కొంత మంది యజమానులు తమ దగ్గర పని చేసే స్టాఫ్ ను సొంత మనుషుల్లా చూసుకుంటారు. గుజరాత్, కేరళ లాంటి రాష్ట్రాల్లో కొంత మంది వజ్రాలు, బంగారం వ్యాపారులు ప్రతి ఏటా తమ స్టాఫ్ కు విలువైన బహుమానాలు అందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. టూ వీలర్ నుంచి బెంజ్ కార్ల వరకు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఆయా ఉద్యోగుల స్థాయికి అనుగుణంగా బహుమానాలను అందిస్తుంటారు. రీసెంట్ గా చైనాలో ఓ మైనింగ్ కంపెనీ అధినేత ఏకంగా ఓ పెద్ద టేబుల్ మీద డబ్బును గుట్టగా పోసి, ఓ టైమ్ ఫిక్స్ చేసి, అంతలోగా నచ్చినంత తీసుకోవాలని ఆఫర్ ఇచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన వైరల్ అయ్యింది.
స్టాఫ్ కోసం రైలు కొన్న వ్యాపారవేత్త
తాజాగా ఉజ్బెకిస్తాన్ లో ఓ వ్యాపారవేత్త తన మంచి మనసును చాటుకున్నాడు. ఓ గోల్డ్ మైనింగ్ కంపెనీ యజమాని తన స్టాఫ్ ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నాడు. రకాపోకల్లో ఇబ్బందుల కారణంగా అలసిపోయి సరిగా పని చేయడం లేదని గుర్తించాడు. ఇకపై వారు ఎలాంటి ఇబ్బంది పడకూడదనుకున్నాడు. వెంటనే, ఓ రైలును కొనుగోలు చేశాడు. తమ కంపెనీ స్టాఫ్ అందులో హాయిగా ప్రయాణాలు కొనసాగించాలని చెప్పాడు. జరాఫ్ షోన్- మురుంటౌ బంగారు గని మధ్య ఈ రైలు ఉద్యోగులను రవాణా చేస్తోంది. నవోయ్ మైనింగ్ & మెటలర్జికల్ కో అనే కంపెనీ అధినేత ఈ రైలును కొన్నాడు.
15 టైప్ రైలు కొనుగోలు
తమ ఉద్యోగుల కోసం 15 టైప్ 61-933 కోచ్ లను మైనింగ్ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ కోచ్ లను తోష్కెంట్ కార్ రిపేర్ ప్లాంట్ తయారు చేసింది. 1 520 mm గేజ్ ప్రాంతంలో కనిపించే సాంప్రదాయ ఎలక్ట్రిక్ బహుళ యూనిట్ కార్ల డిజైన్ ను ఇవి పోలి ఉంటాయి. లోకో మోటివ్ ద్వారా ఈ కోచ్ లు లాగబడుతాయి. ప్రతి కారులో 110 సీట్లు, 160 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. ప్రాంతంలోని తీవ్ర వాతావరణాన్ని తట్టుకునేలా ఈ రైల్వే కోచ్ లను రూపొందించారు. వాతావరణ నియంత్రణ, తాపన వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు తయారీ సంస్థ వెల్లడించింది.
Read Also: రైల్వేకు కొత్త హంగులు.. 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా!
యజమానిపై ఉద్యోగుల ప్రశంసలు
తమ ప్రయాణ ఇబ్బందులను గమనించి రైలు కొనుగోలు చేయడం పట్ల కంపెనీ స్టాఫ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ బాగోగులను ఇంతలా పట్టించుకోవడం నిజంగా సంతోషకరం అంటున్నారు. ఈ రైల్లో ప్రయాణం చేయడం ద్వారా సమయానికి ఆఫీస్ కు చేరడంతో పాటు పనిలో క్వాలిటీ పెరిగినట్లు తెలిపారు. ఇలాంటి యజమాని దగ్గర పని చేయడం నిజంగా సంతోషంగా ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందరూ ఆ గోల్డ్ మైనర్ ను ప్రశంసిస్తున్నారు. స్టాఫ్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందనీయం అంటున్నారు.
Read Also: 3 వందేభారత్ రైళ్లు డైవర్ట్.. ఏపీ ప్రయాణీకులకు అలర్ట్!