AP News : అమరావతిపై ఏదో జరుగుతోంది. వైసీపీ కుట్ర చేస్తోందని టీడీపీ అంటోంది. రైతుల భూములను పక్కదారి పట్టిస్తున్నారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. రాజధాని భూముల ధరలు తగ్గిపోతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారాన్ని గుర్తించిన మంత్రి నారాయణ వెంటనే రంగంలోకి దిగారు. రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారని.. పరిశ్రమలు రావాలంటే అదనపు భూమి అవసరం అన్నారు మంత్రి నారాయణ. రాజధానిపై సీఎం చంద్రబాబు లాంగ్ విజన్‌తో ఉన్నారని చెప్పారు.
సచివాలయ టవర్లకు టెండర్లు..
కేబినెట్ నిర్ణయం మేరకు.. అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచింది సీఆర్‌డీఏ. టవర్ 1, టవర్ 2 కోసం 1,897 కోట్లు.. టవర్ 3, టవర్ 4 నిర్మాణం కోసం 1,664 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. అలాగే HOD ఆఫీసుల కోసం 1,126 కోట్లతో మరో టవర్ కట్టేందుకు కూడా టెండర్ పిలిచింది. మొత్తం రూ.4,668 కోట్ల ఖర్చుతో 5 టవర్లు కట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
ఆర్థిక సంఘానికి సీఎం ప్రజెంటేషన్
ఏపీ సీఎం చంద్రబాబుతో 16వ ఆర్థిక సంఘం సమావేశమైంది. ఆ బృందానికి సచివాలయంలో ఫొటో ఎగ్జిబిషన్‌తో ఏపీ అవసరాలను వివరించారు. రాజధాని, పోలవరం నిర్మాణం, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్రం నుంచి రావాల్సి నిధులు, ప్రత్యేక సాయంపై నివేదిక ఇచ్చారు. విజన్ 2047, ప్రభుత్వ పాలసీలను అరవింద్ పనగారియా నేతృత్వంలోని ఆర్థిక సంఘానికి వివరించి చెప్పారు సీఎం చంద్రబాబు.
మూడేళ్లలో అమరావతి పూర్తి
భూములు ఇచ్చిన రైతులు భయపడాల్సిన పని లేదని.. ఇచ్చిన మాట ప్రకారం మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. అధికారుల భవనాలను ఏడాదిలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డును ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని అన్నారు. అమరావతిలో 68 నిర్మాణాలకు గాను.. రూ.42,360 కోట్ల విలువైన టెండర్లను ఇప్పటికే పిలిచామని స్పష్టం చేశారు. మొత్తంగా రాజధానిలో రూ.64,912 కోట్లతో 92 నిర్మాణాలు చేపడతామని మంత్రి చెప్పారు.
మెగా సిటీ.. మెగా ఎయిర్‌పోర్ట్
అమరావతి, విజయవాడ, గుంటూరు, తాడేపల్లి.. ఈ నాలుగు ప్రాంతాలను కలిపి మెగా సిటీగా రూపొందించే మాస్టర్ ప్లాన్‌ను సీఎం చంద్రబాబు రెడీ చేశారని నారాయణ తెలిపారు. ఈ మెగాసిటీకి అంతర్జాతీయ విమానాశ్రయం కోసమే 5 వేల ఎకరాలు అవసరం కానుందని చెప్పారు. భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకు విదేశాల నుంచి ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలని అన్నారు. వందేళ్ల అవసరాలకు సరిపడేలా.. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ తరహాలో అమరావతిలో విమానాశ్రయం నిర్మించాలనేది చంద్రబాబు ఆలోచన అని చెప్పారు.
పోలవరంలో కేంద్ర బృందం
అటు.. పోలవరంలో కేంద్ర నిపుణుల బృందం పర్యటించింది. మట్టి, రాతి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించనుంది. మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ప్రాజెక్టులో గ్యాప్ 1, గ్యాప్ 2, డయాఫ్రం వాల్ తో పాటు దండంగి, మట్టి డంపింగ్ ప్రాంతాల్లో నమూనాలు సేకరించనుంది. భారీ నిర్మాణాల వినియోగానికి ఆ మట్టి ఎంతవరకు అనుకూలమో పరీక్షించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర జలసంఘానికి నివేదిక ఇవ్వనుంది నిపుణుల టీమ్.
Also Read : నారా లోకేశ్‌ను ఫాలో అవుతున్న కవితక్క..
పోలవరం వడివడిగా..
పోలవరంలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 49 పునరావాస కాలనీల నిర్మాణాలకు పాత కాంట్రాక్టులను ఇప్పటికే రద్దు చేశారు. త్వరలోనే కొత్త టెండర్లు పిలవనున్నారు. 6 నెలల్లో పెండింగ్ పనులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు.