Bharat Gaurav Tourist Trains: తెలుగు రాష్ట్రాల నుంచి పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే వేసవిలో ప్రత్యేక భారత్ గౌరవ్ పర్యాటక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అయోధ్య, కాశీ, హరిద్వార్, మాతా వైష్ణో దేవి, రామేశ్వరం, చిదంబరం లాంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను ఈ యాత్రా రైళ్లు కవర్ చేయనున్నాయి. భక్తులు IRCTC వెబ్ సైట్ లేదంటే హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఈ ప్రత్యేక యాత్రల్లో ముఖ్యంగా అయోధ్య–కాశీ పర్యటనకు పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వైద్యనాథ్ ధామ్ దర్శనంతో కూడిన ఈ యాత్ర ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు జరుగుతుంది. పూరి, కోణార్క్, వైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రదేశాలను ఇందులో సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ యాత్రకు స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.16,700 కాగా, 3AC రూ.26,100, 2AC రూ.34,100గా నిర్ణయించారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, తుని, విజయనగరం వంటి పలు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.
ఇంకో ముఖ్యమైన యాత్ర హరిద్వార్–మాతా వైష్ణో దేవి–రిషికేశ్ మార్గంలో ఉంటుంది. ఈ యాత్ర మే 12 నుంచి 21 వరకు జరుగుతుంది. మధుర, బృందావనం, వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్ వంటి పుణ్యక్షేత్రాలను ఈ యాత్రలో సందర్శించవచ్చు. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.16,500 కాగా, 3AC రూ.25,700గా ఉంది. ఈ రైలు కూడా సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తెలంగాణ, మహారాష్ట్రలోని పలు స్టేషన్ల మీదుగా ఉత్తర భారతానికి చేరుతుంది.
దక్షిణ భారత పుణ్యక్షేత్రాలను కవర్ చేసే మరో ప్రత్యేక యాత్ర అరుణాచలం–చిదంబరం దివ్య యాత్ర. ఇది మే 24 నుంచి 31 వరకు నడుస్తుంది. తిరువన్నామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావూరు, చిదంబరం లాంటి ప్రదేశాలు దర్శించుకోవచ్చు. ఈ యాత్రకు స్లీపర్ క్లాస్ టికెట్ రూ.14,500 కాగా, 3AC సుమారు రూ.21,700, 2AC రూ.27,900గా ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట వంటి మార్గాల్లో ప్రయాణిస్తుంది.
అటు యమునా పుష్కరాల సందర్భంలో మరో అయోధ్య–కాశీ ప్రత్యేక యాత్రను కూడా ప్రకటించింది. ఇది జూన్ 3 నుంచి 12 వరకు జరుగుతుంది. పూరి, కోణార్క్, వైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రదేశాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది. టికెట్ ధరలు కూడా ఇదే విధంగా ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు భక్తులకు ఒకే యాత్రలో అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించే మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ట్రావెల్, వసతి, భోజన సౌకర్యాలను కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తారు. టికెట్ బుకింగ్ చేయాలనుకునే వారు IRCTC అధికారిక వెబ్ సైట్ ను చూడాలి. లేదంటే 9701360701, 9281030727, 9281030759 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Read Also: వందేభారత్ సూపర్ హిట్.. ఏడాదిలో ఎన్నికోట్ల మంది ప్రయాణించారంటే?