Indian and Chinese Trains Compared: ఇండియన్ రైళ్లు, చైనా రైళ్లలో ట్రావెల్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంటుంది? రెండు దేశాల్లో రైలు ప్రయాణం చేసిన ఓ యూట్యూబర్ తాజాగా రెండింటినీ కంపార్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు. రైళ్లలో క్లీన్ నెస్, టాయిలెట్స్ మెయింటెనెన్స్, ప్రయాణికుల సేఫ్టీ, సౌకర్యాలను పోలుస్తూ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా మన రైళ్లలో క్లీన్ నెస్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
చైనాలో పీహెచ్‌డీ చేస్తున్న ఆలం అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. భారత్ లో, చైనాలో ప్రయాణించిన రైళ్లలో కనిపించిన పరిస్థితులను ఇందులో చూపించాడు. తొలుత రెండు దేశాల రైళ్లలోని వాష్‌రూమ్‌లను పోల్చాడు. భారతీయ రైలులో టాయిలెట్ అపరిశుభ్రంగా కనిపించగా, చైనా రైలులోని వాష్‌రూమ్ మాత్రం శుభ్రంగా, మంచి లైటింగ్ తో కనిపించింది. చైనా రైలులో టాయిలెట్ ఖాళీగా ఉందా? లేదా? అని చెప్పే స్పెషల్ లైట్ ఉంది. దీంతో ప్రయాణికులు తమ సీట్లలో నుంచే టాయిలెట్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇండియన్ రైలులో మాత్రం టాయిలెట్ దగ్గరకు వెళ్లి చూడాల్సి వస్తోందని చెప్పాడు.
కోచ్‌ల క్లీన్ నెస్ లోనూ రెండు దేశాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. చైనా రైలులో ప్రయాణికులు దిగిపోయిన తర్వాత కూడా కోచ్‌లు నీట్ గా కనిపించాయి. అదే ఇండియన్ రైలులో సీట్ల కింద ఫుడ్ ప్యాకెట్లు, ఇతర చెత్తాచెదారం కనిపించాయి. రైళ్లను శుభ్రంగా ఉంచడంలో ప్రయాణికుల బాధ్యత ఎంతో ముఖ్యం అనే విషయాన్ని వెల్లడిస్తోంది.
రైళ్ల డోర్లు, విండోడలను కూడా ఆలం కంపార్ చేశాడు. భారతీయ రైలులో ప్రయాణికులు కిటికీలు, డోర్లు ఓపెన్ చేసి చేతులు బయట పెట్టే అవకాశం ఉండగా, చైనా రైలులో కిటికీలు మూసి ఉన్నాయి. రైలు స్టేషన్‌కు చేరుకున్న తర్వాతే సిబ్బంది డోర్లు ఓపెన్ చేస్తున్నట్లు వీడియోలో వివరించాడు. చైనాలోని రైల్వే స్టేషన్ పరిశుభ్రత కూడా చాలా బాగుందని చెప్పుకొచ్చాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు భారతీయ రైళ్లలో పరిశుభ్రత మెరుగుపడాలని, ప్రయాణికులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదని చెప్తుండగా, మరికొందరు మనుషులకు కామన్ సెన్స్ లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మరికొందరు ఈ కంపారిజన్ ను తప్పుబట్టారు. చైనా రైళ్లతో భారత్ లోని సాధారణ రైళ్లను పోల్చడం సరికాదంటున్నారు. మన దేశంలో వందే భారత్ లాంటి అత్యాధునిక రైళ్లు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. రైళ్ల సౌకర్యాలతో పాటు టికెట్ ధరలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మరికొందరు అభిప్రాయపడ్డారు.
Read Also: ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్ ఫిక్స్.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?