Secunderabad Railway Station Redevelopment: దేశంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సుమారు 150 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ రైల్వే స్టేషన్ సరికొత్తగా పునర్నిర్మాణం అవుతోంది. విమానాశ్రయానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ రైల్వే స్టేషన్ ను నిర్మిస్తున్నారు. పునర్నిర్మాణ పనులలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పనులు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు 115 రోజుల పాటు సగానికి పైగా ప్లాట్ ఫారమ్స్ మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి దశలవారీగా 120 జతల రైళ్లను దారి మళ్లించనున్నారు. వీటిని వేరే స్టేషన్ల నుంచి రాకపోకలు కొసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిల్లో ఎక్కువ రైళ్లు నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి నడవనున్నాయి. కొన్ని రైళ్లు నాంపల్లి నుంచి, మరికొన్ని రైళ్లు కాచిగూడ నుంచి నడవనున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.715 కోట్లతో కొనసాగుతున్న పుర్నిర్మాణ పనులు
రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా దీనిని తీర్చి దిద్దుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ రైల్వే స్టేషన్ ను పునర్నిర్మాణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 715 కోట్లు కేటాయించింది. ఇప్పటికే పాత స్టేషన్ ను పూర్తిగా కూల్చేసింది. దాని స్థానంలో అత్యాధునిక రైల్వే స్టేషన్ ను నిర్మిస్తోంది.
కొత్త స్టేషన్ ప్రత్యేకతలు ఇవే!
కొత్త రైల్వే స్టేషన్ ను పెరిగిన ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా మల్టీ లెవెల్ టెర్మినల్ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు. అద్భుతమైన వెయిటింగ్ లాంజ్‌లు, ఫుడ్ కోర్టులు, ఆధునిక టికెటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రద్దీని మెయింటెయిన్ చేయడానికి సరికొత్త ఎంట్రీ, ఎగ్జిట్ టెర్మినల్స్ ను రూపొందిస్తున్నారు. మెరుగైన రూఫింగ్, సీటింగ్, లైటింగ్ తో ప్లాట్ ఫామ్ లను అప్ గ్రేడ్ చేస్తున్నారు. ప్రయాణీకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రీమియం లాంజ్ లు, డిజిటల్ ఇన్ఫర్మేషన్ బోర్డులతో విమానాశ్రయం లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. రైల్వే స్టేషన్ అవసరాలకు సరిపడ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు సోలార్ ప్యానల్స్, లైటింగ్ ను అమర్చనున్నారు. స్టేషన్ ను మరింత పర్యావరణ అనుకూలంగా మార్చడానికి వ్యర్థాల నిర్వహణ, వాటర్ రీసైక్లింగ్ వ్యవస్థలను మెరుగుపరుస్తున్నారు. స్టేషన్ కు ఈజీగా రాకపోకలు కొనసాగించేందుకు కొత్త రోడ్లు, మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టులను ఏకీకృతం చేస్తున్నారు. పెరుగుతున్న వాహనాల రద్దీని మేనేజ్ చేసేందుకు పార్కింగ్ స్థలాలు, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
Read Also: జపాన్ 6 గంటల్లో 3D-ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ను ఎలా నిర్మించింది!
మొత్తంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే హబ్ గా మారబోతోంది. ఈ స్టేషన్ పునర్నిర్మాణంతో దేశంలోనే అత్యంత అధునాతన రైల్వే హబ్ లలో ఒకటిగా నిలువబోతోంది. ప్రయాణీకులకు మెరుగైన సౌలభ్యం, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించబోతోంది.
Read Also: చర్లపల్లి సమీప మెట్రో స్టేషన్ ఏమిటీ? అక్కడ రైలు దిగితే సిటీకి చేరడం ఎలా?