Flight Passenger Hangama: విమాన ప్రయాణం చేసే సమయంలో తరచుగా కొంత మంది ప్రయాణీకులు తిక్క వేషాలు వేస్తుంటారు. ఇతర ప్రయాణీకుల ప్రాణాల మీదికి తీసుకొచ్చేలా వ్యవహరిస్తారు. తాజాగా ఇండిగో విమానంలో ఇలాంటి ఘటనే జరిగింది. శంషాబాద్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ప్రయాణీకుడు విమానంలో హల్ చల్ చేశాడు. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది, తోటి ప్రయాణీకులు అడ్డుకున్నారు. అయినప్పటికీ తను తగ్గకపోవడంతో విమానానాన్ని వెంటనే వెనక్కి తీసుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు.
ఎయిర్ పోర్టు పోలీసుల అదుపులో ప్రయాణీకుడు
విమానం ల్యాండింగ్ కాగానే సిబ్బంది ఎయిర్ పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు ప్యాసింజర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం తాగి ఉండటం వల్లే ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో విమానంలో సుమారు 150 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అనే విషయాలతో పాటు ప్రయాణీకుడి వివరాలు బయటకు రాలేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు ఎయిర్ పోర్టు పోలీసులు వెల్లడించారు.
ఉదయం ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి
ఇవాళ ఉదయమే ఇండిగో విమానానికి ప్రమాదం జరిగింది. కేరళ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానం రన్ వే నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ గద్ద వచ్చి విమానాన్ని ఢీకొట్టింది. విమానానికి తగిలి నేరుగా వెళ్లి ఫ్లైట్ కు ఎడమ వైపు ఉన్న ఇంజిన్ లో చిక్కుకుంది. వెంటనే పైలెట్ విమానాన్ని నిలిపివేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 179 మంది ప్రయాణీకులు ఉన్నారు.
Read Also: రూ.12,478 కోట్లు విలువచేసే కంపెనీని రూ.74కే అమ్మేసిన ఈ బిజినెస్ మ్యాన్ గురించి మీకు తెలుసా?
విమానాన్ని రద్దు ఇండిగో సంస్థ
విమానాన్ని పక్షి ఢీకొట్టి నేపథ్యంలో ప్రయాణీకులందరినీ.. విమానం నుంచి కిందికి దింపారు. ఆ తర్వాత ఇంజిన్ లో చిక్కుకు పోయిన గద్దను బయటకు తీశారు. అనంతరం విమానం ఇంజిన్ పని తీరును పరిశీలించారు. అటు విమానం క్యాన్సిల్ కావడంతో ప్రయాణీకులు గంటల తరబడి విమానాశ్రయంలోనే నిరీక్షించాల్సి వచ్చింది. వారంతా ఉదయం వెళ్లాల్సి ఉండగా, సాయంత్రం 6.30 గంటలకు ఇండిగో సంస్థ మరో విమానాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 179 మంది ప్రయాణీకులను ప్రత్యేక విమానం ద్వారా వారి గమ్య స్థానానికి చేర్చారు.
ఒకే రోజు ఒకే విమానయాన సంస్థకు చెందిన రెండు విమానాల్లో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ప్యాసింజర్లు ఆశ్చర్యపోతున్నారు. ఒక్కోసారి టైమ్ అలాగే ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: కశ్మీర్‌ను ఇక రైల్లో చుట్టేయొచ్చు.. ఏయే ప్రాంతాలను చూడొచ్చు అంటే?