అందుబాటులో ఉన్నాయంటే?
న్యూఢిల్లీ (NDLS), వారణాసి (BSB), నాగ్‌పూర్ (NGP), భోపాల్ (BPL), సూరత్ (ST), వరంగల్ (WL), కోటా (KOTA), కాన్పూర్ (CNB) సహా దేశంలోని అనేక ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆర్డర్ చేయడానికి రాఖీ హాంపర్లు అందుబాటులో ఉంటాయి. ఈ హాంపర్లు వివిధ రకాల డిజైన్‌లు క్యూరేటెడ్ కాంబోలలో వస్తాయి. ఇవి కేవలం రూ.199 నుంచి ప్రారంభమవుతాయి. దీని వలన ప్రయాణీకులు అభిరుచి, బడ్జెట్‌కు సరిపోయే రాఖీలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ixigo ఏం చెప్పిందంటే?
రాఖీ హాంపర్లపై ఇక్సిగో ట్రైన్స్ అండ్ కన్ఫర్మ్ టికెటి సిఓఓ శ్రీపాద వైద్య కీలక విషయాలు వెల్లడించారు. “ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయులు రక్షా బంధన్ కోసం తమ సోదరులను కలిసేందుకు రైలులో ప్రయాణిస్తారు. కానీ, చివరి నిమిషంలో రద్దీలో చిక్కుకున్న వారికి, రాఖీలు కొనడం ఒత్తిడితో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది. కానీ, ఇకపై అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని ట్యాప్ లతో, ప్రయాణికులు తమ రైలు సీటుకు దగ్గరికే రాఖీ హ్యాంపర్లు డెలివరీ చేయించుకునే అవకాశం ఉంది. జర్నీలో ఉన్నప్పుడు కూడా రాఖీలను మరింత సౌకర్యవంతంగా పొందవచ్చు” అన్నారు. “మేము ఇప్పటికే దేశం అంతటా 200కి పైగా స్టేషన్లలో రైళ్లకు ఫుడ్ డెలివరీ అందిస్తున్నాం. ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లలో టాప్ లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు మేము ఈ చొరవతో రైలు సీట్ల దగ్గరికి నేరుగా రాఖీలను డెలివరీ చేస్తున్నాం” అని జూప్ సిఇఒ, సహ వ్యవస్థాపకుడు పునీత్ శర్మ వెల్లడించారు.
Read Also: రిజర్వేషన్ లేకున్నా స్లీపర్ జర్నీ చెయ్యొచ్చు.. ఎలాగంటే?