ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వేదికగా కొనసాగుతున్న మహా కుంభమేళా ఆధ్యాత్మిక సంబురం అట్టహాసంగా కొనసాగుతున్నది. కోట్లాది మంది భక్తులు తరలి వచ్చి త్రివేణి సంగమంలో స్నానమాచరించి పునీతులవుతున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు వేలాది మంది ఆఘోరాలు, నాగ సాధువులు, బాబాలు తరలి వస్తున్నారు. శివనామస్మరణ చేస్తూ కనువిందు చేస్తున్నారు. ఇక మహా కుంభమేళాలో ఓ ఐఐటీ బాబా ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఉన్నత చదువులు చదివి సన్యాసిగా మారడం అందరినీ ఎంతగానో ఆకర్షించింది. ఐఐటీ బాంబేలో ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన మసాని గోరఖ్ బాబాగా మారిపోయారు. ఇంతకీ తను ఎందుకు బాబాగా మారాల్సి వచ్చిందో ఆయన మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
శివుడికి నా జీవితం అంకితం
హర్యానాకు చెందిన ఐఐటీ బాబా అసలు పేరు అభయ్ సింగ్. ఐఐటీ బాంబేలో ఆయన ఎరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ సమయంలోనే తను ఆధ్యాత్మికం వైపు మళ్లారు. ఫిలాసఫీ కోర్సులు చేశారు. ఎంతో మంది ఆధ్యాత్మిక వేత్తల గురించి, చరిత్రకారుల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆర్ట్స్ మీద తనకు ఆసక్తి కలగడంతో డిజైనింగ్ లో మాస్టర్స్ చేశారు. అయినా, ఆధ్యాత్మికత జ్ఞానం పెంచుకోవాలని భావించాడు. శివుడి గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయనే తన సర్వస్వం అనుకున్నారు. “బాంబే ఐఐటీలో చదివే రోజుల్లోనే ఏదో చేయాలనే తపన ఉండేది. కానీ, ఏం చేయాలో తెలిసేది కాదు. కొంతకాలం అసిస్టెంట్ ప్రొఫెసర్ గానూ పని చేశాను. ఆ తర్వాత డిజైనింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత నా ఆలోచన మారింది. పూర్తిగా ఆధ్యాత్మికం వైపు మళ్లాలి అనుకున్నాను. సన్యాసినిగా ఉండటమే చాలా సంతోషంకరమైన విషయం అనుకున్నాను. ఆ దిశగా అడుగులు వేశాను” అని చెప్పుకొచ్చారు.
మనశ్శాంతి దొరకకపోవడంతోనే సన్యాసిగా..
ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకున్నట్లు చెప్పిన ఆయన, కొంతకాలం పాటు ట్రావెల్ ఫోటోగ్రఫీ చేసినట్లు చెప్పారు. ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ లో ఉంటే నిత్యం కొత్త ప్రదేశాలను అన్వేషించే అవకాశం ఉంటుందనుకున్నానని చెప్పారు. కానీ, అది కూడా తనకు సరికాదని భావించినట్లు చెప్పారు. ఎందులోనూ తనను మనశ్శాంతి లభించలేదన్నారు. చివరకు బాబాగా మారానన్నారు. ఇప్పుడు తనకు దేని మీద చింతలేదన్నారు. ఆ పరమ శివుడి స్మరణలో జీవితాన్ని గడుపుతున్నట్లు వెల్లడించారు. మహా కుంభమేళాలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ये वही IITian बाबा है जो आज वायरल हुआ है। इन बाबा जी के यह स्प्रिचुअल कांसेप्ट उनके Instagram पर पड़े हैं।
सुनिए आप भी।
pic.twitter.com/8FIwkgDnGC— Jaiky Yadav (@JaikyYadav16) January 14, 2025
అట్టహాసంగా కొనసాగుతున్న మహా కుంభమేళా
ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా అట్టహాసంగా కొనసాగుతున్నది. దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించేందుకు సాధుసంతులు తరలివస్తున్నారు. ఆధ్యాత్మిక శోభతో ప్రయాగరాజ్ కనువిందు చేస్తున్నది.
Read Also: రూ. 7,500 కోట్లు ఖర్చు.. రూ. 2 లక్షల కోట్ల ఆదాయం, భళా.. మహా కుంభమేళా!