Underground World: ఎక్కడైనా కొంచం చెడు వాసన వస్తే చాలు ముక్కు మూసుకొని పక్కకు వెళ్లిపోతాం. డ్రైనేజ్ వాసన వస్తే ఇంకా ఏమైనా ఉందా..? అబ్బా.. ఊహించుకోవడానికి కూడా మనసు రావడం లేదు కదా? మరి మురుగు కాలువలో నడవాల్సి వస్తే..? అది కూడా మురుగు కాలువ ఓ టూరిస్ట్ స్పాట్‌గా మారితే? అదేంటి అనుకుంటున్నారా? అయితే పారిస్‌లో ఉన్న ఈ సీక్రేట్ ప్లేస్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే..
పారిస్ అంటే ఈఫిల్ టవర్, లూవ్రే మ్యూజియం, షాంప్స్ ఎలిజే అనే అద్భుతాలు గుర్తొస్తాయి. కానీ ఈ అందాల నగరం కింద ఇంకో అద్భుత ప్రపంచం ఉంది. పారిస్ మురుగు కాలువలు! ఈ అండర్‌గ్రౌండ్ సిస్టమ్ ఇప్పుడు టూరిస్టులకు ఓ విభిన్నమైన అనుభూతిని ఇస్తోంది.
కాలువల కింద కలల ప్రపంచం!
ఈ కాలువల నిర్మాణం 19వ శతాబ్దంలో జరిగింది. అప్పట్లో ఇది నగర శుభ్రత కోసం ఓ పెద్ద ప్రయోగం. కానీ ఇప్పుడు? ఇది ఒక రకాల అండర్‌గ్రౌండ్ సిటీలా మారిపోయింది. వీధిలాగా బోర్డులు, నడక మార్గాలు, వివరణాత్మక గైడ్స్ అన్నీ ఉన్నాయి. పైకి ఓ పారిస్ ఉంటే, కింద ఇంకో పారిస్ ఉంది అనే అనుభూతి కలుగుతుంది. కాలువలోని కొన్ని భాగాలను మ్యూజియం లా మార్చి, 19వ శతాబ్దంలోని ఇంజినీరింగ్, శానిటేషన్ విజ్ఞానాన్ని ప్రజలకు చూపిస్తున్నారు.
సాహస గాథలు
విక్టర్ హ్యూగో రాసిన లెస్ మిజెరబుల్ అనే నవలలో ఈ కాలువలు ప్రస్తావించబడ్డాయి. కథలో ఓ పాత్ర ప్రమాద సమయంలో ఈ కాలువల్లోంచి తప్పించుకుంటుంది. అప్పట్నించి ఈ ప్రదేశం పాపులర్ అయింది. అంతేకాదు, రెండవ ప్రపంచ యుద్ధంలో కొంతమంది ఇక్కడ దాక్కొని ప్రాణాలు రక్షించుకున్నారు. ఇవన్నీ ఈ ప్రాంతానికి చరిత్రాత్మక విలువను పెంచాయి. రెసిస్టెన్స్ బృందాలు ఈ మార్గాలను రహస్యంగా ప్రయాణించడానికి, సమాచారాన్ని మార్చుకోవడానికి ఉపయోగించాయి. కొన్ని బంకర్లు ఇంకా నిలిచిపోయి ఉన్నాయి.
కాలక్రమేణా మారిన రూపం
1800లలో ఈ కాలువల టూర్ కోసం చిన్న రైలు రథాలు, బోటులు ఉపయోగించేవారు. అయితే నిర్వహణ కష్టాల వల్ల 1920 తర్వాత బోటు టూర్లు ఆపివేశారు. కొంతకాలం మూసివేశారు కూడా. కానీ ఇప్పుడు పారిస్ సివర్ మ్యూజియం ద్వారా మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సురక్షిత నడక మార్గాలు, ప్రాచీన యంత్రాలు, పని చేసిన కార్మికుల కథలు అన్నీ ఇందులో భాగం.
చరిత్ర గురించి చెప్పే చోటు
ఈ కాలువల పొడవు సుమారు 1,600 మైళ్లు! వీధిలాగే ఉన్న బోర్డులు చూసినప్పుడు ఇది నిజంగా ఓ అండర్‌గ్రౌండ్ సిటీ అనిపిస్తుంది. పాత పనిముట్లు, యంత్రాలు చూసినప్పుడు మనకు పాత రోజుల్లో వాళ్లు ఎలా శ్రమించారో తెలుస్తుంది.
యువతకి ట్రెండీ స్పాట్
ఇప్పుడు ఈ ప్రదేశం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, స్టోరీలకి ఇది ఓ రేర్ బ్యాక్‌డ్రాప్. ‘రాటటూయ్’ సినిమాలో కూడా ఈ కాలువలు కనిపించడం వల్ల దీని పాపులారిటీ మరింత పెరిగింది. కొంతమంది ఇక్కడ సీక్రేట్‌గా పాార్టీలు కూడా చేసుకుంటారట.
ఎందుకెళ్లాలి?
ఇది చరిత్రతో అనుబంధం ఉన్న అరుదైన అనుభవం. అనుభవం అందుకే దీన్ని సందర్శించడానికి చాలా మంది ఇష్టపడతారు. అంతేకాకుండా ఇవన్నీ సురక్షితమైన నడక మార్గాలు. ఫోటోలు తీసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ లొకేషన్. సిటీ ప్లానింగ్ అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు దీన్ని తప్పక సందర్శించాలి.