SwaRail Vs IRCTC Rail Connect Apps: భారతీయ రైల్వేకు సంబంధించిన అన్ని సర్వీసులను ఒకే చోట పొందేలా సూపర్ యాప్ ను తీసుకొచ్చింది రైల్వేశాఖ. ‘స్వరైల్’ పేరుతో దీనిని విడుదల చేసింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(CRIS) డెవలప్ చేసిన ఈ యాప్ ద్వారా రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రైల్వేకు సంబంధించిన ఒక్కో సేవ ఒక్కో యాప్ లో అందుబాటులో ఉంది. ఇకపై అన్ని సేవలు ‘స్వరైల్’ సూపర్ యాప్ ద్వారా లభిస్తాయి. అయితే, ఇప్పటి వరకు ఉన్న IRCTC రైల్ కనెక్ట్ యాప్ కు దీనికి మధ్య తేడా ఏంటంటే?
రెండు యాప్స్ లక్ష్యం ఏంటేంటే?
IRCTC రైల్ కనెక్ట్ యాప్ ప్రధానంగా టికెట్ బుకింగ్, మెయింటెనెన్స్ కోసం ఉపయోగించబడుతుంది. దీని ద్వారా టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. PNR స్టేటస్ చెక్ చేయడానికి, టికెట్ బుకింగ్స్ కు, చెల్లింపులకు ఈజీగా ఉంటుంది. తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన స్వరైల్ సూపర్ యాప్ ద్వారా రిజర్వ్ డ్, అన్ రిజర్వ్ డ్ టికెట్ బుకింగ్ లు, రైల్వే ఎంక్వయిరీ, ఫుడ్ ఆర్డర్, ఫిర్యాదులు సహా అన్ని సేవలను ఇందులోనే పొందే అవకాశం ఉంటుంది.
IRCTC రైల్ కనెక్ట్, స్వరైల్ యాప్ ఫీచర్లు
IRCTC రైల్ కనెక్ట్ యాప్ ద్వారా ప్రయాణీకులు రిజర్వ్ డ్ టికెట్లను ఈజీగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే. స్వరైల్ యాప్ ద్వారా ఫ్లాట్ ఫారమ్ టికెట్ తో పాటు అన్ రిజర్వ్ డ్ టికెట్లను కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు యాప్‌లు UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్వరైల్ అన్ని సేవలను అందిస్తున్నది. PNR స్టేటస్ ఎంక్వయిరీ విషయానికి వస్తే, రెండు యాప్‌లు ఈ ఫీచర్ ను అందిస్తాయి. అయితే, సంబంధిత రైలు వివరాలను అందించడంలో స్వరైల్ మరింత ఫాస్ట్ గా ఉంటుంది. రెండు యాప్ లలో రీఫండ్ ట్రాకింగ్ అందుబాటులో ఉంటుంది.
ఇక లాగిన్, భద్రతలోనూ వ్యత్యాసం ఉంటుంది. IRCTC రైల్ కనెక్ట్ యాప్ కు వేర్వేరు రైల్వే సేవలకు ప్రత్యేక లాగిన్‌లు అవసరం. స్వరైల్ యాప్ లో ఒకే సైన్ ఇన్ తో అన్ని సేవలను పొందే అవకాశం ఉంటుంది. అంటే, వినియోగదారులు ఒకేసారి లాగిన్ అయి అన్ని సర్వీసులను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండు యాప్‌లు PIN, బయోమెట్రిక్ లాగిన్ ఆప్షన్స్ తో సెక్యూర్ యాక్సెస్ ను అందిస్తాయి.
ఇక స్వరైల్ యాప్ తో మరో ప్రయోజనం ఏంటంటే? IRCTC రైల్ కనెక్ట్ లో అందుబాటులో లేని అన్ని అదనపు సర్వీసులు ఇందులో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. సరుకు రవాణా, పార్శిల్ సేవలను ట్రాక్ చేయవచ్చు. ఫిర్యాదులను నమోదు చేయడానికి రైల్ మదద్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్లు IRCTC రైల్ కనెక్ట్ తో పోలిస్తే స్వరైల్ లో చాలా మెరుగ్గా ఉంటాయి.
ఈ రెండు యాప్ లలో ఏది బెస్ట్?
ఓన్లీ రిజర్వేషన్ టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవాలంటే IRCTC రైల్ కనెక్ట్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. రైల్వే సంబంధిత సేవలన్నింటినీ కోరుకుంటే స్వరైల్ తప్పకుండా ఉపయోగించాల్సిందే! క్లీన్ యూజర్ ఇంటర్ ఫేస్, సింగిల్ లాగిన్, ఫుడ్ ఆర్డరింగ్, ఫిర్యాదుల నిర్వహణ లాంటి ఫీచర్లతో స్వరైల్ చాలా సేవలను అందిస్తున్నది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
Read Also: ఏపీ, తెలంగాణలో 117 రైల్వే స్టేషన్లకు ‘అమృత్’ హంగులు.. ఇదిగో మొత్తం జాబితా!