Viral News: కొంత మంది చెప్పే మాటలకు, చేసే చేష్టలకు అస్సలు సంబంధం ఉండదు. బయటకు తన అంత మంచి వాళ్లు, మనసున్న వాళ్లు ఎవరూ లేరని గప్పాలు కొట్టుకుంటారు. లోపల మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఓ కిలేడీ వ్యవహారం తాజాగా బయటపడింది. ఓవైపు జంతు ప్రేమికురాలిగా కలరింగ్ ఇస్తూ, మరోవైపు ఆ కుక్కులను చంపితింటుంది. అసలు విషయం తెలియడంతో అందరూ షాకయ్యారు.
దత్తత పేరుతో దారుణం
చైనాకు చెందిన ఓ మహిళ జంతు ప్రేమికురాలిగా కలరింగ్ ఇచ్చేది. వీధి కుక్కల మీద ఎనలేని ప్రేమను చూపించేది. అంతేకాదు, వీధి కుక్కలను దత్తత తీసుకునేది. వాటిని ఎంతో ప్రేమగా సాదుకుంటాను అని చెప్పేది. చాలా మంది ఆమె కుక్కల పట్ల చూపిస్తే ప్రేమను చూసి నిజమే అనుకున్నారు. కానీ, ఆమె అసలు కథ వేరేలా ఉంది. బయటకు మాత్రమే జంతు ప్రేమికురాలు. లోపల చేసే పని వేరేలా ఉంది. దత్తత పేరుతో వాటిని ఇంటికి తీసుకెళ్లేది. వారానికి ఓ కుక్కను కోసి రుచికరమైన ఆహారం తయారు చేసేది. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు వడ్డించేది. తాజాగా ఈ విషయం బయటకు రావడంత ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
విషయం బయటకు ఎలా వచ్చిందంటే?
లియోనింగ్ ప్రావిన్స్ కు చెందిన ఆ మహిళ.. పలు కుక్కల సంరక్షణ కేంద్రాల్లోని మంచి కుక్కలను సెలెక్ట్ చేసుకుని వాటిని దత్తత తీసుంటానని చెప్పి ఇంటికి తీసుకెళ్లేది. వాటిని చంపి వంట చేసేది. ఈ విషయం ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ద్వారానే బయటకు వచ్చింది. రీసెంట్ గా ఆమె కుక్కలను వండుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. “కుక్క మాంసం రెడీ అయ్యింది. బయట వర్షం పడుతోంది. వేడి వేడి కుక్క మాంసం తింటుంటే భలే ఉంటుంది” అని ఆ ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది. అంతేకాదు, తన పిల్లలకు కుక్క మాంసం తినిపిస్తూ.. “పిల్లలకు బెస్ట్ ఫుడ్ కుక్కమాసం” అని రాసుకొచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
నెటిజన్ల డిమాండ్ తో సదరు మహిళ అరెస్ట్
ఓవైపు జంతు ప్రేమికురాలిగా బయటకు కనిపిస్తూ, మరోవైపు కుక్కలను చంపి తినడాన్ని నెటిజన్లు గుర్తించారు. వెంటనే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు చేశారు. కుక్క మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆమెను అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఎన్ని కుక్కలను చంపింది? అనే అంశంపై ఆరా తీస్తున్నారు.
2020 నుంచి కుక్క మాంసంపై నిషేధం
గతంలో చైనాలో కుక్క మాంసం మీద ఎలాంటి ఆంక్షలు ఉండేవి కాదు. కానీ, 2020లో కరోనా వచ్చిన తర్వాత నిబంధనలు కఠినతరం చేశారు. చైనాలో తొలిసారి షెన్ జెన్ సిటీలో కుక్కల మాంసాన్ని తినడాన్ని నిషేధించారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా అమలు చేశారు.