IRCTC food fine 2025: మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? టైమ్ కి భోజనం ఆర్డర్ చేశారా? అయితే భోజనం చేతికి అందిన వెంటనే ఒకసారి చెక్ చేసుకోండి. లేకుంటే మీకు ఇలాగే జరగవచ్చు. అయితే ఇలాంటి ఘనకార్యానికి పాల్పడిన నిర్వాహకుడికి మాత్రం ఇండియన్ రైల్వే అధికారులు పట్టపగలు చుక్కలు కనిపించే ఫైన్ విధించారు. ఇంతకు అసలేం జరిగిందంటే?
రైలు ప్రయాణంలో కడుపు నింపే వేడి భోజనం ఎంత శాంతినిస్తుందో, అదే ఆహారం పాచిపోయినదైతే ప్రయాణమంతా బాధగా మారుతుంది. ఇలా జరిగిన ఘటనే ఇటీవల కేరళలోని కడవంతరలో వెలుగు చూసింది. రైళ్లకు, ముఖ్యంగా వందే భారత్ వంటి ముఖ్య రైళ్లకు ఆహారం సరఫరా చేసే వంటశాలలో నుంచి పాచిపోయిన పెద్ద మొత్తంలో భోజనం పట్టుబడటం రైల్వే శాఖను, ప్రయాణికులను ఒక్కసారిగా కలచివేసింది. దీంతో ప్రయాణ భద్రత, ఆహార నాణ్యతపై పెద్ద చర్చ మొదలైంది.
❂ లక్ష రూపాయల జరిమానా!
రైల్వే, IRCTC అధికారుల కమిటీ పరిశీలనలో ఈ వంటశాలలో పాత భోజన సామగ్రి, శుభ్రత లోపాలు, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో సమాధానం ఇస్తూ, కడవంతర బేస్ కిచెన్‌పై లక్ష జరిమానా విధించామనీ, అదే సమయంలో దానిని పూర్తిగా మూసివేశామని తెలిపారు. ఆయన ఈ అంశాన్ని ఎంపీ హిబీ ఈడెన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.
❂ కుడుంబశ్రీ వంటి సంఘాలను రైళ్లకు భోజనం ఇచ్చేందుకు అవకాశం?
రైల్వే శాఖ సముదాయ ఆధారిత భోజన తయారీ సంస్థలకు కూడా అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉంది. ఇందులో భాగంగా కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్‌కి చెందిన కుడుంబశ్రీ సామృద్ది నెట్‌వర్క్‌తో ప్రయోగాత్మకంగా పలు ట్రయల్స్ నిర్వహించామనీ, భవిష్యత్తులో పోటీ దరఖాస్తుల ద్వారా ఎంపిక ప్రక్రియలో భాగంగా వీరికీ అవకాశం కల్పించవచ్చని మంత్రి తెలిపారు. IRCTC మాత్రం ఈ లైసెన్స్‌లను పారదర్శక విధానంతో టెండర్ల ద్వారా చేపడుతుందని, నిబంధనల ప్రకారం సమీక్షలు చేస్తూ అవసరమైనచో కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
❂ ఆహార నాణ్యతపై కఠిన చర్యలు, పర్యవేక్షణపై కృషి
ఆహార నాణ్యత విషయంలో కఠిన వైఖరితో ముందుకొచ్చిన రైల్వే శాఖ, దేశవ్యాప్తంగా రైళ్లలో అందే భోజనం స్థాయిని మెరుగుపర్చేందుకు అనేక కీలక చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో ప్రధానంగా ఎంపిక చేసిన ప్రాథమిక వంటశాలల నుంచే భోజనం సరఫరా చేయాలనే నిబంధనను అమలు చేస్తున్నారు. అంతేగాక, పలు నగరాల్లో ఆధునిక వంటశాలలు ఏర్పాటు చేసే పనులను వేగంగా చేపట్టారు.
వంట ప్రక్రియపై పర్యవేక్షణ కోసం అన్ని వంటశాలల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆహార తయారీలో వాడే పదార్థాల విషయంలోనూ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నూనె, అటా, బియ్యం, పప్పులు, మసాలా పౌడర్లు, పన్నీర్, పాడి ఉత్పత్తులు వంటి అంశాల్లో పేరు గల బ్రాండ్లవే ఉపయోగించాలన్న దిశగా మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. అలాగే, ప్రతి వంటశాలలో ఒక ఫుడ్ సేఫ్టీ సూపర్‌వైజర్ ను నియమించి శుభ్రతను గమనించే బాధ్యత అప్పగించారు. రైళ్లలోనూ IRCTC సూపర్‌వైజర్లు ప్రత్యేకంగా విధుల్లో ఉండేలా చేశారు. ఈ సమిష్టి చర్యలన్నీ ప్రయాణికులకు భద్రతతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలన్న లక్ష్యంతో చేపట్టబడ్డాయి.
❂ QR కోడ్ ద్వారా ఇలా చెక్ చేయండి!
ప్యాకెట్లపై QR కోడ్లను అందుబాటులోకి తేవడం ద్వారా, ఆహారం ఎక్కడ తయారైంది, ఎప్పుడు ప్యాక్ చేయబడింది వంటి వివరాలు చూసే సౌలభ్యం ప్రయాణికులకు లభిస్తుంది. వంటశాలల్లో తరచూ డీప్ క్లీనింగ్, కీటక నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.
❂ FSSAI ప్రమాణాలతో భద్రతా ధ్రువీకరణ
ప్రతి క్యాటరింగ్ యూనిట్‌కి ఆహార భద్రత అధికారి ద్వారా FSSAI సర్టిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు తెలిపారు. రైళ్లలో, వంటశాలల్లో తరచూ నమూనా సేకరణ, తనిఖీలు, థర్డ్ పార్టీ ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల సంతృప్తిని తెలుసుకునేందుకు రెగ్యులర్ సర్వేలు కూడా జరుగుతున్నాయి. అంతేకాక రైల్వే, IRCTC అధికారుల ఆకస్మిక తనిఖీలు కూడా జరుగుతున్నాయి.
❂ ప్రయాణికుల భద్రతే లక్ష్యం
ఈ చర్యలన్నీ ప్రయాణికులకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనం అందించాలన్నదే లక్ష్యంగా తీసుకుంటున్నాయని రైల్వే శాఖ స్పష్టం చేస్తోంది. ఒక చోట జరిగిన పొరపాటు దేశవ్యాప్తంగా ప్రయాణికులపై ప్రభావం చూపకూడదనే దృష్టితో, వ్యవస్థను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మలచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఒక్క సంఘటనతో ముందస్తు చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సమర్థవంతమైన పర్యవేక్షణతో రైళ్లు మళ్లీ ప్రయాణికుల నమ్మకాన్ని అందుకుంటున్నాయి. ఇకపై రైలు ప్రయాణం కేవలం సౌకర్యంగా కాకుండా.. రుచి, భద్రత, విశ్వాసంతో కూడినదిగా ఉండాలని ప్రతి ప్రయాణికుడు కోరుకుంటున్నాడు.. రైల్వే కూడా అదే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి లోక్ సభలో చెప్పుకొచ్చారు.