Udaan Yatri Cafe: సాధారణంగా విమానాశ్రయాలలో ఫుడ్ ఐటెమ్స్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. టీ, కాఫీ, స్నాక్స్ తీసుకున్నా వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలపై ప్రయాణీకుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ధరలు తగ్గించాలని విమానయాన శాఖ నిర్ణయించింది. అందులో భాగంగానే ఎయిర్ పోర్టులలో కొత్త కేఫ్ లను ప్రారంభిస్తోంది. ‘ఉడాన్ యాత్రి కేఫ్’ల పేరుతో వీటిని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ కేఫ్ లలో తక్కువ ధరకే వాటర్ బాటిల్స్ తో పాటు ఫుడ్ ఐటెమ్స్ లభించేలా చర్యలు తీసుకుంటున్నది.
టీ ధర రూ. 10, కాఫీ ధర రూ. 20
తాజాగా పూణే అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను అంబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర విమానయాన శాఖ. ఈ కేఫ్ లో తక్కువ ధరలకే తినుబండారాలు అందుబాటులో ఉంటాయి. కేవలం రూ.10కే వాటర్ బాటిల్ లేదంటే టీ లభిస్తుంది. రూ.20కే కాఫీ లేదంటే స్నాక్స్ అందిస్తున్నారు. ఏ ప్రయాణికుడూ అధిక ధరలో ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ కేఫ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో ప్రారంభమైన ‘ఉడాన్ యాత్రి కేఫ్ లు’ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. నాణ్యత, రుచి, ధరల పట్ల ప్రయాణీకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘ఉడాన్ యాత్రి కేఫ్’లో ధరల వివరాలు
⦿ టీ: రూ. 10
⦿ వాటర్ బాటిల్: రూ. 10
⦿ కాఫీ: రూ. 20
⦿ సమోసా: రూ. 20
⦿ స్వీట్లు: రూ. 20
Read Also: రైలులో చైన్ లాగితే ఇత్తడే.. అది ఏయే సందర్భాల్లో వాడాలంటే?
దేశవ్యాప్తంగా ‘ఉడాన్ యాత్రి కేఫ్ ల’ విస్తరణ
‘ఉడాన్ యాత్రి కేఫ్ ల’కు ప్రయాణీకుల నుంచి లభిస్తున్న మంచి స్పందన నేపథ్యంలో ఈ కేఫ్ లను దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలకు విస్తరించనున్నట్లు విమానయాన శాఖ వెల్లడించింది. అన్ని వర్గాల ప్రయాణీకుల నుంచి ఈ కేఫ్ ల పట్ల మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపింది. “‘ఉడాన్ యాత్రి కేఫ్’ కేవలం ఆహారానికి సంబంధించిన షాప్ మాత్రమే కాదు, ప్రయాణీకులకు తక్కువ ధరలో రుచికరమైన స్నాక్స్ అందించాలని భావిస్తున్నాం. తక్కువ ధరలలో ప్రయాణీకులకు వాటర్, టీ, కాఫీ, స్నాక్స్ అందించడమే ఈ కేఫ్ లక్ష్యం. ఈ కేఫ్ లకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో దేశంలోని ఇతర విమానాశ్రయాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. విమాన ప్రయాణీకులపై ఆర్థిక భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది” అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే కోల్ కతా, చెన్నై, పూణే సహా మరికొన్ని ఎయిర్ పోర్టులలో ఈ కేఫ్ లను ప్రారంభించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు సహా అన్ని ఎయిర్ పోర్టులలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు.
Read Also: ఈ రైలు ప్రపంచమంతా తిరిగేస్తుంది.. సింగపూర్ నుంచి ఆ దేశానికి ఎన్ని రోజుల్లో చేరుతుందంటే?