కదులుతున్న రైలును టార్గెట్ చేసి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి సమయంలో ఎక్స్ ప్రెస్ రైలు ఆపి ప్రయాణీకులను భయభ్రాంతులకు గురి చేశారు. ఆయుధాలను చూపించి ప్రయాణీకుల దగ్గరున్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన ఏపీలో సంచలనం కలిగించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రైల్వే సిగ్నల్ ను ట్యాంపరింగ్ చేసి..
చిత్తూరు జిల్లా సిద్దంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో అర్థరాత్రి దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు. ఒక సాయుధ ముఠా రైల్వే సిగ్నల్ వ్యవస్థను తారుమారు చేసి చామరాజ్ నగర్-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలును ఆపేశారు. వెంటనే రైల్లోకి చొరబడి పలు కోచ్ లలో ప్రయాణీలను దోచుకున్నారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి కాట్పాడి నుంచి బయలుదేరిన రైలు, సిద్దంపల్లి స్టేషన్ కు దాదాపు 350 మీటర్ల ముందు అకస్మాత్తుగా ఆగిపోయింది. రూట్ క్లియర్ చేసినప్పటికీ, సిగ్నల్ ఆగిపోయినట్లు చూపించింది. దర్యాప్తులో రైల్వే అధికారులు వైర్లు కత్తిరించి ఉండటాన్ని గమనించారు. రెడ్ సిగ్నల్ పడేలా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా మార్చారని అధికారులు గుర్తించారు.
స్లీపర్ కోచ్ లలో ఆభరణాల దోపిడీ
రైల్వే సిగ్నల్ ను ట్యాంపర్ చేసి రైలు ఆగేలా చేసిన దుండగులు S-7, S-10 స్లీపర్ కోచ్ లలోకి అడుగు పెట్టారు. ఫ్లాష్ లైట్‌లను ఉపయోగించి ఆభరణాలు ధరించిన మహిళా ప్రయాణికులను గుర్తించారు. నిద్రిస్తున్న నలుగురు మహిళల నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఒక మహిళ నుంచి 40 గ్రాములు, మరో మహిళ నుంచి 15.5 గ్రాములు, ఇంకో ఇద్దరు మహిళల నుంచి 5 గ్రాములు, 4 గ్రాముల చొప్పున దోచుకెళ్లారు.
ఆన్ బోర్డ్ బీట్ అధికారులు స్పందించే లోగా..
ఆన్ బోర్డ్ బీట్ అధికారులు త్వరగా స్పందించి, అలారాలు మోగించి పరిగెత్తుకొచ్చే లోగా, దొంగలు రైలు దిగి చీకటిలో పారిపోయారు. స్టేషన్ లో లోకో పైలట్ విచారణలో గ్రీన్ సిగ్నల్ జారీ చేయబడిందని నిర్ధారించారు. దొంగలు కావాలనే రెడ్ సిగ్నల్ వచ్చేలా చేసినట్లు గుర్తించారు.
మహారాష్ట్ర ముఠా పనేనా?
ఈ దోపిడీ ఘటన మహారాష్ట్ర నుంచి వచ్చిన ముఠా ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలో ఇలాంటి మోడస్ ఆపరేషన్ తో కూడిన దోపిడీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దోపిడీ దొంగలకు రైల్వే సిగ్నలింగ్ గురించి నిర్దిష్ట సాంకేతిక పరిజ్ఞానం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆన్ బోర్డు సిబ్బంది నుంచి వార్నింగ్ వచ్చిన 20 నిమిషాల్లోనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసుల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే సంఘటన జరిగిన సమయంలో సమీపంలోని క్వారీలో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారిని త్వరలోనే పట్టుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు.
Read Also: తమ ఉద్యోగుల కష్టాన్ని చూసి.. ఏకంగా రైలునే కొనేసిన బిజినెస్ మ్యాన్!