ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ తో వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. వైద్యులపై పనిభారం సగానికి సగం తగ్గుతోంది. నిపుణులైన వైద్యులు చేసే పనుల్ని చిటికెలోనే చేసిపెడుతోంది ఏఐ. అది కూడా నూటికి 90 శాతానికి పైగా కచ్చితత్వంతో. తాజాగా ఇన్ఫెక్షన్లను కనిపెట్టే ఏఐ ని తయారు చేశారు మాయో క్లినిక్ పరిశోధకులు. ప్రత్యేకంగా ఆపరేషన్ల తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్లు ఇది 94 శాతం కచ్చితత్వంతో కనిపెడుతోంది. దీనివల్ల వైద్యులకు శ్రమ తగ్గుతోందని అంటున్నారు. అంతే కాదు, ప్రారంభ దశలోనే ఇన్ఫెక్షన్లను కనిపెట్టడంతో రోగులుక ఎంతో మేలు చేసినట్టవుతోందని చెబుతున్నారు.
సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్..
ఆపరేషన్ల సమయంలో కలిగే ఇన్ఫెక్షన్లను సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ (SSI) అంటారు. దీనివల్ల చాలా ప్రమాదాలున్నాయి. సమస్యను సరిచేయడానికి ఆపరేషన్లు చేస్తుంటారు కానీ, ఈ సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ల వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. వీటివల్ల ఆపరేషన్ సక్సెస్ అయినా పేషెంట్ బతికే అవకాశాలు చాలా తక్కువ. అందుకే వైద్యులు ఆపరేషన్ తర్వాత రోగిని అబ్జర్వేషన్లో పెడతారు. ఇన్ఫెక్షన్లేవీ సోకలేదని తేలిన తర్వాతే వారిని డిశ్చార్జ్ చేస్తారు. అయితే కొన్నిసార్లు వీటిని కనిపెట్టడం అసాధ్యం. ఆపరేషన్ జరిగిన తర్వాత వెంటనే ఇన్ఫెక్షన్ సోకవచ్చు, లేదా 30 నుంచి 90 రోజుల మధ్య ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ సోకి రోగికి ప్రాణాపాయం కలుగవచ్చు. దీన్ని నివారించడానికి ఆపరేషన్ తర్వాత రోగుల్ని నెలకోసారి ఆస్పత్రికి రమ్మంటారు. వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి పంపిస్తుంటారు. అయితే అన్నిసార్లు ఆస్పత్రికి రావడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో రోగి ఇన్ఫెక్షన్ ని కనిపెట్టడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మాయో క్లినిక్ అభివృద్ధి చేసిన ఏఐ టూల్ వరప్రదాయనిగా మారుతుంది. జస్ట్ ఫొటో చూసి ఇన్ఫెక్షన్ ఉందో లేదో చెప్పేస్తుంది.
ఆపరేషన్ జరిగిన ప్రాంతాన్ని ఫొటో తీసి పంపిస్తే, ఆ ఫొటోని విశ్లేషించి ఇన్ఫెక్షన్ ఉందో లేదో ఏఐ చెప్పేస్తుంది. దీనికోసం చాలా ప్రయోగాలే జరిగాయి. 9 మాయో క్లినిక్ల నుంచి సేకరించిన డేటాతో ఈ ఏఐ పనితీరుని పరీక్షించారు. మొత్తం 6,000 మంది రోగుల నుంచి 20,000 కంటే ఎక్కువ ఫొటోలను సేకరించారు. వాటి ద్వారా ఈ ఏఐ టూల్ ని పరీక్షించారు. 94 శాతం యాక్యురసీటో ఇన్ఫెక్షన్లను ఏఐ టూల్ గుర్తించింది. మానవుల కంటికి కనిపించని న్యూరాన్ పొరలను ఏఐ టూల్ గుర్తిస్తుంది. ఫొటోలను చూసే వీటిని గుర్తించి ఇన్ఫెక్షన్ తీవ్రతను అంచనా వేస్తుంది. వీటి ద్వారా సదరు రోగిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ఇచ్చే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న రోగులకు మెరుగైన సంరక్షణను అందించడంలో ఇది తోడ్పడుతుంది.
వైద్యులకు ఉపయోగం..
ఇన్ఫెక్షన్లను గుర్తించే ఏఐ టూల్ ఆపరేషన్ తర్వాత గాయాల సంరక్షణకు పునాది వేస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. రోగుల సమస్యను ముందుగానే గుర్తించడంతోపాటు.. తీవ్రమైన నష్టం జరగకుండా కాపాడుతుంది. వైద్యులు అత్యవసర కేసులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఇది ఒక మార్గాన్ని అందిస్తుందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల రోగులు ఆస్పత్రుల వరకు రాకుండానే సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్లను గుర్తించవచ్చు.