Railway Ring Exchange System: ప్రపంచ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ అత్యాధునిక పద్దతులను పాటిస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వేగవంతమైన ప్రజా రవాణాను అందిస్తోంది. అదే సమయంలో ఎలాంటి ప్రమాదాలకు చోటు లేకుండా లేటెస్ట్ టెక్నాలజీని వాడుతోంది. భారతీయ రైల్వే కవచ్ లాంటి వ్యవస్థలను ఉపయోగిస్తోంది. ఈ టెక్నాలజీ రైల్వే ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తోంది. అయితే, టెక్నాలజీ అందుబాటులో లేని రోజులలో అధికారులు రైల్వే ప్రమాదాలను నివారించేందుకు పలు రకాల పద్దతులను పాటించేవారు. అందులో ఒకటి రింగ్ మార్పిడి పద్దతి లేదంటే టోకెన్ మార్పిడి పద్దతి.
ఇంతకీ రింగ్ మార్పిడి పద్దతి అంటే ఏంటి?
పాత తరం రైల్వే భద్రతా చర్యల్లో రింగ్ మార్పిడి అనేది అత్యంత కీలకమైనది. అప్పట్లో రైళ్లలో ఆధునిక కంప్యూటర్లు, వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఉండేవి కావు. రైల్వే సిబ్బంది రైళ్లను సురక్షితంగా ఉంచడానికి తెలివైన, సరళమైన పద్ధతులను ఉపయోగించారు. ఈ పద్ధతుల్లో ఒకటి టోకెన్ మార్పిడి లేదంటే రింగ్ మార్పిడి పద్దతి. రైలు డ్రైవర్(లోకో పైలెట్), స్టేషన్ మాస్టర్ ఈ రింగులను మార్పిడి చేసుకునేవాళ్లు.
రింగ్ మార్పిడితో లాభం ఏంటి?
సింగిల్ లైన్ ట్రాక్ లలో, ఒకేసారి రెండు స్టేషన్ల మధ్య ఒక రైలు మాత్రమే ప్రయాణించగలదు. ఒకే విభాగంలోకి మరే ఇతర రైలు ఎంట్రీ ఇవ్వలేదని నిర్ధారించేందుకు, రైల్వే సిబ్బంది లోకో పైలెట్ కు ప్రత్యేక రింగ్ లేదంటే టోకెన్ ఇచ్చేవారు. ఈ టోకెన్ అనేది రైలు ముందుకు కదిలేందుకు పర్మీషన్ నోట్ ఉన్న మెటల్ రింగ్. ఇంకా చెప్పాలంటే రైల్వే లైన్ లోని నెక్ట్స్ సెక్షన్ లోకి వెళ్లడానికి పాస్ లేదంటే పర్మిషన్ స్లిప్ లాంటిది. ప్రతి విభాగానికి ఒక టోకెన్ మాత్రమే ఉంది. సో, ఆ ప్రాంతంలో ఒక రైలు మాత్రమే ఉందని నిర్దారణ జరుగుతుంది. రైలు ఆ విభాగం నుంచి వెళ్ళిన తర్వాత, టోకెన్ మరొక స్టేషన్‌లో ఉన్న సిబ్బందికి తిరిగి ఇవ్వాలి. ఈ రింగ్ మార్పిడి అనేది ప్రమాదాలను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడేది.
రింగ్ మార్పిడి ఎలా జరుగుతుంది?
రింగ్ మార్పిడి కోసం రైలు అనేది ఆగదు. రైలు కదులుతున్నప్పుడే రింగ్ మార్పిడి జరుగుతుంది. ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉంటుంది. లోకో పైలెట్ ఇంజిన్ కిటికీ లో నుంచి బయటకు చేయి పెడతాడు. స్టేషన్ మాస్టర్ రింగ్ ను పట్టుకుని ప్లాట్ ఫారమ్ మీద నిలబడుతాడు. రైలు నెమ్మదిగా దగ్గరికి రాగానే ఒకరికొకరు రింగ్ లు మార్చుకుంటారు. ఆ సెక్షన్ నుంచి బయటకు వెళ్లినప్పుడు కూడా సేమ్ ఇలాగే రింగ్ లు మార్చుకుంటారు.
రింగ్ మార్పిడి పద్దతి ఎక్కడ ఉపయోగించారు?
రింగ్ మార్పిడి పద్దతి అనేది చాలా దేశాల్లో ఉపయోగించారు. భారత్, యూకే, ఆస్ట్రేలియా సహా సింగిల్ లైన్ రైల్వే ఉన్న పలు దేశాల్లో ఈ పద్దతి పాటించేవారు. ఇండియాలో దశాబ్దాల పాటు ఈ విధానాన్ని ఉపయోగించారు. ఇప్పుడు చాలా రైల్వేలు ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, రేడియో సిగ్నల్స్, సెంట్రల్ కంట్రోల్ రూమ్‌లను ఉపయోగిస్తున్నాయి. ఈ వ్యవస్థలు మరింత సురక్షితంగా ఉంటాయి.
Read Also: ఇండియాలో రైల్వేకు పునాది పడింది ఎప్పుడు? దానికి కారణం ఎవరు?