Jammu and Kashmir Rail Connectivity: దేశానికి తలమానికం లాంటి జమ్మూకాశ్మీర్ లో రైల్వే కనెక్టివిటీని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసేలా సరికొత్త రైల్వే లైన్లను నిర్మించబోతోంది. కొత్త రైలు మార్గాల నిర్మాణంతో పాటు రైలు పట్టాల డబ్లింగ్, పునరుద్ధరణ, రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, కొత్త రైళ్లను పరిచయం చేసే దిశగా కీలక చర్యలు తీసుకుంటున్నది. తాజాగా జమ్మూకాశ్మీర్ లో 307 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ఇండియన్ రైల్వే సంస్థ సర్వే మొదలు పెట్టింది.
USBRL ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్ డేట్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తయ్యింది. ఈ ప్రతిష్టాత్మక రైలు ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గుర్తించి నిర్మించింది. గత ఏడాది డిసెంబర్ లో ఈ పనులు కంప్లీట్ అయ్యాయి. USBRL ప్రాజెక్ట్ కింద జమ్మూ కాశ్మీర్ లో 272 కి.మీ. కొత్త రైల్వే లైన్ ను నిర్మించింది.USBRL ప్రాజెక్ట్ జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్, రియాసి, రాంబన్, శ్రీనగర్, అనంతనాగ్, పుల్వామా, బుడ్గామ్, బారాముల్లా జిల్లాలను కవర్ చేస్తుంది. జమ్మూలోని కత్రా నుంచి కాశ్మీర్ లోని శ్రీనగర్ వరకు త్వరలో వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుంది. USBRL ప్రాజెక్ట్ తో ఇతర ప్రాంతాల నుంచి కాశ్మీర్ కు నేరుగా రైల్వే కనెక్టివిటీ ఏర్పడినట్లు అయ్యింది. త్వరలోనే ఈ మార్గంలో రైల్వే సేవలు ప్రారంభం కానున్నాయి.
జమ్మూకాశ్మీర్ లో సరికొత్త రైల్వే లైన్ సర్వే
ఇక జమ్మూకాశ్మీర్ లో రైల్వే లైన్లను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 307 కి.మీ.ల పరిధిలో కొత్త రైలు మార్గం నిర్మించేందుకు సర్వే ప్రారంభించింది. వీలైనంత త్వరగా ఈ రైల్వే లైన్ల సర్వేను పూర్తి చేయనున్నట్లు ఇండియన్ రైల్వే వెల్లడించింది.
ఏ మార్గాల్లో రైల్వే సర్వే జరుగుతుందంటే?
⦿ బారాముల్లా – ఉరి కొత్త లైన్ (46 కి.మీ)
⦿ సోపోర్ – కుప్వారా కొత్త లైన్ (37 కి.మీ)
⦿ అనంతనాగ్ – పహల్గామ్ కొత్త లైన్ (78 కి.మీ)
⦿ అవంతిపూర్ – షోపియన్ కొత్త లైన్ (28 కి.మీ)
⦿ బనిహాల్ – బారాముల్లా డబ్లింగ్ (118 కి.మీ)
రైల్వే సర్వే పూర్తయిన తర్వాత ప్రాధాన్యతా ప్రకారం రైల్వే లైన్ల నిర్మాణం కొనసాగనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ అంతటా రైల్వే సౌకర్యాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ రైల్వే లైన్లు పూర్తయితే, పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఫలితంగా స్థానికులకు ప్రత్యక్ష, పరోక్ష పద్దతుల ద్వారా ఉపాధి కలిగే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతం ఆర్థికంగానే బలపడుతుందన్నారు.
Read Also: ఇండియన్ రైల్వేకు 500వ ఎలక్ట్రిక్ లోకోమోటివ్, సరుకు రవాణాలో ఇక దూకుడే!