Aadhaar OTP IRCTC: దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు వాడే ఇండియన్ రైల్వే ఇప్పుడు తత్కాల్ టిక్కెట్ల విషయంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ ప్రక్రియలో ఆధార్ ఆధారిత గుర్తింపు తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు అమలులోకి తెస్తోంది. ఇది జూన్ 10న భారత రైల్వే శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన. ప్రయాణికుల భద్రత, మోసాలను నివారించడంతో పాటు, ఏజెంట్ల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఈ కొత్త మార్పులు తీసుకొచ్చారు. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో సాధారణ ప్రయాణికులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
ఆధార్ కీలకం..
మొదటగా, జూలై 1, 2025 నుంచి IRCTC వెబ్‌సైట్, యాప్ ద్వారా తత్కాల్ టిక్కెట్లు బుక్ చేయాలంటే, ప్రయాణికుడి ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. కేవలం ఆధార్ ప్రామాణీకరణ (Aadhaar authentication) చేయబడిన ఖాతాల్లోనే తత్కాల్ బుకింగ్‌కి అనుమతి ఇవ్వనున్నారు. అంటే మీరు మీ IRCTC ఖాతాలో ఆధార్ నంబర్ నమోదు చేసి, ఆ ఆధార్‌కి లింకైన మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ వాలిడేషన్ చేయించాలి. మీరు ఇంతవరకూ అది చేయకపోతే, వెంటనే లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఓటీపీ కోసం ఇలా చేయండి
అంతేకాదు, జూలై 15, 2025 నుండి ఈ ఆధార్ ఆధారిత ఓటీపీ ప్రామాణీకరణ పద్ధతి మరింత కఠినంగా అమలవుతుంది. ఆన్‌లైన్ బుకింగ్ మాత్రమే కాదు, రైల్వే స్టేషన్లలోని PRS కౌంటర్ల ద్వారా, అలాగే ఏజెంట్ల ద్వారా జరిగే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌లకు కూడా ఆధార్ ఆధారిత ఓటీపీ గుర్తింపు తప్పనిసరి అవుతుంది. మీరు మీ ఆధార్ కార్డులో నమోదైన మొబైల్ నంబరే వాడాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చే ఓటీపీ ద్వారా బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. దీని వల్ల ఫేక్ బుకింగ్స్, డూప్లికేట్ ప్రయాణికుల వివరాల బుకింగ్ వంటి వాటికి చెక్ పడనుంది.
ఇంకా ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే, తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల్లో ఏజెంట్లకు టిక్కెట్లు బుక్ చేసే అవకాశం ఉండదు. అంటే సాధారణ ప్రయాణికులకు మొదటగా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకొచ్చారు. ఉదాహరణకు, AC క్లాసుల తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఉదయం 10:00 నుండి 10:30 వరకు ఏజెంట్లు టిక్కెట్లు బుక్ చేయలేరు. అదే విధంగా, నాన్-AC క్లాసులకు తత్కాల్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే 11:00 నుండి 11:30 వరకు ఏజెంట్లకు అనుమతి ఉండదు. ఈ పద్ధతితో సాధారణ ప్రయాణికులకు ముందు అవకాశం లభిస్తుంది.
Also Read: Visakha Tourism: విశాఖకు వెళ్లారా? ఇక్కడికి వెళ్లకుంటే ఇంకెందుకు?
ఆధార్ కెవైసీ తప్పక అవసరం
ఈ కొత్త మార్పుల వల్ల ప్రయాణికులు ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా మీ ఆధార్ కార్డ్‌లో నమోదు చేసిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందా? లేదంటే వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. ఎందుకంటే అదే నంబరుకు ఓటీపీ వస్తుంది. మీ IRCTC ఖాతాలో కూడా ఆధార్ లింక్ చేయాలి. ఇది మీరు IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా My Profile సెక్షన్‌లో చేయొచ్చు. అవసరమైన సందర్భంలో Aadhaar KYC ఆప్షన్ ద్వారా ఓటీపీ వాలిడేట్ చేయవచ్చు.
ఇదే మార్పుకు కారణం
ఇండియన్ రైల్వే తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు, ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చేందుకు దోహదపడతాయి. మోసపూరిత బుకింగ్‌లు, ఏజెంట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇది మంచి మార్గం. ముఖ్యంగా నిజమైన ప్రయాణికులకు అవకాశం కల్పించేలా ఈ రూల్స్ రూపొందించారు. ప్రయాణం సాఫీగానే సాగాలంటే.. ముందే సిద్ధమైపోవాలి. ఆధార్ ప్రామాణీకరణ పూర్తి చేసి, తత్కాల్ ప్రయాణం కోసం మేజర్ మార్పులకు సన్నద్ధంగా ఉండాలి. ఇంకా మీ ఆధార్ ఎలా లింక్ చేయాలో, ఓటీపీ సమస్యలు వస్తే ఎలా పరిష్కరించాలో తెల్సుకోవాలంటే, మీ దగ్గర్లోని IRCTC సపోర్ట్ లేదా రైల్వే హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.