Big TV Live Originals: భారతదేశం అనగానే ముందు గుర్తొచ్చే విషయం ఆధ్యాత్మిక. ఇండియాలో వేల కొద్ది ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే పురాతన కోటలు, రాజభవనాలు ప్రపంచ పర్యటకులను సైతం ఆకర్షిస్తాయి. అందుకే మన దేశంలో వాళ్లే కాకుండా ప్రపంచ నలు మూలల నుంచి వచ్చే టూరిస్ట్‌లు కూడా ఎక్కువగానే ఉంటారు. కొన్ని ఆలయాలకు వెళ్లడంపై నిషేధం ఉంటుంది.
ఆయా ప్రాంతాల్లోని ఆచారాలు, సాంప్రదాయాలు, ఇతర కారణాల వల్ల ఆలయాల లోపలికి వెళ్లనివ్వరు. అంతేకాకుండా కొన్ని ఆలయాల్లో దుష్ట శక్తులు, ఆత్మలు తిరుగుతాయని కూడా కొందరు చెబుతారు. అలాంటి ప్రదేశాలకు వెళ్తే అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇండియాలో అలాంటి గుళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటిలోకి వెళ్లేందుకు ఎందుకు అనుమతి ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం..
గుడిలో భూతవైద్యం
రాజస్థాన్‌లో ఉన్న మెహందీపూర్ బాలాజీ గుడికి వెళ్లేందుకు చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఈ గుడిలో చెడు ఆత్మలు, చేతబడి వంటి వాటని తొలగించే పూజలు జరుగుతాయట. దెయ్యాలు పట్టిన వారిని ఇక్కడికి తీసుకొచ్చి భూత వైద్యం చేయిస్తారు. అయితే ఇక్కడి వెళ్లే సందర్శకులకు కూడా దెయ్యాలు పట్టే అవకాశం ఉందట. తరచూ ఆత్మలు ఆవహించిన వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కొత్త వారు ఈ గుడికి వెళ్తే చాలా భయంకరమైన అనుభూతిని పొందుతారు.
మగవారికి నో ఎంట్రీ
అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య దేవి గుడికి కొన్ని సందర్భాల్లో మగవారిని అనుమతించరట. శక్తి పీఠాల్లో ఒకటైన ఈ ఆలయాన్ని కామాఖ్య దేవికి అంకితం ఇచ్చారు. అంబుబాచి మేళా సమయంలో, దేవి రుతుస్రావాన్ని జరుపుకుంటారట. ఆ సమయంలో పురుషులను నాలుగు రోజులు గుడిలోకి అనుమతించరు. ఈ సమయంలో తెలియకుండా ఎవరైనా మగవారు గుడిని సందర్శిస్తే అసౌకర్యంగా అనిపిస్తుందట.
మహిళలకు మాత్రమే
కేరళలో ఉన్న అట్టుకల్ భగవతి ఆలయంలో కూడా కొన్ని సందర్భాల్లో మగవారికి అనుమతి ఉండదట. ప్రతి ఏటా ఈ గుడిలో అట్టుకల్ పొంగల ఉత్సవం జరుగుతుంది. ఇది మహిళలకు మాత్రమే పరిమితం. పురుషులు ఈ సమయంలో ప్రవేశించకూడదట. ఎవరైనా ఆలయం లోపలికి వెళ్తే చెడు జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.
ALSO READ: ఆ దేశాల్లో దెయ్యాలు తిరుగుతున్నాయట..! మరి మన దేశంలో..?
అయితే ఉత్సవం జరిగే సమయంలో మగవారికి అనుమతి ఉండకపోవడం వెనుక ఇతర కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఈ గుడి మహిళల భక్తికి ప్రాధాన్యత ఇస్తుందట. అందుకే పొంగల సమయంలో మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుందని మరికొందరు చెబుతారు.
బ్రహ్మచారులకు మాత్రమే
రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉన్న బ్రహ్మ గుడి లోపలికి వెళ్లేందుకు పైళ్లైన మగవారికి అవకాశం లేదట. బ్రహ్మదేవునికి అంకితమైన ఈ గుడిలో వివాహిత పురుషులను లోపలి గర్భగుడిలోకి అనుమతించరు. పురాణ కథనం ప్రకారం, సరస్వతి శాపం కారణంగా ఈ నిషేధం ఉంది. పెళ్లైన పురుషులు తెలియకుండా వెళ్తే అనర్థం జరుగుతుందట
వివిధ ప్రదేశాలలో ఉన్న సంతోషి మాత ఆలయాల్లోకి వెళ్లడానికి మగవారికి అనుమతి ఉండదు. సంతోషి మాత గుడిలో, సంతోషి మాత వ్రతం సమయంలో, ముఖ్యంగా శుక్రవారాల్లో పురుషులను అనుమతించరు. ఈ వ్రతం మహిళలు, పెళ్లికాని ఆడపిల్లలు ఆచరిస్తారు. ఈ వ్రతం మహిళల భక్తికి ప్రాధాన్యత ఇస్తుంది, కాబట్టి శుక్రవారాల్లో పురుషులు దూరంగా ఉండాలని అర్చకులు చెబుతారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.