Beautiful Train Journeys In India: మన దేశంలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల వాతావరణాల పరిస్థితులు ఉంటాయి. దేశ సరిహద్దుల్లో సముద్రాలు, ఎడారులు, మంచుకొండలు కనువిందు చేస్తాయి. విశాలమైన, వైవిధ్యమైన ప్రకృతి అందాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. దేశంలో అత్యంత ఆకర్షణీయమైన రైలు ప్రయాణాలు చాలా ఉన్నాయి. తీర ప్రాంతాలు, దట్టమైన అడవులు, మంచు పర్వతాల గుండా వెళ్తూ ప్రయాణీకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వాటిలో నాలుగు అందమైన రైలు ప్రయాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ మండపం నుంచి రామేశ్వరం
ఈ రైలు చెన్నై నుంచి రామేశ్వరం వరకు కొనసాగుతుంది. ఈ రెండు ప్రాంతాల నడుమ బోట్ మెయిల్ ఎక్స్ ప్రెస్ పూర్తిగా సముద్రం మీదే ప్రయాణం చేస్తుంది. దేశంలోని అత్యంత ప్రత్యేకమైన రైలు ప్రయాణాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు ఐకానిక్ పంబన్ వంతెన మీది నుంచి ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు సముద్రపు అలలతో నీటి తుంపరలు రైళ్లో వెళ్లేవారి పై పడుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుంది.
⦿ భువనేశ్వర్ నుంచి బ్రహ్మపూర్
తూర్పు కనుమలు, ఒడిశాలోని ప్రసిద్ధ చిలికా సరస్సు మధ్య ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వైపు వలస పక్షుల ఉండే దేశంలోనే అతిపెద్ద చిలికా సరస్సు అందాలు, మరోవైపు దట్టమైన మాల్యాద్రి అడవులు కనువిందు చేస్తాయి. ఆకాశంలో ఎగురుతున్న పక్షుల నడుమ ముందుకుసాగే రైలు ప్రయాణం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ప్రయాణం ప్రయాణీకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.
⦿ ముంబై నుంచి గోవా
మాండోవి ఎక్స్ ప్రెస్ ట్రైన్ జర్నీ జీవితాంతం మర్చిపోలేం. ఇది ముంబై నుంచి గోవా వరకు ప్రయాణిస్తుంది. దట్టమైన అడవులు, ఉప్పొంగే జలపాతాలు, కొంకణ్ తీరం వెంబడి అద్భుతమైన నదులను దాటుతూ వెళ్తుంది. పశ్చిమ కనుమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎంతో ఆహ్లాదాన్నికలిగిస్తుంది. చక్కటి బీచ్ లు, పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ప్రయాణీకులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. జలపాతం నుంచి వచ్చే నీటి తుంపరలు ప్రయాణీకులను తాకుతూ ఆహా అనిపిస్తాయి.
Read Also: IRCTC నార్త్ ఈస్ట్ స్పెషల్ టూర్.. 33 శాతం డిస్కౌంట్ తో 5 రాష్ట్రాలు కవర్!
⦿ వాస్కో డా గామా నుంచి లోండా
అత్యంత ఉత్కంఠ భరిత రైలు ప్రయాణాల్లో ఇదొకటి. వాస్కోడిగామా నుంచి లోండా వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఈ సుందరమైన ప్రయాణం పశ్చిమ కనుమల పచ్చదనం గుండా తీసుకెళ్తుంది, దూరం నుంచి గంభీరమైన దూద్ సాగర్ జలపాతాల మంత్రముగ్ధులను చేస్తాయి. రైలు పర్వతా ప్రాంతాల గుండా వెళుతుండగా, ప్రయాణీకులు గోవా అందమైన బీచ్ ను చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. ఈ మార్గంలో గోవాన్ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణం చేయడం మరపురాని అనుభవాన్ని ఇస్తుంది. ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. వీలు చూసుకుని మరీ మీరు ఈ ప్రయాణాలు తప్పకుండా చేయండి.
Read Also: వేసవిలోనూ మంచు కురిసే ప్రాంతం.. రోహ్ తంగ్ పాస్ కు వెళ్లడానికి బెస్ట్ టైం ఇదే!