Robbery in Train: సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. కావలి సమీపంలో మూడు బోగీల్లో చోరీకి పాల్పడ్డారు. 40గ్రాముల బంగారం ఆభరణాలు, 2వేల రూపాయల నగదు, సెల్‌ఫోన్ చోరీ చేశారు. S-2, S-4, S-5 బోగీల్లో దొంగలు పడ్డారని రైల్వే పోలీసులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న.. పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు రెచ్చిపోయారు. కావలి, శ్రీ వెంకటేశ్వర పాలెం రైల్వే స్టేషన్ల సమీపంలో రాగానే.. ఈ చోరీ సంఘటన జరిగింది. దుండగులు మూడు బోగీలలో ప్రయాణికుల విలువైన వస్తువులపై కన్నేశారు. ముగ్గురు మహిళల నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 2,000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను చోరీ చేశారు. ఈ ఘటన రైలు ప్రయాణ సమయంలో జరగడంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా.. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, సమీప స్టేషన్లలో తనిఖీలు చేపడుతున్నారు. అయితే దొంగలు గుర్తు తెలియని వ్యక్తులుగా ఉండటం.. దర్యాప్తు సవాలుగా మార్చింది.
ప్రయాణికుల భద్రతపై రైల్వే శాఖపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైళ్లలో చోరీలు పెరగడంతో, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని.. ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే అధికారులు రాత్రి సమయంలో రైళ్లలో పెట్రోలింగ్‌ను పెంచాలని, అదనపు సిబ్బందిని నియమించాలని సూచిస్తున్నారు.
Also Read: ఈ రూట్‌లో వందే భారత్.. ఫస్ట్ టైమ్ వస్తోంది.. ఇక అక్కడ నో వెయిటింగ్!
ప్రయాణికులు తమ విలువైన వస్తువులను.. సురక్షితంగా దాచుకోవాలని, అపరిచితులతో సన్నిహితంగా ఉండకుండా జాగ్రత్త వహించాలని.. రైల్వే పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు.. రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని.. ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ఘటన రైళ్లలో భద్రతా వ్యవస్థలపై మరోసారి చర్చకు దారితీసింది.